Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్ద పెద్ద పెండిండ్ల దగ్గర్నుంచి చిన్న చిన్న బర్త్‌డే ఫంక్షన్ల వరకు ఏ చిన్న పార్టీ జరిగినా ఇంట్లో సామాన్లు వాడడం లేదు. అన్నీ డిస్పోజబుల్ వస్తువులే వాడుతున్నారు. ప్లేట్లు, గ్లాసులతో పాటు స్పూన్లు కూడా వాడుతున్నాం. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వస్తువులే. ఈ మధ్య ప్లాస్టిక్ నిషేధం తర్వాత పెద్ద హౌటల్స్‌లో ప్లాస్టిక్ బదులుగా చెక్క స్పూన్లను వాడుతున్నారు. మనం కూడా ఇళ్ళలో జరిగే శుభకార్యాలకు ప్లాస్టిక్ డిస్పోజబుల్స్ వదిలేసి పేపర్ డిస్పోజబుల్స్ వాడితే మంచిది. పర్యావరణ పరిరక్షణకు సహకరించిన వాళ్ళుగా మిగిలిపోతాం. ఇప్పటి వరకు తయారు చేయబడిన ప్లాస్టిక్ వస్తువుల ప్రపంచ ద్రవ్యరాశి భూమ్మీద, నీటిలో నివసించే అన్ని జీవరాశుల ద్రవ్యరాశిని దాటి పోయింది. అంటే ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో ఉందో గమనించండి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, ప్లాస్టిక్ రీసైక్లింగ్ వలననే ప్రమాదం నివారించబడుతుంది. మనవంతుగా మనం ప్లాస్టిక్ స్పూన్లతో బొమ్మలు చేసి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.
నెమలి
దీనికి అట్టముక్కలు కూడా కావాలి. నెమలి శరీరాన్ని ఒక అట్టపై గీసుకొని దానిని కత్తిరించి పెట్టుకోవాలి. ఇంకొక అట్ట గుండ్రంగా రింగు మాదిరి కత్తిరించి ఉంచుకోవాలి. నెమలికి పెట్టాల్సిన రెక్కల్ని కూడా అట్టముక్కలు కత్తిరించాలి. క్రాప్ట్స్ షాపులలో గ్లిట్టర్ షీట్సు దొరుకుతున్నాయి. అవి తెచ్చుకుంటే బాగుంటాయి. లేదంటే నిండు బులుగు రంగులో ఉన్న వస్త్రాన్ని కూడా ఉపయోగించవచ్చు. నెమలి ఒరిజినల్ రంగు సరిపోయేలా ఎంచుకుంటే బాగుంటుంది. ప్లాస్టిక్ స్పూన్లను తీసుకొని వాటికి వెనక వైపు గ్లిట్టర్ షీటు ముక్కలు అతికించాలి. గుండ్రంగా రింగులా ఉన్న అట్ట మీద ఈ స్పూన్లను గుండ్రంగా అతికించుకుంటూ రావాలి. అప్పుడు పురి విప్పిన నెమలి తోకలా కనిపిస్తుంది. నెమలి శరీరానికి రెక్కలు రెండూ అమర్చాలి. ఫించాన్ని తోక దగ్గర అమర్చాలి. ప్లాస్టిక్ స్పూన్లతో నెమలి తయారైంది.
సీతాకోక చిలుకలు
ప్లాస్టిక్ స్పూన్లతో సులభంగా సీతాకోక చిలుకల్ని తయారు చేయవచ్చు. ఒక్కో సీతాకోక చిలుకకు నాలుగు స్పూన్లు ఉంటే చాలు. నాలుగు స్పూన్లను తల, తోక వేరు చేయాలి. తోకల్లో ఒక తోకను తీసుకొని నలుపురంగు వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్పూన్ల తల కాయల్లో రెండు మామూలుగానే ఉంచి మిగతా రెండింటిని సైజులో చిన్నవిగా కత్తిరించుకోవాలి. అంటే ఇవి సీతాకోక చిలుక రెక్కలన్నమాట. వీటిలో పెద్ద స్పూన్లు రెండు పైవైపున ఉండే రెక్కలు. చిన్న స్పూన్లు కింది వైపుకు ఉండే రెక్కలు. నలుపు రంగు వేసిన తోకకు రెండు వైపులా పై భాగాన రెండు పెద్ద స్పూన్లు అతికించాలి. రెండు చిన్న స్పూన్లను తీసుకొని కిందివైపుకు అతికించాలి. ఈ రెక్కలకు రంగురంగులతో చుక్కలు దిద్దాలి. తల వైపున రెండు శృంగాలు పెట్టాలి కదా! దీని కోసం ఒక ఇయర్ బడ్ను తీసుకొని రెండు ముక్కలుగా కత్తిరించి నలుపు రంగు వేసుకోవాలి. ఈ రెండు పుల్లలను దూది పైకొచ్చే విధంగా పెట్టి తల దగ్గర అతికించాలి. ఇప్పుడు సీతాకోక చిలుక తయారైంది. ఇలా రెండు మూడు సీతాకోక చిలుకల్ని తయారు చేసుకుని గోడకు అతికించుకుంటే బాగుంటుంది.
వేలాడే వాల్ హాంగింగ్
ఇది చాలా సింపుల్‌గా చేద్దాం. ఎక్కువ కష్టం లేకుండా గోడకు పద్మాలు పూసినట్టుగా చేద్దాం. ఒక చిన్న గుండ్రని అట్ట ముక్కను తీసుకోవాలి. పది రూపాయల నాణెం కన్నా కొద్దిగా పెద్ద సైజులో తీసుకుంటే చాలు. పొడుగ్గా ఉన్న ప్లాస్టిక్ స్పూన్లను తీసుకొని అక్కడొకటి అక్కడొకటి చుట్టూతా వచ్చేలా అతికించాలి. సుమారుగా 8 నుంచ 16 వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరికొన్ని స్పూన్లను కొద్దిగా కత్తిరించి పెట్టుకోవాలి. కొద్దిగా తోక కత్తిరించిన స్పూన్లను వీటి మధ్యలో అతికించాలి. ఇప్పుడు తోక బాగా కత్తిరించిన మరికొన్ని స్పూన్లను తీసుకోవాలి. వీటిని కూడా మధ్యలో అతికించుకుంటూ రావాలి. అంటే మూడు వరసలర్లో పువ్వులాగా వస్తుంది. నాలుగు స్పూన్లను తల వరకు నరికేసి నాలుగు స్పూన్లను దగ్గరగా గుమ్మటంగా అతికించాలి. దీనికి పసుపు రంగు వేసి మధ్యలో నిలబెట్టాలి. తెల్లని కలువపువ్వు తయారైంది. వాటిని రెండు మూడు చేసుకుని గోడకు వేలాడ దీస్తే బాగుటుంది.
దీపం
ఒక గాజు గ్లాసును తీసుకుని పక్కనుంచాలి. తలల వరకు కత్తిరించిన స్పూన్లను తీసుకోవాలి. గాజు గ్లాసుకు చుట్టూతా ఒక్కో స్పూనును నిలువుగా పెట్టుకొని అతికించాలి. చుట్టూ స్పూన్లు అతికిస్తూ వస్తుంటే గుమ్మటంలా తయారవుతుంది. పూర్తిగా అతికించాక బ్యాటరీతో వెలిగే లైట్లను వాటి మధ్యలో ఉంచాలి. వెలుగుతున్న దీపంలా కళకళలాడుతుంది. ద్వారానికి రెండు వైపులా పెట్టుకుంటే బాగుంటుంది.
ద్వార తోరణం
ఈ మధ్య వాకిలికి తోరణాలుగా మామిడాకులు కాకుండా రకరకాలుగా పెట్టుకుంటున్నారు. లేపాక్షి ఎంపోరియంలో పూసలు, గవ్వలు, అద్దాలు, గంటలు వంటి వాటితో ఎన్నో రకాలు అమ్ముతున్నారు. ఇంకా బంతిపూల మాలల్లాంటివి కూడా ఎప్పటికీ వాడనివి అమ్ముతున్నారు. వాటన్నిటి కన్నా మనింట్లో వాడే వ్యర్థాలతో మనమే తయారు చేసుకున్న తోరణాలు కట్టుకుంటే బాగుంటుంది. గుండ్రని అట్టముక్కలు నాలుగైదు తీసుకొని వాటిని స్పూన్లను అతికించాలి. అంటే స్పూన్ల తలలు మాత్రం కత్తిరించి పక్కనుంచుకోవాలి. ఈ అట్టముక్కల మీద గుండ్రంగా స్పూన్ల తలలను అతికిస్తూ పద్మం లాగా తయారు చేయాలి. మూడు, నాలుగు పద్మాలు తయారు చేయాలి. వీటిని అతికించడానికి పొడుగాటి అట్టను తీసుకోవాలి. దానికి ఊలు చుట్టేయాలి. పద్మాలను వేలాడ దీయాలి. ఊలుతో బంతుల్ని చేసి పూసలతో కలిపి ఎక్కించాలి. వీటిని పద్మాలకు వేలాడదీయాలి. ఇలా తయారైన తోరణం వాకిలికి కట్టుకోవాలి. చూడటానికి ఎంతో బాగుంటుంది.
వాల్ హ్యాంగింగ్
దీని కోసం ఖాళీ వాటర్ బాటిల్ కూడా కావాలి. వాటర్ బాటిల్‌ను సన్నని చీలికలుగా కత్తిరించి వాటికి ఊలు చుట్టేయాలి. ఊలు చుట్టిన చీలికలను రెండు చివర్లు అతికించి పూల రెక్కలుగా తయారు చేయాలి. ఈ పూల రెక్కల మధ్యలో ఒక స్పూనును అతికింఆఎచలి. రెక్క పైభాగాన పూసల లేసు వెయ్యాలి. మూడు రెక్కలను అతికించి పువ్వులా చెయ్యాలి. రెక్కల చివర ఊలు బంతుల్ని అతికించాలి. దీని కింది భాగాన గంటలు, పూసలు వరసగా దారానికి ఎక్కించి వేలాడ దీయాలి. ఐదారు వరసల గుత్తులు వేలాడదీస్తే బాగుంటుంది. దీన్ని వాల్ హ్యాంగింగ్గా అమర్చుకుంటే అందంగా ఉంటుంది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్