Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శీతాకాలం ప్రారంభమైంది. ఈ సీజన్లో జలుబు, దగ్గు సమస్యలు సర్వ సాధారణం. అయితే దీన్నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి..? టాబ్లెట్స్, టానిక్లు లేకుండానే ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ రాత్రి సమయంలో నాలుగు నుంచి ఐదు తులసి ఆకులను కడిగి నీటితో పాటు నానబెట్టాలి. పరగడుపున ఈ ఆకులను నీటితో పాటు మింగితే మంచిది.
అల్లంలోని గుణాల వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అందుకే జలుబు, వైరస్ బారిన పడిన వారికి త్వరగా కోలుకోవడానికి అల్లం సహాయపడుతుంది. గొంతు నొప్పితో బాధపడే వారికి సైతం అల్లం టీ మంచి ఔషదంగా పనిచేసి వేగంగా ఉపశమనాన్ని ఇస్తుంది.
జలుబు వలన కఫం పేరుకుపోయినపుడు అరలీటర్ నీటిలో స్పూన్ వాముపొడి, స్పూన్ పసుపు వేసి చల్లారాక తేనె కలిపి రోజులో ఎక్కువగా తాగడం వలన కఫం కరిగిపోతుంది.
మెత్తగా దంచిన వామును ఒక స్పూను, గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకోవడం వలన ఊపిరితిత్తులకు గాలిని చేరవేసే మార్గం శుభ్రపడుతుంది.
రోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో కాస్త పసుపు కలిపి తాగాలి. దగ్గు, జలుబుతో బాధపడేవారు ఈ పసుపు పాలను తాగితే ఇట్టే ఉపశమనం లభిస్తుంది.
కఫం ఎక్కువగా ఉండి ఇబ్బందిపడేవారు వెచ్చని పసుపు పాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
కర్పూరాన్ని నువ్వుల నూనెలో కరిగించి దాంతో తల, ఛాతీ, పాదాలకు మసాజ్ చేస్తూ ఉండాలి.
నల్లమిరియాలతో కషాయం చేసుకుని తాగడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. పాలలో కొద్దిగా పసుపు, మిరియాల పొడి కలుపుకొని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
వేడినీటిలో కాసింత పసుపు, కర్పూరం వేసి ఆవిరిపట్టాలి.