Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రియా ... ఓ ట్రాన్స్ ఉమెన్‌గా ఎన్నో సమస్యలు అనుభవించింది. లైంగిక వేధింపులు, సామాజిక దూషణలపై పోరాటం చేసింది. తాను ఎదుర్కొన సమస్యలే ఆమెను విజయపథంలో నడిపించాయి. తనలాంటి వారికి సాయం చేయమంటూ ప్రోత్సహించాయి. ప్రస్తుతం మదురైలో ట్రాన్స్‌జెండర్ రిసోర్స్ సెంటర్, ట్రాన్స్ కిచెన్‌తో పాటు మరెన్నో కార్యక్రమాలను చేపడుతూ తమ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో వైవిధ్యాన్ని చూపుతున్న ఆమె జీవన పోరాటం నేటి మానవిలో...
90వ దశకం ప్రారంభంలో యుక్తవయసులో వుంది ప్రియా బాబు. ఆ సమయంలో తన లైంగికతతో పోరాడుతూ తమిళనాడులోని చిన్న పట్టణమైన తిరుచ్చి నుండి ముంబైకి పారిపోయింది. ముంబై వీధుల్లో తనలాంటి వారిని ఆమె చాలా మందిని చూసింది. అక్కడ లైంగిక వేధింపుల నుండి సామాజిక కళంకం వరకు అనేక సమస్యలను ఎదుర్కొంది. ఆ కష్టాల నుండి తప్పించుకోవడానికి ప్రియా పుస్తకాలను చదువుతూ ఓదార్పు పొందేది. అవకాశం దొరికిన ప్రతిసారీ ధారవిలోని మురికివాడలకు తప్పించుకుని ఓ మారుమూల ప్రదేశానికి వెళ్ళి పుస్తకాలు చదువుతూ ఈ ప్రపంచాన్నే మర్చిపోయేది.
పుస్తకం మార్చేసింది
''నేను చిన్నతనంలో మా ఇంట్లో ఉన్నప్పుడు చాలా పుస్తకాలతో కలిసి పెరిగాను. ఎప్పుడూ చదువుతూనే ఉండేదాన్ని. ముంబైకి వెళ్ళినప్పుడు నాకు 18 సంవత్సరాలు. వీధుల్లో భిక్షాటన చేస్తూ, సెక్స్ వర్క్‌గా, బార్లలో డ్యాన్స్ చేస్తే డబ్బు సంపాదించుకున్నాను'' అని ప్రియా చెప్పారు. 1999లో ప్రముఖ దివంగత రచయిత సు రాసిన తమిళ పుస్తకం వాద మల్లిని ప్రియ చూసింది. ''ఆ పుస్తకంలో ఒక ట్రాన్స్‌జెండర్ పాత్ర ఉంది. పేరు సముద్రం. తను జీవితంలో చాలా కష్టపడుతుంది. చివరికి ఒక కార్యకర్తగా మాతుంది. ఆమె గురించి చదివి నేను చాలా ప్రేరణ పొందాను. నేను కూడా కార్యకర్తగా మారాలని భావించాను. ఆ పుస్తకం నన్ను, నా జీవితాన్ని మార్చేసింది'' అని ఆ పుస్తకం చదివిన తర్వాత ప్రియ సముద్రాన్ని కలవాలని నిర్ణయించుకుంటుంది.
సహాయ కార్యక్రమాలు
సముద్రం ప్రియను చదవు విషయంలో మరింత ప్రోత్సహించింది. ఆ ప్రేరణతో రాయడం కూడా ప్రారంభించింది. అతి తక్కువ కాలంలోనే స్థానిక తమిళ పత్రికకు సహకరించడం ప్రారంభించింది. తత్వవేత్త రాల్ఫ్ వాల్డో ఎమెర్సన్ చెప్పినట్టుగా ''మన జీవితంలో మనకు కావలసింది మనమే చేసుకోవాలి'' ఇది ప్రియకు బాగా నచ్చింది. సముద్రంలో ప్రియ అలాంటి గురువును చూసుకుంది. ఆమె మార్గదర్శకత్వం ప్రియలో క్రియాశీలతకు బీజం వేసింది. ఇటీవల కమ్యూనిటీ యాక్షన్ కొల్లాబ్ అనే ఎన్జీఓ కోసం రీజనల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా ప్రియా మధురైలో ట్రాన్స్ కిచెన్‌ను విజయవంతంగా నడుపుతోంది. అక్కడ ఆమె దాదాపు 10 మంది ఇతర ట్రాన్స్ వ్యక్తులను నియమించింది. వారికి స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. ఇంకా ఆ వంటగది ఇప్పుడు పరిసరాల్లో అనేక సహాయ కార్యక్రమాలలో పాల్గొంటోంది. 'మాకు చాలా అందించిన సమాజానికి తిరిగి ఇవ్వాలనే సంజ్ఞ ఇది' అని ప్రియా చెప్పారు.
ట్రాన్స్ యాక్టివిజం
ప్రియా మొదట్లో తన కార్యక్రమాలను చిన్నగా ప్రారంభించి ఉండవచ్చు. కానీ అది ఆమె భారతదేశంలోని ట్రాన్స్ కమ్యూనిటీలో ఎన్నో మార్పులు వచ్చేలా చేసింది. 2001లో తన సొంత రాష్ట్రం తమిళనాడుకు తిరిగి వచ్చిన తర్వాత ట్రాన్స్ కమ్యూనిటీ కోసం పని చేసే ఎన్జీఓలతో కలిసి స్వచ్ఛందంగా కలిసి పని చేసింది. 2004లో ఆమె న్యాయవాది రజనీని కలిసింది. ఆమె ప్రియాతో కలిసి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఓటు హక్కు కోసం చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తర్వాత కాలంలో ప్రియా అనేక వ్యాసాలు, పుస్తకాలను రాశారు. తమ సంఘం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రదర్శించే నాటకాలను రూపొందించడానికి లింగమార్పిడి థియేటర్ సమూహాన్ని కూడా ఏర్పాటు చేశారు. 2017లో ప్రియా మదురైలో భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ రిసోర్స్ సెంటర్ (TRC)ని ప్రారంభించారు. ఆ కేంద్రం నిధులను సమీకరించింది. ఇది ట్రాన్స్ కమ్యూనిటీకి నాలెడ్జ్, సపోర్ట్ సెంటర్‌గా పనిచేసింది. ఈ కేంద్రం ఆంగ్లం, తమిళంలో పుస్తకాల భారీ సేకరణ, లింగమార్పిడి హక్కుల గురించిన సమాచారంతో వార్తాపత్రిక క్లిప్పింగ్‌లు 100 కంటే ఎక్కువ సినిమాలు తీశారు. ఇది డాక్యుమెంటరీలకు నిలయంగా ఉంది.
ఎవరికైనా సహాయం అందేలా
కోవిడ్-19 సమయంలో కేంద్రం ఎన్నో సహాయక కార్యక్రమాలు చేసిందని ప్రియా చెప్పారు. ''మహమ్మారితో లాక్డౌన్ సంభవించినప్పుడు దేశవ్యాప్తంగా ట్రాన్స్ ప్రజలు తమ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయారు. చాలా మంది ట్రాన్స్ వ్యక్తులు భిక్షాటన, సెక్స్ పనిలో ఉంటారు. ఈ రెండూ పూర్తిగా ఆగిపోయాయి. వారికి అత్యవసర సహాయం అవసరమయింది'' అని ప్రియ చెప్పారు. కేంద్రంలో ఎవరికైనా సహాయం అందేలా ప్రియా చూసుకున్నారు. వీరిలో వలస కార్మికులు, రోజువారీ కూలీ కార్మికులు, వీధి వ్యాపారులు, హెచ్ఐవి పాజిటివ్ మహిళలు, ఒంటరి తల్లులు, లైంగిక పనిలో ఉన్న మహిళలు కూడా ఉన్నారు.
ఆహారం ప్రజలను ఏకతాటిపైకి తెస్తుంది
2021లో అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసే స్వస్థి అనే సంస్థ కోసం పనిచేస్తున్న ప్రియా మధురైలో ట్రాన్స్ కిచెన్‌ను ప్రారంభించేందుకు కృషి చేశారు. అర్ఘ్యం, విరుత్తి, శ్రీ లక్ష్మి పెంగల్ మున్నేట్ర సంగం వంటి ఇతర సంస్థలతో పాటు స్వస్థి ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చారు. ''ఇతర మనుషులతో కనెక్ట్ కావడానికి ఆహారం ఒక మార్గం. హోటల్ కేవలం ట్రాన్స్ వ్యక్తులను మాత్రమే కాకుండా మాతో కమ్యూనికేట్ చేయడానికి సంకోచించే పబ్లిక్‌తో కనెక్ట్ అవ్వడంలో వారికి సహాయపడుతుందని మేము భావించాము'' అని ప్రియా చెప్పారు.
లింగమార్పిడి వార్డు రోగులకు
హోటల్ నామమాత్రపు ధరకు ఆహారాన్ని విక్రయిస్తుంది. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో అనేక సహాయక చర్యలను కూడా చేపట్టింది. మధురై జనరల్ హాస్పిటల్‌లోని లింగమార్పిడి వార్డును సందర్శించే రోగులకు ఆహారం అందిస్తుంది. రాష్ట్రంలోని రెండు జనరల్ హాస్పిటల్స్‌లో ఈ హాస్పిటల్ ఒకటి. ఇందులో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక వార్డు ఉందని ప్రియా చెప్పారు. జైసన్ అనే వాలెంటీర్ అక్కడ తన సేవలు అందిస్తాడు. అతను ప్రతి గురువారం వార్డుకు హాజరవుతాడు. ఇన్కమింగ్ రోగులు, వార్డులోని సిబ్బంది మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు. ఇందులో ఎండోక్రినాలజిస్ట్‌లు, సైకియాట్రిస్ట్‌లు, గైనకాలజిస్ట్లు, ప్లాస్టిక్ సర్జన్లు, నర్సులతో పాటు ఎంతో మంది వైద్యులు ఉంటారు. అతను ఆసుపత్రి సిబ్బందికి ట్రాన్స్ కిచెన్,TRC నుండి అవసరమైన సహకారం పొందేలా చేస్తాడు.
ప్రతి రోజూ ఓ కొత్త రోజే
చాలా కాలంగా అణచివేతకు గురయిన జైసన్ తన ఇంటి నుండి పారిపోయి 26 సంవత్సరాల వయసులో మగవాడిగా మారాడు. అతని పోరాటం చాలా కాలం కొనసాగింది. చివరికి జైసన్ TRCలో బంధుత్వాన్ని పొందాడు. ఇది అతనికి ఎంతో సహాయపడింది. జీవనోపాధిని ప్రారంభించడానికి కిరాణా, ఫ్యాన్సీ స్టోర్ ప్రారంభించాడు. జైసన్ ఇప్పుడు సంతృప్తిగా ఉన్నాడు. సుకన్య అనే భాగస్వామిని కూడా పొందగలిగాడు. ఈ జంట మధురైలో నివసిస్తూ దుకాణంలో పని చేస్తున్నారు. అలాగే ట్రాన్స్ కమ్యూనిటీలోని ఇతరులకు సహాయం చేయడానికి ఎన్జీఓలో స్వచ్ఛందంగా పని చేస్తున్నారు. జైసన్ లాంటి వాళ్లలో తన యాక్టివిజం ప్రభావాన్ని సూటిగా చూసే ప్రియాకి ప్రతి రోజూ ఓ కొత్త రోజే. ఇటీవల ఆమె ఒక ట్రాన్స్ ఉమెన్ ఆధారంగా 'అరికండి' అనే షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించింది. ఈ చిత్ర ట్రైలర్ ఈ నెల ప్రారంభంలో విడుదలయింది. ఇది జనవరి 2023లో విడుదల కానుంది. ఒక పుస్తకం తన జీవితాన్ని మార్చిన రోజుని, తన ద్వారా చాలా మంది ఇతరులను కూడా గుర్తుచేసుకుంది.