Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన శరీరంలో అణువణువూ నీరు ఉంటుంది. ఈ నీటి శాతం తగ్గినా, పెరిగినా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అందులో పాదాల వాపు కూడా ఒకటి. నెలసరికి కొన్ని రోజుల ముందు హార్మోన్లలో వచ్చే మార్పులూ ఈ సమస్యకు కారణమవుతాయి. మూత్రపిండాల్లో సమస్యలు, కాలేయ సమస్యలు, హృద్రోగాలు.. వంటి అనారోగ్యాల వల్ల కూడా పాదాల్లో నీరు చేరడం సహజం. దీంతో శరీరం బరువుగా అనిపిస్తుంది. కీళ్లు, కండరాల్లో నొప్పులు వస్తాయి. నీటి శాతం మరింత పెరిగితే పాదాలు, కాళ్లు ఉబ్బుతాయి.
పాదాల వాపు సమస్యను తగ్గించుకోవాలంటే ముందుగా ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. కారం, మసాలాలు మితిమీరి తీసుకోకూడదు. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకోవాలి. బార్లీ, అల్లం, ఆకుకూరలు, అరటిపండ్లు, మజ్జిగ.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి. టొమాటో రసం తాగితే మంచిది. పడుకునేటప్పుడు పాదాల కింద దిండు పెట్టుకోవడంతో పాటు నడక, సైకిల్ తొక్కడం.. వంటి వ్యాయామాలు, కాళ్లు పైకి ఎత్తి చేసే ఆసనాలు సాధన చేయాలి.
మునగాకు రెమ్మలను తీసుకుని ఆకులు దూసేయాలి. ఆ కాడలను చిన్న ముక్కలుగా తరిగి, అందులోంచి గుప్పెడు తీసుకొని రెండు గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. నీరు సగం అయ్యాక ఆ కషాయాన్ని వడకట్టి, అందులో అరచెంచా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని వేడివేడిగా తాగాలి. ఈ కషాయం శరీరంలో ఉన్న అధిక నీటిని మూత్రం రూపంలో బయటికి పంపిచేస్తుంది. తద్వారా వాపు సమస్య చాలా త్వరగా అదుపులోకి వస్తుంది. అలాగే బార్లీ గింజలు ఉడికించిన నీటిని రెండు పూటలా తాగినా సమాన ఫలితం ఉంటుంది.