Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ నుంచి వచ్చిన సాహిత్యంలో మహిళల భాగస్వామ్యం గణనీయం. బండారు అచ్చమాంబ, డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి వంటి సాహితీ యోధలను కన్న నేల నల్లగొండ. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆ మట్టి నుంచి ఆవిర్భవించిన మరో సాహితీ ఆణిముత్యం ఉప్పల పద్మ. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పుట్టి పెరిగిన ఈమె కథా రచయిత్రిగా, కవయిత్రిగా, శతక కారిణిగా, పాటల రచయిత్రిగా, విమర్శకురాలిగా, సాహితీ సంస్థ వ్యవస్థాపకురాలిగా, ఉపాధ్యాయినిగా, బాలసాహిత్యకారిణిగా బహుముఖీన ప్రతిభను కనబరుస్తున్నారు. విమర్శ ప్రక్రియను చేపట్టిన మహిళలు సాధారణంగా తెలుగులో తక్కువగానే కనిపిస్తారు. ఇటీవల కాలంలో 'ఆకురాయి' ద్వారా విమర్శ రంగంలో ప్రవేశించిన ఉప్పల పద్మతో మానవి మాట ముచ్చట...
మీ కుటుంబ నేపథ్యం?
మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. అమ్మ అరుణమ్మ, నాన్న కొండయ్య. మా అమ్మానాన్నలకు మేం ముగ్గురు ఆడపిల్లలం. నేను చిన్నదాన్ని. ఇంటర్ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు నా పెండ్లి జరిగింది. మావారు చిలుకూరి మధు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. హరి చందన, హరి నందన. మావారి ప్రోత్సాహంతో చదువు కొనసాగించాను. వీ.A, వీ.ూష, వీ.జుస మూడు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలతో పాటు Aూ ూజుు తెలుగు, ఎడ్యుకేషన్లలో అర్హత సాధించాను. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ముదిగంటి సుజాతా రెడ్డి కథలు - సామాజిక సాంస్కృతిక దృక్పథంపై పరిశోధన చేస్తున్నాను. మొదట సెకండరీ గ్రేడ్ టీచర్‌గా నియామకమై తర్వాత మోడల్ స్కూల్ పి.జి.టి, టి.జి.టి ఉద్యోగాలతో పాటు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉద్యోగాన్ని ఏకకాలంలో సాధించి ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా.
సాహిత్యం పట్ల ఆసక్తి ఎలా కలిగింది?
ప్రముఖ బాల సాహితీవేత్త పెండెం జగదీశ్వర్, సాగర్ల సత్తయ్య వంటి సాహితీ మిత్రుల సాహచర్యం నన్ను మొదట బాల సాహిత్యం వైపు మళ్లించింది. తర్వాత వచన కవిత్వం, విమర్శ, పద్యం, కథలు, పాటలు వంటి ప్రక్రియలలో రచనలు చేయడం ఆరంభించాను.
మీ మొదటి రచనతో మీ అనుబంధం గురించి చెప్పండి?
నేను ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తొలినాళ్లలో జిల్లా విద్యా శిక్షణ సంస్థ(ణ×జుు) నల్లగొండ ఆధ్వర్యంలో జాబిలి అనే మాసపత్రిక వచ్చేది. ఆ పత్రికలో పిల్లల కోసం రచనలు చేయడం ప్రారంభించాను. వాటిని ఎంతో మంది ప్రశంసించడం, ప్రోత్సహించడం వల్ల రచయిత్రిగా నా బాధ్యత పెరిగినట్టు భావించాను.
ఓ ఉపాధ్యాయురాలిగా విద్యార్థులకు సాహిత్యం పట్ల ఏమేరకు అవగాహన ఉందని భావిస్తారు?
విద్యార్థులు సహజంగానే సృజనాత్మక శక్తిని కలిగి ఉంటారు. ఆ శక్తికి తగిన ఉత్ప్రేరకాన్ని అందించి వెలికి తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. విద్యార్థులు రాసిన అంశాలను ప్రశంసిస్తూ తగిన సూచనలు చేయగలిగితే అద్భుతాలు సృష్టించగలుగుతారు. ఏ మాత్రం సాహితీ వాతావరణం లేని కుటుంబాల నుండి వచ్చిన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు నేడు కథలు, కవితలు విరివిగా రాయగలుగుతున్నారు. నా సంపాదకత్వంలో వచ్చిన మిర్యాలగూడ మిణుగురులు (బాలల కవిత్వం), నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు (కథా సంకలనం) ఇందుకు నిదర్శనం. తెలంగాణ సారస్వత పరిషత్ బాల సాహిత్య గ్రంథ రచనలో భాగస్వామిగా ఉన్నాను. ఇంకా పిల్లలు రాసిన అముద్రితాలైన మూడు కథా సంకలనాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.
మీ కవితా సంపుటి 'వికసించిన ఆకాశం' గురించి చెప్పండి?
పలు కవిసమ్మేళనాలలో, వివిధ సాహితీ సభలలో పలువురు సాహితీవేత్తలు మీ కవిత్వం పుస్తక రూపంలో రావాల్సిన అవసరం ఉందని సూచించారు. అదే వికసించిన ఆకాశం కవిత్వ సంపుటి అయింది. ఈ సంకలనంపై దక్షిణాఫ్రికా సాహితీ వేదిక అధ్యక్షులు రాపోలు సీతారామరాజు, ప్రముఖ పరిశోధకులు డాక్టర్ మేక ఉమారెడ్డి, ప్రముఖ కాలమిస్ట్ చిటికెన కిరణ్ కుమార్, ప్రముఖ న్యాయవాది చకిలంకొండ నాగేశ్వరరావు తదితరులు వ్యాసాలను ప్రకటించారు.
ఆకురాయితో విమర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విమర్శ వైపు మళ్లడానికి గల నేపథ్యం ఏమిటి?
ప్రత్యేకమైన నేపథ్యం ఏమీ లేదు. చిన్ననాటి నుంచి పాఠశాల స్థాయిలో ఎప్పుడు వ్యాసరచన పోటీ పెట్టినా ప్రథమ బహుమతి నాదే. నేను ఏ పుస్తకం చదివినా దానిపై నాదైనా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాను. అక్షర రూపంలో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇదే నన్ను విమర్శ వైపు మళ్ళించింది. గత కొంతకాలంగా నేను రాస్తున్న వ్యాసాలను అనేక ప్రముఖ పత్రికలు ప్రచురించడం కొంత ఉత్సాహాన్ని ఇచ్చింది. అట్లా వివిధ ప్రక్రియలపై రాసిన వ్యాసాలను డాక్టర్ సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్ వాళ్లు 'ఆకురాయి' వ్యాస సంపుటిగా ప్రచురించారు. మహిళా రచయిత్రులను ప్రోత్సహించడానికి వారు పెట్టిన పోటీలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఆ సంవత్సరం ఎంపికైన ఏకైక విమర్శ గ్రంధం ఆకురాయి కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. పుస్తకం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఆనందం కలిగించింది.
విద్యారంగంలో మీ సేవలను సంక్షిప్తంగా వివరించండి?
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖకు విషయ నిపుణురాలిగా సేవలు అందించాను. పలు రాష్ట్ర, జిల్లా స్థాయి ఉపాధ్యాయ శిక్షణలలో విషయ నిపుణురాలిగా పాల్గొన్నాను. రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ సంస్థ(ఎస్సీఈఆర్టీ) నిర్వహించిన బాల సాహిత్య కార్యక్రమాలలో పాల్గొని 'స్పూర్తి ప్రదాతలు' అనే గ్రంథాన్ని రాశాను. టి - సాట్ నిపుణ(మన టీవీ) ఛానల్లో వివిధ పోటీ పరీక్షార్థులకు తెలుగు సాహిత్య పాఠాలు బోధించాను. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలల్లో అమలు పరుస్తున్న రీడ్ కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యురాలుగా ఉన్నాను. విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యపరిచేందుకు యూనిసెఫ్ కార్యశాలలో 'చిన్న వయసులో పెళ్లిళ్లు వద్దు', 'పిల్లలు ఉండాల్సింది బడిలోనే' అనే రెండు నాటికలు రాశాను. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో రూపొందించనున్న 'సరళ తెలుగు వాచకం' రచయిత బృందంలో పొడుపు కథలు రూపకల్పన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
ఉపాధ్యాయురాలిగా మీరు మర్చిపోలేని అనుభూతులు?
నా మార్గదర్శకత్వంలో పిల్లలు ఉపన్యాసం, సృజనాత్మక రచనలు, పద్య పఠన పోటీలలో జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఎంపిక కావడం ఎంతోమంది ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందుకోవడం మర్చిపోలేని జ్ఞాపకం. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ సౌజన్యంతో సాహితీ కౌముది వ్యవస్థాపక అధ్యక్షురాలిగా బాలల కోసం ఒక కథా కార్యశాలను నిర్వహించాను. ప్రముఖ బాల సాహితీవేత్తలచే కథా రచనలో విద్యార్థులకు శిక్షణ ఇప్పించాను. ఈ శిక్షణా శిబిరంలో సుమారు 200 మంది విద్యార్థులు కథారచనలో మెళకువలు నేర్చుకున్నారు. ఇది ఎప్పటికీ మరువలేను. ఉపాధ్యాయులుగా మనం కొంతమేర సృజనాత్మక అంశాలలో శిక్షణ ఇవ్వగలిగితే చాలు. విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారని నా విద్యార్థులు నిరూపించారు. ఒక ఉపాధ్యాయురాలిగా ఇది నాకెంతో సంతృప్తిని కలిగించే విషయం. ఇటీవల తెలంగాణ సాహిత్య అకాడమీ మన ఊరు మన చెట్టు ఇతివృత్తంతో బాలలకు కథల పోటీలు నిర్వహించినప్పుడు నేను పనిచేస్తున్న పాఠశాల నుండే పిల్లలు రాసిన వంద కథలను తెలంగాణ సాహిత్య అకాడమీకి సమర్పించాను.
మీకు ఇష్టమైన రచయిత, రచన గురించి చెప్పండి?
నాకు ఇష్టమైన రచయిత లేదా కవి ఒక్కరే అని చెప్పలేను. కానీ దాశరథి, కాళోజీ, శ్రీ.శ్రీ, అలిశెట్టి ప్రభాకర్, సినారె వంటి మహామహులైన కవుల కవిత్వం నాకెంతో ఇష్టం. ఆధునిక సాహితీవేత్తలలో డాక్టర్.ముదిగంటి సుజాత రెడ్డి కథలు, నవలలు, విమర్శ నాపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. కవిత్వ విషయంలో డాక్టర్.ఏనుగు నరసింహారెడ్డి 'మూలమలుపు', డాక్టర్.సుంకిరెడ్డి నారాయణరెడ్డి 'దాలి', డాక్టర్ బెల్లి యాదయ్య 'మా ఊరు అట్లా లేదు', బైరెడ్డి కృష్ణారెడ్డి 'ఆర్తి', తగుళ్ల గోపాల్ 'దండ కడియం' వంటివి నేను కూడా బలంగా కవిత్వం రాయడానికి స్ఫూర్తినిచ్చిన కవిత్వ సంపుటాలు.
నేటి స్త్రీ ఎలా ఉంటే రాణించగలదని మీ అభిప్రాయం?
స్త్రీ అనగానే అణకువగా, ఒద్దికగా ఉంటూ పరాధీనతకు నిర్వచనమై ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆత్మన్యూనతను విడిచి పెట్టాలి. స్థైర్యాన్ని, ధైర్యాన్ని మనసులో నింపుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. సమస్యలకు భయపడి తలవంచడం కన్నా ఎదిరించి నిలబడి పరిష్కరించుకునే తత్వాన్ని అలవర్చుకోవాలి. అన్ని రంగాలలో ముందడుగు వేయాలి. తమ ప్రతిభాపాటవాలను ఎప్పటికప్పుడు పదును పెట్టుకోవాలి. తనను తాను మెరుగు పరుచుకుంటూ తన కుటుంబానికి, తన ప్రాంతానికి కీర్తి పతాక కావాలి.
మీ భవిష్య ప్రణాళికల గురించి చెప్పండి?
సమాజంలో పాతుకుపోయిన విభిన్న సమస్యలపై చైతన్యం కలిగించే రచనలెన్నో చేయాలి. ఆకాశమే హద్దుగా(కథల సంపుటి), పసిడి పలుకులు (శతకం) ముద్రణ రూపంలోకి తేవాలనుకుంటున్నాను. సృజనాత్మక రంగంలో విద్యార్థుల కోసం విరివిగా కార్యశాలలు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీ, సాంస్కృతిక శాఖ, వివిధ సాహితీ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారం కోరతాను. నానాటికీ విద్యార్థులలో పుస్తకపఠనం తగ్గిపోతుంది. దీన్ని పెంచడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మంచి పాఠకులే మంచి రచయితలుగా రాణించగలరని నా నమ్మకం. విద్యార్థుల కథలు, కవిత్వం మరిన్ని సంకలనాలుగా వెలువరించాలనుకుంటున్నాను. గమ్యం తెలియక కాలం వృధా చేసే విద్యార్థుల కోసం చైతన్యవంతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను.
సాహిత్య రంగంలో ప్రవేశించాలనుకునే వారికి మీరిచ్చే సూచనలు?
సాహిత్యరంగంలో కావాలి అనుకుని వచ్చే వారి కంటే సహజంగా ప్రవేశిస్తారని నా అభిప్రాయం. అక్షరం అనంత మెదళ్ళకు కదలిక. అనేకానేక మనసులకు చైతన్య వీచిక. కాబట్టి కవులు, కవయిత్రులు సమాజ సంస్కరణే లక్ష్యంగా చైతన్య పథంలో కలాన్ని కదిలించాలి. సమానత్వాన్ని కాంక్షించే సాహిత్యాన్ని సృజించాలి.
- సాగర్ల సత్తయ్య, 7989117415