Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు.. ఆరోగ్యానికి వీటిని మించిన ఔషధాలు లేవంటున్నారు నిపుణులు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉండడమే దీనికి కారణం. పైగా ఇవి అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. మరి, వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...
బియ్యంలో కన్నా చిరుధాన్యాల్లో మాంసకృత్తులు దాదాపు రెట్టింపు మోతాదులో ఉంటాయి. ఫలితంగా ఎక్కువ సమయం ఆకలేయకుండా, ఇతర చిరు తిండ్లవైపు మనసు మళ్లకుండా జాగ్రత్తపడచ్చు. బరువును అదుపులో ఉంచుకోవడానికి ఇదీ ఓ మార్గంగా చెప్పుకోవచ్చు.
చిరుధాన్యాల్లో విటమిన్లూ ఎక్కువగా ఉంటాయి. బాగా శుద్ధి చేయడం, పాలిష్ చేయడం వల్ల గోధుమలు, బియ్యపు గింజల పైపొరల్లో ఉండే బి-కాంప్లెక్స్ విటమిన్లు తొలగిపోతాయి. అదే చిరుధాన్యాలను పొట్టు తీయకుండానే వాడుకునే వీలుండడం వల్ల థయమిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్.. వంటి 'బి' విటమిన్లు మన శరీరానికి అందుతాయి.
రాగుల్లో క్యాల్షియం, ఇనుము చాలా ఎక్కువ. పాలల్లో కన్నా రాగుల్లోనే క్యాల్షియం మోతాదు అధికం. అలాగే సజ్జలు, కొర్రల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది.
గర్భిణులకు అత్యవసరమైన ఫోలిక్ యాసిడ్ సజ్జల నుంచి బాగా లభిస్తుంది. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇనుము ఎక్కువగా ఉండటం వల్ల గర్భిణులకు సంపూర్ణ పోషకాహారంగా ఉపయోగపడతాయి. మొలకలెత్తిన సజ్జలైతే మరీ మంచిది. ఇవి తీసుకోవడం వల్ల పోషకాల స్థాయులు పెరగడంతో పాటు తేలికగా జీర్ణమవుతాయి.
చిరుధాన్యాల్లో పీచు మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల పెద్దపేగు క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చు. చిరుధాన్యాలన్నీ వేర్వేరు రంగుల్లో ఉంటాయి. ఇలా రంగుల్లో ఉండే ధాన్యాల నుంచి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి.