Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటు ఇంటి పనైనా, అటు ఆఫీస్ వర్క్ అయినా అనుకున్న సమయానికి పూర్తి కావాలంటే ముందుగా ఓ ప్రణాళిక నిర్ణయించుకోవడం ముఖ్యమన్నది తెలిసిందే. ఇందుకోసం ఆ రోజు చేయాల్సిన పనులేంటి? వాటిలో అత్యంత ప్రాధాన్యమున్నవేంటి? ఇలా ఓ జాబితా తయారుచేసుకోవాలి. ఈ సూత్రం ఆఫీస్ పనులకే కాదు.. ఇంటి పనులకూ వర్తిస్తుంది. ఆ జాబితా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం...
నిరంతరాయంగా పని చేసినా తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంది. తద్వారా ఆపై అటు ఆఫీస్ పని, ఇటు ఇంటి పనిపై దృష్టి పెట్టలేరు. ఫలితంగా దాని ప్రభావం చివరికి వర్క్-లైఫ్ బ్యాలన్స్ పైనే పడుతుంది. కాబట్టి ఏ పనైనా, ఎంత బిజీగా ఉన్నా నిర్ణీత వ్యవధుల్లో కొద్దిసేపు విరామం తీసుకోవడం మంచిది. దానివల్ల మనసు తిరిగి ఉత్తేజితమవుతుంది. అలాగని కొందరు కాఫీ, టీలు అదే పనిగా తాగేస్తుంటారు. దీని వల్ల ఆరోగ్యానికే నష్టం. కాబట్టి అలా చేయకుండా పని ప్రదేశాన్ని వదిలి కాసేపు నడవడం, మీకు నచ్చిన వారితో ఫోన్లో మాట్లాడడం, ఉన్న చోటే మెడిటేషన్ చేయడం, ఆహ్లాదకరంగా ఉండే మొక్కలు లేదా బొమ్మల్ని చూడడం వంటివి చేయచ్చు. ఎంతైనా మనసుకు ఒత్తిడిగా అనిపించినప్పుడు నచ్చిన పని చేస్తే ఆ ఆనందమే వేరు. ఇలా ఎప్పటికప్పుడు మనసును ప్రశాంతపరచుకుంటే చాలు.. ఏ పనైనా చకచకా పూర్తి చేసేసుకోవచ్చు.
కలిసి పంచుకోవాల్సిందే
'ఉద్యోగం చేసి సంపాదిస్తోంది కాకుండా ఇంటి పనులన్నీ నేనే చేయాలా?' అంటూ పని ఒత్తిడితో అప్పుడప్పుడూ విసుక్కోవడం చాలామందికి అలవాటే. నిజానికి అన్ని పనులు మనమే చేసుకోవాలంటే రోజులో ఉన్న 24 గంటలు సరిపోదు. అలాగని విశ్రాంతి లేకుండా పనిచేయడం ఎవ్వరి వల్లా కాదు. కాబట్టి ఇంటిని-పనిని బ్యాలన్స్ చేసుకోవాలంటే ఇంటి పనుల్లో మీతో పాటు కుటుంబ సభ్యులు కూడా పనిలో భాగం కావాలి. కూరగాయలు కట్ చేయడం, వంట చేయడం.. వంటివి భార్యాభర్తలిద్దరూ కలిసి పంచుకున్నా బట్టలు ఆరేయడం, వాటిని మడతపెట్టడం, ఇల్లు ఊడవడం.. వంటి చిన్న చిన్న పనుల్లో పిల్లల్నీ భాగం చేయాలి. ఇలా చేయడం వల్ల పని భారం తగ్గడంతో పాటు పిల్లలకూ పని అలవాటవుతుంది. తద్వారా అలసిపోకుండా వృత్తిలోనూ మెరుగ్గా రాణించచ్చు. వర్క్-లైఫ్ బ్యాలన్స్ చేసుకోవడానికి ఇదీ చక్కటి మార్గం అని గుర్తుపెట్టుకోండి.
ఆరోగ్యం జాగ్రత్త
ఇటు ఇంటి పని చేయాలంటే శరీరం సహకరించాలి.. అటు ఆఫీస్ పనులు పూర్తి చేయాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. ఈ రెండూ సాధ్యం కావాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. ఇందుకోసం తీసుకునే ఆహారం, చేసే వర్కవుట్స్ కీలకమని చెప్పచ్చు. చాలామంది మహిళలు బిజీ బిజీ అంటూ తమ కోసం కాస్త సమయమైనా కేటాయించుకోరు. ఆహారం విషయంలోనూ శ్రద్ధ వహించరు. వేళకు భోజనం చేయరు. తద్వారా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా సమయానికి భోజనం చేయడం ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. అలాగే రోజూ ఓ అరగంట పాటు వ్యాయామం, వాకింగ్ వంటివి చేస్తే మనసుకూ ఉల్లాసంగా ఉంటుంది. ఇక కుటుంబంతో కలిసి చేస్తే వారితో మరింత సమయం గడిపిన వారవుతారు. ఇలా సంపూర్ణ ఆరోగ్యం సొంతమైతే వర్క్-లైఫ్ బ్యాలన్స్ చేయడం పెద్ద కష్టమనిపించదు.