Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ పిండం ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రోజువారీ ఆహారంలో విటమిన్లు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే శరీరంలో హార్మోన్ల మార్పులు అనేక కొత్త, అసాధారణ లక్షణాలను కలిగిస్తాయి. దీన్ని సులభంగా ఎదుర్కోవాలంటే పౌష్టికాహారం తీసుకుంటే సరిపోతుంది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు, పండ్లు, రసాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మంచి ఆరోగ్యాన్ని, తాజాదనాన్ని అందించే కొన్ని జ్యూస్‌ల గురుంచి తెలుసుకుందాం.
అవకాడో జ్యూస్: అవకాడో జ్యూస్ గర్భధారణ సమయంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో శరీరానికి ఎక్కువ ఫోలేట్ అవసరం. ఒక గ్లాసు అవకాడో జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఫోలేట్ అందుతుంది. అలాగే ఇందులో ఉండే తక్కువ క్యాలరీలు, ప్రొటీన్లు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి, పిండం సక్రమంగా అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి.
కర్బూజ రసం: వేసవిలో ఈ రసానికి ప్రత్యేక గిరాకీ ఉంటుంది. నిజానికి ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గర్భిణీలలో జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పేగు సంబంధిత సమస్యలు ఉన్న వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కర్బూజ రసం తాగడం మంచిది.
పుచ్చకాయ రసం: పుచ్చకాయ పండులో బీటా కెరోటిన్, మెగ్నీషియం, జింక్, క్రోమియం, సహజ చక్కెరలు, ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవన్నీ శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వికారం వంటి జీర్ణ సమస్యల నుండి బయటపడటానికి సహాయపడతాయి.
ట్రీ యాపిల్ జ్యూస్: పుచ్చకాయలాగా ట్రీ యాపిల్ జీర్ణ సమస్యలకు త్వరిత పరిష్కారం. ఇందులో పొటాషియం, విటమిన్ సి, ఫోలేట్ వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. యాపిల్ జ్యూస్‌లోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
యాపిల్ జ్యూస్: యాపిల్ ప్రయోజనాలు చెప్పనవసరం లేకుండా పూర్తి రుచిని కలిగి ఉంటాయి. అందరికీ ఇష్టమైన ఆపిల్ రసంలో విటమిన్లు ఎ, సి , మినరల్స్ ఉంటాయి. యాపిల్స్‌లో ఆక్సాలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర సమస్యలను దూరం చేస్తుంది. గర్భిణీలు ఈ జ్యూస్‌ని రోజూ తీసుకోవాలి. ఇది నిద్రలేమికి మంచి మందు.
దానిమ్మ జ్యూస్: యాపిల్ జ్యూస్లానే దానిమ్మ రసంలో కూడా ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఈ రసం రక్త ప్రసరణను పెంచడానికి, రక్తంలో కణాల సంఖ్యను పెంచడానికి సహాయపడుతుంది. రోజూ దానిమ్మ రసం తీసుకోవడం వల్ల పిల్లల్లో మెదడు క్షీణతకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. ఇది ఆక్సిజన్, రక్త ప్రసరణను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.