Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేకువోలు డోజో... బ్యాక్స్ట్రాప్ మగ్గంలో నైపుణ్యం కలిగిన నేత కళాకారురాలు. 2020లో నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో వికో ఎత్నిక్ బ్రాండ్‌ను స్థాపించింది. ప్రస్తుతం ఇది అక్కడి మహిళలకు జీవనాధారంగా మారింది. అనుకోకుండా ఈ వ్యాపారంలోకి ప్రవేశించిన ఆమె తను స్థాపించిన సంస్థ గురించి ఏం చెబుతున్నారో చూద్దాం...
నాగాలాండ్‌కు చెందిన వేకువోలు డోజోకు చిన్న చేనేత యూనిట్లో బ్యాక్స్ట్రాప్ మగ్గం (నడుము మగ్గం) ఉంది. ఇది ఆ ప్రాంతంలో అందరికీ సుపరిచితం. ఈ మగ్గాలు నాగాలాండ్‌లో తరతరాలుగా వాడుకలో ఉన్నాయి. మగ్గం ఒక చివర వెదురుతో తయారు చేసి ఇంటి గోడకు బిగించేందుకు వీలుగా ఉంటుంది. ఇవి నేయవలసిన వస్త్రం వెడల్పుకు సమానమైన దూరంలో అమర్చబడి ఉంటాయి. మగ్గానికి మరో చివర బెల్ట్‌కు జోడించి వీపుకు కట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. దీనికి బ్యాక్స్ట్రాప్ మగ్గం అని పేరు పెట్టారు.
మహిళలను తనతో చేర్చుకుంది
చిన్న కుగ్రామం నుండి వచ్చిన వేకు తన జాతి నేత బ్రాండ్ అయిన Viko Ethnicని నడుపుతోంది. ఇది టేబుల్ లినెన్. దుస్తులతో పాటు మరిన్ని గృహ ఉపకరణాలను తయారు చేస్తుంది. ఇప్పుడు ఇది భారతదేశం అంతటా కస్టమర్ బేస్‌తో అద్భుతమైన సేకరణలను కలిగి ఉంది. ఈ సంస్థ గ్రామానికి చెందిన అనేక మంది మహిళలను తనలో చేర్చుకుంది. వీరిలో చాలా మంది ఒంటరి మహిళలు ఉన్నారు. వారికి తెలిసిన నైపుణ్యాన్ని ఉపయోగించి జీవనోపాధిని పొందే అవకాశాన్ని కల్పించారు.
ప్రారంభ రోజులు
వేకు తన తల్లి, సోదరి మగ్గం మీద గంటల తరబడి కూర్చొని గుడ్డ సంచులను తయారు చేసి స్థానిక మార్కెట్లో అమ్మడాన్ని చూస్తూ పెరిగారు. ''నేను మొదట నేయడానికి ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. కానీ 18 సంవత్సరాల వయస్సులో మా అత్త నాకు నేయడం నేర్పింది. ఎందుకంటే ఇది అనుసరించాల్సిన ఆచారం'' అని ఈ ప్రాంతంలోని ప్రముఖ చఖేసాంగ్ తెగకు చెందిన వేకు చెప్పారు. పెండ్లయిన తర్వాత వేకు భర్తతో కలిసి ఉత్తరప్రదేశ్ వెళ్లింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత చిన్నతనంలో తాను పొందిన అదే విధమైన పెంపకాన్ని తన పిల్లలకు అందించడానికి దిమాపూర్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. తన గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత వేకు తన పిల్లలు పెరుగుతున్నందున, వారి అవసరాలకు అనుగుణంగా సంపాదించడానికి, తన కుటుంబాన్ని పోషించడానికి కొత్త మార్గాలను అన్వేషించింది.
వర్క్‌షాప్‌కు హాజరై
'నా గ్రామంలోని ప్రతి స్త్రీకి నేయడం ఎలాగో తెలుసు. కానీ దాని నుండి డబ్బు ఎలా సంపాదించాలో మాకు తెలియదు'' అని వేకు చెప్పారు. యాదృచ్ఛికంగా అదే సమయంలో టాటా ట్రస్ట్‌ల సామాజిక సంస్థ అయిన అంతరన్ గ్రామంలో క్రాఫ్ట్ ఆధారిత వ్యాపారాలపై వర్క్‌షాప్‌ను నడుపుతోంది. దానికి హాజరు కావాలని వేకు నిర్ణయించుకున్నారు. అంతరాన్ అనేది క్రాఫ్ట్ డెవలప్మెంట్లో కీలకమైన మార్పులను తీసుకురావడానికి ప్రారంభించబడిన ట్రస్ట్‌ల క్రాఫ్ట్ ఆధారిత లైవ్లీహుడ్ ప్రోగ్రామ్‌లో కీలకమైనది. వేకు జూలై 2019లో శిక్షణ పొంది వెంటనే పని చేయడం ప్రారంభించారు. అంతరాన్ క్లస్టర్లో భాగంగా ఆమె కొన్ని ప్రదర్శనలకు కూడా హాజరయ్యారు. వర్క్‌షాప్ కూడా ఆమెకు ఎంతో ఉపయోగపడింది.
బృందానికి శిక్షణ ఇస్తూ
నవంబర్ 2020లో వేకు తన సొంత సంస్థను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దాని కోసం ఆమె మైక్రోలోన్ తీసుకున్నారు. నాగా యునైటెడ్ గ్రామంలో ఒక చిన్న స్థలాన్ని ఏర్పాటు చేశారు. మరిన్ని మగ్గాలను కొనుగోలు చేసి, స్థానిక మహిళలను కూడా తనతో కలుపుకున్నారు. డిజైన్లను రూపొందించడంలో బృందానికి శిక్షణ ఇవ్వడం నుండి సోషల్ మీడియాను మాస్టరింగ్ చేయడం, రిటైల్ ప్లాట్‌ఫారమ్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ను పొందడం వరకు కొత్తగా వచ్చిన వ్యాపారవేత్తగా తన దారికి వచ్చిన రోజువారీ సవాళ్లపై పోరాటం చేస్తూ అభివృద్ధి చెందడం ప్రారంభించారు.
ఆన్లైన్ ప్లాట్‌ఫాం ద్వారా
పెరిగిన మగ్గాలలో చాలా సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని గ్రహించాను. వాటితో గృహాలంకరణ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించాము. వివిధ స్థానిక ప్రదర్శనలలో వాటిని ప్రదర్శించాము. ప్రజలు మా గురించి, మా పని గురించి మాట్లాడటం ప్రారంభించారు. మరిన్ని ఆర్డర్లు మాకు వచ్చాయి'' అని వేకు చెప్పారు. మహమ్మారి ప్రారంభ నెలల్లో తన సంస్థను ప్రారంభించినప్పటి నుండి వేకు తన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో రిటైల్ చేయడంతో పాటు వివిధ మార్గాలను కనుగొనడంలో మునిగిపోయారు. ఆమెను జర్మన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ GIZ హర్ అండ్ నౌ ప్రాజెక్ట్‌కి నామినేట్ చేశారు. ఇది 'మహిళా పారిశ్రామికవేత్తల ఆర్థిక సాధికారత, మహిళల ద్వారా స్టార్ట్-అప్లు'పై దృష్టి సారించింది.
హర్ అండ్ నౌ
''హర్ అండ్ నౌ ప్రాజెక్ట్ నాకు సరైన సమయంలో వచ్చింది. నన్ను నమ్మిన ఇతరుల ప్రయత్నాల వల్లే నాకు రూ. 70,000 గ్రాంట్ లభించింది. ఆ సమయంలో నా వ్యాపారాన్ని స్థిరీకరించడంలో ఇది చాలా ఉపయోగపడింది'' అని వేకు చెప్పారు. ఆమె ఈ డబ్బును వైవిధ్యమైన కార్యక్రమాలకు ఉపయోగించారు. బయటి ప్రాంతాల నుండి ముడి పదార్థాలను దిగుమతి చేసుకున్నారు. ''నాగాలాండ్‌లో వివిధ రంగుల నూలు దొరకడం చాలా కష్టం. నేను పెద్ద మొత్తంలో నూలుకు రంగు వేయలేకపోయాను. హర్ అండ్ నౌ నుండి వచ్చిన నిధులు నాకు రంగుల నూలును కొనుగోలు చేయడానికి, నిల్వ చేయడానికి సహాయపడింది. ఆ నూలును నేను తర్వాత ఉపయోగించుకోవచ్చు'' అని వేకు చెప్పారు. ఆగస్ట్ 2021లో ఆమె తన సంస్థను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. తయారీ ప్రక్రియపై పూర్తి నియంత్రణ కోసం పత్తి విత్తనాలను విత్తడం ప్రారంభించారు. ముడి సరుకును సోర్సింగ్ చేయడం నుండి పూర్తయిన ఉత్పత్తిని విక్రయించడం వరకు అన్నీ చూసుకోగలిగే స్థాయికి వచ్చారు. ''గత ఏడాది మేము విత్తిన పత్తి విత్తనాలు ఆశాజనక ఫలితాలను చూపించాయి. మేము మా దారాలను తయారు చేసి రంగు వేయాలనుకుంటున్నాం. ఒక జట్టుగా మేము దీన్ని చేయగలమని నమ్ముతున్నాను'' అని వేకు చెబుతున్నారు.
సమాజానికి తిరిగి ఇవ్వడం
ఒక వ్యాపారవేత్తగా వేకు జీవితం ఈ ప్రాంతంలో బాగా తెలిసినప్పటికీ ఆమెకు సంబంధించిన ఒక అంశం గురించి చాలామందికి ఇప్పటికీ పెద్దగా తెలియదు. ఆమెలో ఓ మానవతా దృక్పథం దాగి ఉంది. చాలా ఏండ్ల కిందట ఉపాధ్యాయుడైన తన భర్తతో కలిసి యుపిలో నివసిస్తున్నప్పుడు వేకు తన కమ్యూనిటీకి చెందిన ఆరేండ్ల బాలికను చూసింది. ఆమె తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. ఆమెను చూసుకోవడానికి బంధువులు లేరు. వేకు ఆ అమ్మాయిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు 16 ఏండ్ల ఆ అమ్మాయి కుటుంబంలో భాగమయింది. వేకు, ఆ అమ్మాయితో పాటు తన ముగ్గురు పిల్లలతో నివసిస్తుంది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన మరో 18 ఏండ్ల అబ్బాయిని కూడా వేకు దత్తత తీసుకున్నారు.