Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమలపాకు జీర్ణాశయ పనితీరును మెరుగుపరచడమే కాదు శిరోజాలనూ ఆరోగ్యంగా ఉంచుతుందంటున్నారు నిపుణులు. యాంటీమైక్రోబియల్, యాంటీ బాక్టీరియల్ గుణాలున్న ఈ ఆకుల లేపనాలు జట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తాయని చెబుతున్నారు.
పది తమలపాకులకు తగినంత నీటిని కలిపి మిక్సీలో వేసి పేస్టు చేయాలి. ఇందులో మూడు చెంచాల నెయ్యి, చెంచాన్నర తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, శిరోజాలకంతటికీ లేపనంలా పట్టించి మృదువుగా నాలుగైదు నిమిషాలు మర్దనా చేసి అరగంట ఆరనివ్వాలి. గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ లేపనం మాడును ఆరోగ్యంగా ఉంచుతుంది. శిరోజాల చివర్లు చిట్లడం తగ్గడంతోపాటు రాలే సమస్యను దూరం చేస్తుంది. మృదుత్వాన్ని అందించి జుట్టును ఒత్తుగా చేస్తుంది.
ఆముదంతో పాటు అయిదు తమల పాకులను తీసుకొని తగినంత నీటిని చేర్చి పేస్టు చేయాలి. ఇందులో రెండు చెంచాల కొబ్బరినూనె, చెంచా ఆముదంవేసి బాగా కలిపి తలకు పట్టించాలి. గంట ఆరనిచ్చి రసాయనాల్లేని షాంపుతో తలస్నానం చేసి చివర్లో కండిషనర్ వేసుకోవాలి.
అయిదారు తమలపాకుల పేస్టుకు రెండు చెంచాల నువ్వుల నూనె లేదా కొబ్బరినూనె కలిపి తలకు పట్టించి గంటసేపు ఆరనిచ్చి స్నానం చేస్తే, జుట్టు మృదువుగా మారుతుంది. శిరోజాలు రాలే సమస్య తగ్గుతుంది.
పూలతో.. అర గుప్పెడు చొప్పున మందార పూలు, కరివేపాకు, తులసి ఆకులు, అయిదారు తమలపాకులను మిక్సీలో వేసి తగినంత నీటిని కలుపుతూ.. మెత్తగా చేయాలి. ఇందులో రెండు చెంచాల కొబ్బరినూనె కలిపి తలకు రాసి గంట తర్వాత స్నానం చేయాలి. వారానికి కనీసం రెండుసార్లు ఈ లేపనాలు వేసి తలస్నానం చేస్తే మృదువైన, ఒత్తైన జుట్టు సొంతమవుతుంది.