Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దవాళ్లకు నచ్చకుండా పిల్లలు ఆడే విధానమే అల్లరి. కిందపడితే దెబ్బ తగులుతుందని, పరుగులు పెట్టేటప్పుడు గాయాలవుతాయని అవగాహన ఉండదు. ఇది పెద్దలకు ఆందోళన కలిగిస్తుంది. అందుకే వారిని భయపెట్టి కూర్చోబెడతారు. దీంతో పిల్లలు భయస్తులుగా మారతారు. ఏ పని చేసినా చెడు జరుగుతుందేమో అనే అనుమానం వారితోపాటు పెరుగుతుంది. అలాకాక వారికి జాగ్రత్తలు చెబుతూ, స్వేచ్ఛగా పరుగులు పెట్టనివ్వాలి. చిన్నా చితకా దెబ్బలు తగిలినా వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ఇది స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవడాన్ని నేర్పుతుంది.
పిల్లలు వారి మనసులోని ఆలోచనలను గోడలపై గీస్తుంటారు. అప్పుడు కోప్పడకూడదు. గది అందమే పోయిందని విమర్శిస్తే, వారి మనసు గాయపడుతుంది. దీంతో వారిలోని సృజనాత్మకతకు ఫుల్స్టాప్ పడుతుంది. ఇది వారి మెదడును ఎదగనివ్వదు. అలాకాకుండా పిల్లలు గీసిన ప్రతి గీతనూ మెచ్చుకోవాలి. అయితే అక్కడ కాదు... అని వారి కోసం డ్రాయింగ్ బోర్డును ఏర్పాటు చేయాలి. వారి సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు రంగు పెన్సిళ్లను కొనివ్వాలి. దీంతో ఆ చిట్టి మెదడు కొత్తగా ఆలోచించడానికి సిద్ధమవుతుంది. అలాగే ఎప్పుడూ స్నేహితులేనా అనకుండా ఇతరులతో కలిసి ఆడుకునేలా చేయాలి. అప్పుడే గెలుపోటములు, స్నేహం, త్యాగం, ఓదార్పు వంటివి అలవడతాయి.
కూర గాయలు తరగడం వంటి చిన్న చిన్న పనులు చేస్తామంటూ ఆరిందాల్లా వస్తారు. అలాంటప్పుడు ఆ.. ఇక అంతా చెడినట్టే అనకూడదు. కాయగూరలు కడగడం, సర్దడం, కోసినవి గిన్నెలో వేయడం వంటివి వారికి ప్రతి పని పైనా ఆసక్తిని పెంచుతాయి. బయట తీసుకెళితే అల్లరి చేస్తున్నారనుకోకుండా పిల్లలకు ప్రపంచాన్ని చూపించాలి. బయటి నుంచే వారు రకరకాల అనుభవాలను నేర్చుకుంటారు. వస్తువుల కొనుగోలు, అమ్మకాలు వంటివన్నీ అర్థమయ్యేలా చెప్పాలి. కొత్త వారిని పరిచయం చేసుకోవడం నేర్పాలి. ఎదుటి వారితో తేలికగా కలిసిపోయేలా అలవాటు చేయాలి. ఇవన్నీ వారికి జీవన నైపుణ్యాలను నేర్పుతాయి.