Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కౌశల్య శంకర్.. ప్రేమించి పెండ్లి చేసుకున్నందుకు సమాజానికి శత్రువయింది. కుల దురహంకారంతో బుసలు కొడుతున్న కన్న వారికి కంటిలో నలుసయింది. జీవితాంతం కలిసి బతుకుతానని మాటిచ్చిన సహచరుడిని కుల రక్కసి కడతేర్చింది. బాధతో కుంగిపోకుండా తన ప్రేమను అత్యంత దారుణంగా నరికి చంపిన తండ్రిపై పోరాటం చేసింది. తనలాంటి బాధితులకు అండగా నిలబడి వారికోసం గొంతు విప్పింది. ప్రస్తుతం వ్యాపారవేత్తగా మారి ఇతర మహిళలకు సహాయం చేయాలనుకుంటున్న ఆమె పరిచయం నేటి మానవిలో...
2016లో తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని ఉడుమల్పేట్ పట్టణంలో పట్టపగలే అందరూ చూస్తుండగా శంకర్ అనే దళిత యువకుడిపై, తేవర్ కమ్యూనిటీకి చెందిన అతని భార్య కౌసల్యపై దాడి చేశారు. శంకర్ అక్కడికక్కడే మృతి చెందగా కౌసల్య తీవ్ర గాయాలతో బయటపడింది. అప్పట్లో ఈ వార్త దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. ఈ భయంకరమైన సంఘటనకు చెందిన సీసీటీవీ ఫుటేజీ ద్వారా కౌసల్య కుటుంబమే కిరాయి హంతకులచే కులదరహంకార హత్యకు పాల్పడ్డారని తేలింది.
మరణశిక్ష విధించారు
శంకర్, కౌసల్య ఒకే కళాశాలలో కలిసి చదువుకున్నారు. వారి పరిచయం ప్రేమగా మారింది. ఆమె కుటుంబ వీరి పెండ్లికి అంగీకరించకపోవడంతో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. తక్కువ కులం వ్యక్తిని కూతురు పెండ్లి చేసుకోవడం ఇష్టం లేని తండ్రి ఎలాగైనా అతన్ని హతమార్చాలనుకున్నాడు. కిరాకి హంతుకులతో ఈ పని చేయించాడు. తన భర్త మరణానికి కారణం తండ్రే అని తెలిసిన కౌసల్య అతన్ని శిక్షించాలని పోరాటం చేసింది. ఫలితంగా 2017లో ఆమె తండ్రితో పాటు మరో ఐదుగురికి కోర్టు మరణశిక్ష విధించింది. అప్పట్లో ఈ తీర్పు ఒక మైలురాయి ఉన్నప్పటికీ మద్రాస్ హైకోర్టు 2020లో సెషన్స్ కోర్టు తీర్పును రద్దు చేసి ఆమె తండ్రిని, మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేయడంతో కౌసల్యకు మరో సారి అన్యాయం జరిగింది.
పోరాటం ఇంకా ముగియలేదు
కుల ఆధారితంగా జరుగుతున్న కులదురహంకార హత్యలకు వ్యతిరేకంగా తన స్వరాన్ని లేవనెత్తిన తీవ్ర ఉద్యమకారిణిగా ఉద్భవించింది. ఆమె తన భర్త పేరుతో అట్టడుగు వర్గాల పిల్లల జీవితాల్లో వెలుగులు చూడాలనే ఉద్దేశంతో ఒక ఫౌండేషన్‌ను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం బి.ఆర్.అంబేద్కర్, పెరియార్ బోధనలను తీవ్రంగా అనుసరించే ఆమె డప్పు వాయించడం కూడా నేర్చుకుంది. ఆత్మగౌరవ వేడుకలో డప్పు కళాకారుడుగా ఉన్న శక్తి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. శక్తి కూడా ఒక కార్యకర్త. కుల దురాగతాలకు వ్యతిరేకంగా గళం విప్పాడు. ''ఒక సమయంలో అతన్ని నేను అంగీకరించలేదు. కానీ తర్వాత నిర్ణయం మార్చుకున్నాను. సమాజం పట్ల నా కర్తవ్యాన్ని గ్రహించి ఉద్యోగానికి రాజీనామా చేశాను'' అని కౌసల్య చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగం వదిలేశాను
కౌసల్య ఇటీవల తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పారిశ్రామికవేత్తగా మారారు. కోయంబత్తూరులోని వెల్లలూరులో ఝా అనే బ్యూటీ సెలూన్‌ని ప్రారంభించింది. దీనిని నెల రోజుల కిందట సినీనటి పార్వతి తిరువోతు ప్రారంభించారు. ''ప్రభుత్వ ఉద్యోగం నన్ను పూర్తి సమయం కార్యకర్తగా పని చేయనీయలేదు. ఏ విధమైన సామాజిక సేవలో పాల్గొనడానికి అవకాశం లేకుండా పోయింది. నా ప్రధాన పోరాటం కులదురహంకార హత్యలపై ఉంది. నేను మీడియాతో మాట్లాడాల్సిన ప్రతిసారీ అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. ఇది చాలా కష్టంగా మారింది. నేను కాస్మోటాలజీని ఇష్టపడతాను కాబట్టి ఈ వ్యాపారంలోకి రావాలని నా స్నేహితులు కొందరు సూచించారు'' అని ఆమె చెబుతుంది.
సామాజిక కార్యక్రమాలకోసం...
బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసిన తర్వాత కౌసల్య బ్యాంక్ లోన్ తీసుకుంది. తన ఆభరణాలను తాకట్టు పెట్టినా పెట్టుబడి సరిపోక తన స్నేహితుల వద్ద మరికొంత తీసుకుని చివరకు ఝా ప్రారంభించింది. ''మహిళలు, పురుషులు, పిల్లలకు అంటూ ప్రత్యేక సేవలు లేకుండా కుటుంబ మొత్తం దీనిని ఉపయోగించుకోవచ్చు. మేము హెయిర్‌కట్‌లు, స్టైలింగ్‌కు మించి అన్ని బ్యూటీ సేవలను అందిస్తాము. అధిక నాణ్యత సౌందర్య ఉత్పత్తులను కూడా అందిస్తున్నాము'' అని ఆమె చెప్పింది. వ్యాపారం ద్వారా వచ్చిన కొంత మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడమే కాకుండా మిగిలిన వారిని తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించేలా ప్రోత్సహించాలని కౌసల్య కోరుకుంటోంది. ''మా సెలూన్ ఫ్రాంచైజీలు, అవసరమైన శిక్షణ, వారి సొంత కాళ్ళపై నిలబడటానికి, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు అవసరమైన అన్ని సహాయాలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము'' అని ఆమె చెప్పింది.
ఇద్దరినీ సమానంగా చూడాలి
పరువు హత్యకు వ్యతిరేకంగా కౌసల్య చేస్తున్న పోరాటం నిరంతరాయంగా సాగుతోంది. దీనిపై మరింత అవగాహన సంభాషణలు జరుగుతున్నాయని, అయితే ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పింది. ''ఇదంతా లింగ సమానత్వం కిందకు వస్తుంది. పిల్లలుగా ఉన్నప్పటి నుండి తల్లిదండ్రులు అబ్బాయిలను, అమ్మాయిలను సమానంగా చూడాలి. సమానత్వం అనేది సమాజ పురోగతిలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో తల్లిదండ్రులు మొదట అర్థం చేసుకోవాలి'' అంటుంది ఆమె.
చట్టాన్ని తీసుకురావాలి
కౌసల్య కులదురహంకార హత్య గురించి మాట్లాడటానికి అందుబాటులో ఉన్న ప్రతి వేదికను ఉపయోగించుకుంటుంది. అటువంటి కేసులకు అన్ని స్థాయిలలో, పోలీసులలో కూడా సున్నితత్వం అవసరమని అభిప్రాయపడింది. తమిళనాడులో కులదురహంకార హత్యలకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకురావాలని ఆమె అడుగుతుంది. ''ఈ ఘోరమైన నేరానికి వ్యతిరేకంగా రాజస్థాన్‌లో ఒక చట్టం ఉంది. డిఎంకె ప్రభుత్వం రాష్ట్రంలో కూడా అమలు చేస్తుందని నేను ఆశిస్తున్నాను'' అని ఆమె చెప్పింది.
శంకర్ సోషల్ జస్టిస్ ట్రస్ట్
తను వెళ్ళే మార్గంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఆమె పోరాటం ఎడతెగనిది. శంకర్ సోషల్ జస్టిస్ ట్రస్ట్ కుల హింస బాధితులకు సహాయం చేస్తుంది. ఇలాంటి సమస్యను ఎదుర్కోకుండా చాలా మంది మహిళలను ఆమె రక్షించింది. కులాంతర వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించినప్పుడు ఇది వారికి సురక్షితమైన స్థలాలను ఇచ్చింది. ''నేను చేస్తున్న ఈ పోరాటంలో నా స్నేహితులు, పెరియార్, అంబేద్కర్, మార్క్స్ అనుచరులు నాకు అడుగడుగునా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మానవాళికి మేలు చేయడానికి మనకు రక్తంతో సంబంధం లేదు, కారణంతో సంబంధం లేదు'' అని కౌసల్య అంటుంది.