Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యాయామం చేయాలనుకుంటే మొదట మనం ఎంచుకునేమార్గం నడకే. అయితే నాలుగు రోజులు చేసి మరో రోజు మానేసి తిరిగి దాన్ని కొనసాగించడానికి ఇబ్బంది పడేవారు చాలామంది. ఈ ఇబ్బందిని అధిగమించి మీ నడకను కొనసాగించడానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.
రోజూ సాగించే అరగంట నడక శరీరాన్ని దృఢంగా ఉంచడమే కాదు కండరాలనూ, ఎముకలనూ బలంగా మారుస్తుంది. నరాలవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణ లోపాల్ని సరిచేసి, చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఇవన్నీ వృద్ధాప్యాన్ని త్వరగా దరికిరానివ్వవు. మరి ఇన్నిరకాల ప్రయోజనాలను అందించే నడకను ఆపొద్దు. ముందుగా పది నిమిషాలు అనుకోవాలి. మరుసటి రోజు మరో అయిదు నిమిషాలు పెంచుకుంటూ వెళ్లాలి. నడక మధ్యలో వేగాన్ని తగ్గించి 20 సెకన్ల తర్వాత తిరిగి మొదటి వేగాన్ని అందుకోవాలి. ఇలా నడిస్తే అలసట తెలియకుండానే పూర్తిచేయొచ్చు.
నడిచేప్పుడు ఏ మాత్రం ఉత్సాహం తగ్గకూడదంటే వెంట బరువులుండొద్దు. వాటిని చేతిలో అసలు పెట్టుకోవద్దు. ఫోన్ వంటివి మీ దృష్టినీ మరల్చే అవకాశమూ ఉంది. అందుకే పాకెట్స్ ఉన్న ట్రాక్ ధరించి అందులో ఉంచుకుంటే సరి.
ఆఫీసుకి వెళ్లినా, షాపింగ్‌కి వెళ్లినా... లిఫ్ట్‌ని వాడకుండా మెట్లు ఎక్కిదిగడం చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. నడకపై ఆసక్తి పెరుగుతుంది. ఉదయం... అనుకున్న సమయంకన్నా తక్కువగా నడిస్తే, మిగతాదాన్ని సాయంత్రం భర్తీ చేసుకోవడం మరవకూడదు. మొత్తానికి రోజూ కొంత సమయం నడవాలని అనుకుంటే దాన్ని రెండుమూడు భాగాలుగా చేసి కూడా పూర్తి చేయొచ్చు.