Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండుగంటే ఇల్లు శుభ్రం చేయడం, కొత్త బట్టలు కొనడం, బంధువులకు బహుమతులు కొనడం, తగ్గింపు ధరలకు గృహోపకరణాలు కొనడం వంటి అనేక అంశాల్లో మీరు బిజీగా ఉంటారు. పిల్లల కోసం కొత్త బట్టలు, క్రాకర్లు వస్తువులు వంటివన్నీ కొనుగోలు చేసి ఉంటారు. దీపావళి పండుగను ఆనందంగా పూర్తి చేసేందుకు ఇవే సరిపోతాయా? పిల్లల భద్రత గురించి పట్టించుకోరా? ఉత్సాహం మధ్య మనం జాగ్రత్త భావం మరచిపోతాం. కాబట్టి ప్రమాద రహిత, వ్యాధులు లేని దీపావళిని ఎలా జరుపుకోవాలో చూద్దాం.
చిన్న పిల్లలను ఎల్లప్పుడూ పర్యవేక్షించాలి: ప్రమాదాల గురించి తెలియని చిన్న పిల్లలకు మరింత శ్రద్ధ అవసరం. అప్పుడప్పుడే అడుగులు వేసే చిన్నపిల్లలు ఏదో ఒకటి తీసుకుని నోటిలో పెట్టుకుంటారు. ముఖ్యంగా దీపావళి సందర్భంగా పటాకులు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు వంటివి నోటిలో పెట్టుకుంటే ప్రమాదం. కాబట్టి ఈ విషయం చాలా అప్రమత్తంగా ఉండాలి.
భద్రంగా కాల్చండి: బాణాసంచా పేలుడు ఉత్సాహంతో చిన్నపిల్లల చేతులు, కాళ్లకు గాయాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు మందులు కాల్చేటపుడు పెద్దలు తప్పకుండా పక్కనే ఉండాలి. అలాగే ఎక్కువ శబ్దం, పొగ వచ్చే పేలుడు పదార్థాలను కొనకండి. ఇది మీ పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు.
దీపాన్ని సురక్షితంగా వెలిగించండి: దీపాలు వెలిగించే సమయాల్లో జాగ్రత్తగా లేకపోతే అగ్ని మన కొత్త బట్టలకు అంటుకునే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలను లైట్లకు, దీపాలకు దూరంగా ఉంచాలి. మండే పదార్థాలను సమీపంలో ఉంచవద్దు.
శబ్దం, పొగ: దీపావళి సమయంలో పిల్లలు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపకూడదు. శబ్ధ కాలుష్యం, వాయుకాలుష్యంతో నిండిన పటాకులను నలువైపులా పేల్చుతున్నారు. ఇది పిల్లల వినికిడి, శ్వాసను ప్రభావితం చేస్తుంది. వికారం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
సరైన దుస్తులు, బూట్లు ధరించండి: దీపావళి సమయంలో పిల్లలకు బట్టలు సరిగ్గా వేయకపోతే అవి నిప్పు రవ్వలు పడి కాలిపోతాయి. కాబట్టి సిల్క్ దుస్తులను అస్సలు వేయకండి. అలాగే వాడిపారేసిన క్రాకర్లపై అడుగు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అందుకే బూట్లు ధరిస్తేనే బయట నడవడానికి అనుమతించండి.
స్నాక్స్‌పై నియంత్రణ తప్పనిసరి: దీపావళి సందర్భంగా ఇంట్లో చాలా స్వీట్లు, స్నాక్స్ ఉంటాయి. వీటిని ఒకేసారి కడుపు నిండా తింటే పిల్లల్లో కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు తక్కువ స్నాక్స్, స్వీట్లు తినేలా చూసుకోండి.