Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెండ్లయిన కొత్తల్లో ఉన్న ఆకర్షణ... ఏ జంటలోనైనా సరే క్రమంగా తగ్గుతుంది. దాంతో 'నాపై ఒకప్పటి ప్రేమ లేదు' అంటూ అలుగుతుంటారు. ఇలాంటప్పుడు అభద్రతను తగ్గించుకుని ఆనందాల్ని పంచుకోగలగాలి. అదెలా సాధ్యమంటే...
పెండ్లయిన కొత్తల్లో మీరెలా ఉండేవారో గుర్తు చేసుకోండి. మొదటిసారి మీరు కలిసిన రోజూ, ఇచ్చిపుచ్చుకున్న కానుకలూ, వెళ్లిన ప్రదేశాల వంటి విషయాలను చర్చించండి. ఆ సమయంలో మీ మదిలో మెదిలిన భావాలను సంతోషంగా పంచుకోండి. ఇవి మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి.
వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన మీ ఇద్దరి మధ్యా కొన్ని తేడాలు ఉండొచ్చు. అయినంతమాత్రాన ఒకరికొకరు తగరనుకోవద్దు. ప్రస్తుతం అనుబంధం గురించి ఇద్దరూ నిజాయతీగా చర్చించుకోండి. ఆ చర్చలో సానుకూలాంశాలే కాదు... ప్రతికూల విషయాలూ ఉండాలి. ముఖ్యంగా ఒకరినొకరు బాధపెట్టిన సందర్భాలూ, ఇద్దరిలో ఒకరికొకరికి ఎప్పటికీ నచ్చే అంశాలూ, ఎలా మార్పు వచ్చిందీ, ఎక్కడ లోపాలున్నాయీ... ఇలా ప్రతిదీ చర్చించుకుంటే లోపం ఎక్కడ ఉందనేది ఇద్దరికీ తెలుస్తుంది.
సాధారణంగా భార్యాభర్తల మధ్య ఏ సమస్యయినా నెమ్మదిగా మొదలై, క్రమంగా పెరుగుతుంది. కానీ చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలని గుర్తుంచుకోండి. ఎదుటి వారికి కోపం వస్తుందనీ, సమస్య ఇంకా పెరుగుతుందనీ, అలాంటి విషయాలు చర్చించడం వల్ల సమయం వృథా అనీ అనుకోవడమే అందుకు కారణం. నిజానికి ఇలాంటివేం పెట్టుకోకుండా సమస్య ప్రారంభంలో ఉండగానే మాట్లాడుకుంటే మంచిది. ఆర్థిక వ్యవహారాలూ, పిల్లల పెంపకం, ఇంటి బాధ్యతలూ... ఇలా సమస్యలున్న అంశాలపై దృష్టిపెట్టి వాటిని ఎలా పరిష్కరించాలని ఆలోచించాలి.
ఇద్దరి మధ్యా మునుపటిలా ప్రేమ పెరగడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. అంటే చిన్నచిన్న విషయాలను చూసీచూడనట్టు వదిలేయడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రోత్సహించుకోవడం చేయాలి. వీటిని ఇద్దరూ పాటించాలనే నియమాన్ని పెట్టుకోవాలి.