Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునిక యుగంలో కల్తీ రాజ్యం నడుస్తోంది. అక్రమ సంపాదనకు అలవాటుపడిన వారు ప్రతీ దాంట్లోనూ కల్తీలు, నకిలీలు పుట్టిస్తున్నారు. ఆఖరికి మనం తినే ఆహారంలోనూ ఇది మామూలైపోయింది. అయితే కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. మరోవైపు ప్రస్తుతం పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మందికి దృష్టి సమస్యలు ఉంటున్నాయి. వృద్ధాప్యం కారణంగా వృద్ధులకు కంటి చూపు మందగించవచ్చు. కానీ ఈ ఆధునిక యుగంలో టెలివిజన్లు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల అధిక వినియోగం చిన్న వయసులోనే కంటిచూపు మందగించడానికి దారితీస్తున్నాయి. ఇక మన రోజూ వారీ ఆహారం, పద్దతులు కూడా సరిగా లేకపోవడం చేత కంటి ఆరోగ్యం దెబ్బతింటోంది. కంటి సంరక్షణలో కొన్ని ప్రత్యేక ఆహారాలను మన రోజువారి ఆహారంలో చేర్చాలి. దీనివల్ల మంచి కంటిచూపును కాపాడుకోవడంతో పాటు, వివిధ కంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆహారంలో ఏ పదార్థాలను చేర్చాలో ఒకసారి తెలుసుకుందాం..
చేపలు: ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలకు గొప్ప మూలం. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతాయి. ఇది రెటీనాను కండ్ల వెనుక బాగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొడి కంటి సమస్యలను నివారించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ట్యూనా, సాల్మన్, మాకేరెల్, సార్డినెస్, ట్రౌట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ కండ్లకు ఎంతో మేలు చేస్తాయి.
పప్పులు: ఇవి ప్రోటీన్లకు గొప్ప మూలం. కిడ్నీ బీన్స్, బ్లాక్ ఐడ్ బఠానీలు, కాయధాన్యాలు బయోఫ్లేవనాయిడ్స్, జింక్‌లు మంచి వనరులు. ఇవి మీ కంటి చూపు, ఇతర కంటి పనితీరులకు సహాయపడతాయి.
గుడ్లు: ఇవి కంటికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్లు ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లతో నిండి ఉంటాయి. ఇవన్నీ కండ్లకు ఎంతో మేలు చేస్తాయి. గుడ్డు సొనలు విటమిన్ ఎ, లుటిన్, జియాక్సంతిన్, జింక్ కలిగి ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి.
పాలు, పెరుగు: పాల ఆహారాలు కూడా కంటికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి మనం తీసుకునే రోజువారి ఆహారంలో ఇలాంటి పదార్థాలు ఉండే విధంగా చూసుకుంటే ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు.