Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని రకాల పదార్థాలు తీసుకున్నప్పుడు కడుపుబ్బరంగా అనిపిస్తుంది. చాలా అసౌకర్యంగా ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పుడు, కొన్నిసార్లు నెలసరి సమయంలో కూడా ఇలా అనిపించడం సహజం. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు నిపుణులు.
తక్కువ ఆహారం ఎక్కువసార్లు తినడం వల్ల కడుపుబ్బరం రాకుండా జాగ్రత్తపడచ్చు.
శరీరంలో సోడియం స్థాయులు పెరిగినా, డీహైడ్రేషన్‌కి గురైనా, టీ-కాఫీలు ఎక్కువగా తాగినా కడుపుబ్బరం బారిన పడే అవకాశాలెక్కువ. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగడం (గోరువెచ్చటి నీళ్లైతే మరీ మంచిది), వంటకాల్లో ఉప్పు తగ్గించడం మంచిదంటున్నారు నిపుణులు.
కొన్ని రకాల శీతల పానీయాలు తాగినప్పుడు కూడా కడుపు ఉబ్బరానికి గురవుతుంది. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ తాగాలనిపిస్తే మితంగా తీసుకోవాలి.
కొంతమంది పాస్తా, వైట్ బ్రెడ్ వంటివి తీసుకున్నప్పుడు కూడా కడుపుబ్బరంతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ పదార్థాల్ని మితంగా తీసుకోవడం మంచిది.
స్మూతీస్, పండ్ల రసాలు తాగేటప్పుడు స్ట్రా ఉపయోగించకుండా.. నేరుగా గ్లాస్‌తోనే తాగడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా గాలి కడుపులోకి చేరకుండా ఉబ్బరం రాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.
కడుపుబ్బరం సమస్యతో బాధపడుతున్న మహిళలు భోజనానికి ముందు (లంచ్, డిన్నర్ సమయాల్లో) ఒక అరటిపండు తినడం వల్ల సమస్య నుంచి త్వరితగతిన ఉపశమనం పొందచ్చని ఓ అధ్యయనంలో తేలింది. ఇలా రెండు నెలల పాటు ప్రయత్నిస్తే సమస్య సగానికి సగం తగ్గుతుందట.
కడుపుబ్బరానికి ప్రధాన కారణమైన మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే రోజూ 20 నిమిషాల పాటు ఎప్సమ్ సాల్ట్ బాత్ చేయడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.
కడుపుబ్బరం నుంచి ఉపశమనం పొందడానికి ఈ చిట్కాలు కొంతవరకు ఉపయోగపడతాయి. అయితే ఈ సమస్య ఎప్పుడో ఒకసారి కాకుండా పదే పదే తలెత్తితే మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. తద్వారా ఇతర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం తప్పుతుందంటున్నారు.