Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దానం చేయాలంటే కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి మనసుకుండాలి. స్పందించే గుణం ఉండాలి. కోట్లు సంపాదిస్తున్నా పేదలకోసం ఒక్క రూపాయి ఖర్చుపెట్టని వారు దేశంలో ఎందరో. అలాంటి విద్య, వైద్యం, పర్యావరణంతో పాటు మరెన్నో సేవా కార్యక్రమాల కోసం విరివిగా విరాళాలు ఇస్తున్నవారు కొందరున్నారు. ఈ ఆరుగురు మహిళలు ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2022లో చేరారు. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్‌కు ముందు ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ దేశంలోని అత్యంత సేవాగుణం కలిగివున్న కోటీశ్వరును వెల్లడించింది. ఈ ఏడాదికి గాను మన దేశానికి చెందిన అత్యంత సేవాగుణం కలిగిన ఆ ఆరుగురు మహిళల గురించి తెలుసుకుందాం.
హురున్ ఇండియా, ఎడెల్ గివ్ ఇటీవలే ఎడెల్ గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2022ని వెల్లడించాయి. ఆరుగురు మహిళలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. FY22లో రూ. 120 కోట్ల విరాళంతో రోహిణి నీలేకని ఫిలాంత్రోపీస్కు చెందిన రోహిణి నీలేకని భారతదేశపు అత్యంత సేవాగుణం కలిగిన మహిళగా, USVకి చెందిన లీనా గాంధీ తివారీ అదే కాలంలో రూ. 21 కోట్లు విరాళంగా అందించారు. థర్మాక్స్‌కు చెందిన అను అగా, ఆమె కుటుంబం రూ. 20 కోట్లు విరాళంగా ఇచ్చి FY22లో మూడవ స్థానం సంపాదించారు.
రోహిణి నీలేకని
రచయిత్రి, సామాజిక కార్యకర్త, పాత్రికేయురాలు అయిన రోహిణి నీలేకని ఎన్నో విజయాలు సాధించారు. ఫలితంగా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని భార్య రోహిణి. ప్రస్తుతం ఈమె రోహిణి నీలేకని ఫిలాంత్రోపీస్కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. రోహిణి పౌర సమాజంతో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఈ సంవత్సరం 30 సంవత్సరాలు పూర్తయింది. ఆమె ఎక్కువగా పర్యావరణం, పారిశుధ్యం, విద్యపై దృష్టపెట్టారు. ఆమె అందించిన విరాళాలు చాలా వరకు ఈ రంగాలకే చేరాయి. పరిశుద్ధమైన నీరు, పారిశుధ్యం కోసం 2001లో ఆమె స్థాపించిన అర్ఘ్యం పౌండేషన్ ద్వారా, రోహిణి భారతదేశం అంతటా వివిధ కార్యక్రమాలకు నిధులు సమకూర్చారు. ఇటీవల ఓ వెబ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ''సంపద అసమాన పంపిణీ జరుగుతుంది. అందుకే దాన్ని అసరమైన పంచడం చాలా అవసరమని నేను ఎల్లప్పుడూ విరాళాలు ఇస్తూనే ఉంటాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సంపద బాధ్యత చివరికి సమాజంపై ఉంటుంది'' అంటున్నారు రోహిణి.
లీనా గాంధీ తివారీ
లీనా గాంధీ తివారీ ముంబైలో ఉన్న బహుళజాతి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ కంపెనీ USV ప్రైవేట్ లిమిటెడ్ చైర్పర్సన్. 'కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ హురున్ - ప్రముఖ సంపన్న మహిళల జాబితా' మూడవ ఎడిషన్‌లో ఆమె ఇటీవల భారతదేశంలోని ఆరవ సంపన్న మహిళగా పేరుపొందారు. USV ఫార్మా తన తాత, ప్రసిద్ధ సంఘ సంస్కర్త అయిన విఠల్ బాలకృష్ణ గాంధీ ఒక చిన్న సంస్థగా దాన్ని ప్రారంభించారు. ఆయన ఒక రాజకీయవేత్త కూడా. ఈ కంపెనీ ఔషధాలను దిగుమతి చేసుకునేది. తర్వాత 1960లలో ఒక అమెరికన్ కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్లో ఔషధాల తయారీ రంగంలోకి ప్రవేశించింది. ముంబైలోని వకోలాలో నిరుపేద బాలికలకు విద్యను అందించడానికి లీనా డాక్టర్ సుశీల గాంధీ సెంటర్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ కేంద్రానికి ఆమె అమ్మమ్మ అలాగే భారతదేశపు మొట్టమొదటి మహిళా డాక్టర్లు, గైనకాలజిస్టులలో ఒకరైన డాక్టర్ సుశీల పేరు పెట్టారు. లీనా గురించి ఎవరికీ తెలియని వాస్తవం ఏమిటంటే ఆమెకు జంతువుల పట్ల, ముఖ్యంగా సరీసృపాల పట్ల మక్కువ ఎక్కువ.
అను అగా
థర్మాక్స్ లిమిటెడ్ మాజీ చైర్పర్సన్ అను అగా ఈ సంవత్సరం హురున్ భారతదేశంలోని ఏడవ సంపన్న మహిళగా ఎంపికయ్యారు. ఆమె దాదాపు రూ. 20 కోట్లను విరాళంగా ఇచ్చారు. భారతదేశంలోని మూడవ అత్యంత ఉదార మహిళగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం టీచ్ ఫర్ ఇండియా చైర్‌పర్సన్‌గా అను తను విశ్వసించే విషయాలతో లోతుగా నిమగమై ఉన్నారు. థర్మాక్స్ సోషల్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ (TSIF) ఆకాంక్ష ఫౌండేషన్‌తో పాటు పూణే, ముంబైలలో తొమ్మిది ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలను నిర్వహిస్తోంది. అంతే కాకుండా టీచ్ ఫర్ ఇండియా, గివ్ఇండియా వంటి విద్యా కార్యక్రమాలకు ఆమె ఆర్థికంగా మద్దతు ఇస్తున్నానరు. సామాజిక రంగానికి ఆమె చేసిన కృషికి గాను 2010లో పద్మశ్రీ అవార్డును సైతం గెలుచుకున్నారు.
మంజు డి గుప్తా
డెబ్బై తొమ్మిదేండ్ల మంజు డి గుప్తా లుపిన్ ఫార్మా చైర్పర్సన్. మంజు నాలుగు దశాబ్దాలకు పైగా లుపిన్ బోర్డులో పనిచేశారు. లుపిన్ నిర్వహించే CSR కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడంతో పాటు దాని వివిధ కమిటీలలో కూడా పనిచేశారు. FY22లో మంజు రూ.16 కోట్లను గ్రామీణాభివృద్ధికి విరాళంగా అందించారు.
రేణు ముంజాల్
రేణు ముంజాల్ హీరో ఫిన్‌కార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ ఈజీ బిల్లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. K12 పాఠశాల, వృత్తి శిక్షణా కేంద్రం ఏర్పాటు, నిర్వహణతో సహా అనేక CSR ప్రాజెక్ట్‌లలో రేణు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు సంబంధించిన ప్రాజెక్టులపై కూడా ఆమె చురుకైన ఆసక్తిని కనబరుస్తుంది. FY22లో విపత్తు నివారణ కోసం రేణు ముంజాల్ ఆమె కుటుంబం కలిసి రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చారు.
కిరణ్ మజుందార్ షా
బయోకాన్ చెందిన కిరణ్ మజుందార్ షా ఎడెల్ గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2022 ద్వారా దేశంలోని ఆరవ అత్యంత ఉదార మహిళగా పేరుపొందారు.FY22లో కిరణ్ విద్యతో పాటు ఇతర సేవా కార్యక్రమాల కోసం రూ. 7 కోట్లను విరాళంగా అందించారు. ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ దేవి శెట్టి సహకారంతో బెంగుళూరులోని 1,400 పడకల మజుందార్ షా క్యాన్సర్ సెంటర్ నిర్మించి ఆమె ప్రసిద్ధి చెందారు. అందుబాటు ధరలో, అత్యాధునిక ఆరోగ్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.