Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు కోరుకొన్న లక్ష్యాలు చేరుకొంటూ కెరీర్లో చకచకా ముందుకు వెళ్లిపోతుంటారు. మరికొందరికి ప్రతిదీ వెనకడుగే అవుతుంది. అలాంటివాళ్లు ఈ విషయాలపై ఓసారి దృష్టిసారించండి..
మీరే పనిచేసినా దానికి ఆటంకాలు వస్తున్నాయా? ఇందుకు ప్రధాన కారణం 'ఈ పనికాదేమో' అనే అనుమానంతో మొదలుపెట్టడమే. అందువల్ల మీరు పనిచేస్తున్నంత సేపూ ప్రతికూలంగానే ఆలోచిస్తుంటారు. అలాకాకుండా 'ఈ పని పూర్తయితీరుతుంది!' అనే ఆశావహ దృక్పథంతో పనిని ప్రారంభించండి. మీ సామర్థ్యానికి మించిన పనులు కూడా చేసేస్తారు.
కెరీర్లో ఒడుదొడుకులు సహజం. కానీ దాన్నే పట్టుకొని కూర్చుంటే విజయదారులు మూసుకుపోయినట్టే. అలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు 'ఇదీ తొలగిపోతుందిలే' అనుకోండి. అప్పుడే ఆ సమస్యని వదిలి వేరే విషయాల్లో విజయం సాధించడానికి ప్రయత్నిస్తారు. అందులో విజయం సాధిస్తే మీ పాత సమస్య అసలు సమస్యగానే అనిపించదు. ఆత్మవిశ్వాసంతో దాన్ని అధిగమించగలుగుతారు.
నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఎవరో ఒకరు సలహా ఇవ్వకపోరా? అని ఎదురుచూడొద్దు. సమయం కేటాయించి, అధ్యయనం చేసి తెలుసుకోండి. అలాగని ఇతరుల సలహాలను తీసుకోవద్దని కాదు. ఆ సలహాలు మీ నిర్ణయంలో లోటుపాట్లను సరిదిద్దేవిగా ఉండాలే కానీ, వాళ్ల ఆలోచనల మూసలో మీరు ఒదిగిపోకూడదు.
పాత స్నేహితుల నుంచీ సహోద్యోగుల వరకూ ప్రతి ఒక్కరినీ సందర్భం చూసుకొని పలకరిస్తూనే ఉండాలి. ఈ నెట్వర్క్ ప్రక్రియ మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఈతరం వ్యక్తిగా ఉంచుతుంది.
రాత్రి పడుకోబోయే ముందు కనీసం ఈ రోజు సాధించిన మూడు విజయాలని ఓసారి మనసులో తలచుకోండి. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.