Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డ్రైఫ్రూట్స్ విషయంలో చాలామందికి వివిధ అపోహలుంటాయి. ఇవి తింటే శరీరంలో కొవ్వు పెరిగి లావవుతామని, ఫలితంగా లేనిపోని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్టవుతుందని కొంతమంది భావిస్తారు. అయితే ప్రత్యేకించి బాదం విషయంలో ఈ అపోహలన్నీ సరికాదంటున్నారు నిపుణులు. అంతేకాదు.. వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరగకుండానే, శరీరానికి ఉపయోగపడే విటమిన్ 'ఇ'తో పాటు మోనో అన్శ్యాచురేటెడ్ కొవ్వులు, మంచి కొవ్వులు వృద్ధి చెందుతాయని చెబుతున్నారు. మహిళల్లో అప్పుడప్పుడు బాదం పప్పు తినే వారి కంటే క్రమం తప్పకుండా తినేవారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 35 శాతం తక్కువని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. బాదంలో క్యాలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉండడమే ఇందుకు కారణం. మరి విటమిన్ 'ఇ', పీచు.. వంటి ఎన్నో పోషకాలతో మిళితమైన బాదం పప్పు బరువు తగ్గించడంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి.
- ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా లేదంటే బయటికి వెళ్లినప్పుడైనా సాయంత్రం పూట స్నాక్స్ తినందే కొందరు ఉండలేరు. అందుకే ఈ సమయంలో వారికి నచ్చినవేవో చేసుకొని లేదా బయటికి వెళ్తే కొనుక్కొని ఆరగిస్తుంటారు. అయితే ఇవి అంత ఆరోగ్యకరం కాకపోవచ్చు. కాబట్టి వీటిన్నింటికి బదులు ఓ గుప్పెడు బాదం పప్పుల్ని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం కడుపు నిండుగా ఉండేలా చేసి ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది. తద్వారా ఇతర ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడచ్చు.
- ఉప్మా, ఓట్మీల్, కిచిడీ, నూడుల్స్.. వంటి బ్రేక్‌ఫాస్ట్‌లో బాదం పప్పును వేయడం లేదంటే బ్రేక్‌ఫాస్ట్ పూర్తయిన తర్వాత కొన్ని బాదం పప్పుల్ని తినడం వల్ల కడుపు నిండుగా అనిపించి చాలాసేపటి వరకు ఆకలేయకుండా ఉంటుంది. తద్వారా ఏది పడితే అది తినకుండా ఉండి.. బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.
- పొట్ట తగ్గించుకునేందుకు వివిధ వ్యాయామాలు చేయడం మామూలే. దాంతో పాటు రోజూ బాదం పప్పుల్ని కూడా తినడం అలవాటు చేసుకుంటే పొట్ట భాగంలో పెరిగిపోయిన కొవ్వుల్ని ఇట్టే తగ్గించుకోవచ్చు. దీనికి ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే మోనో శ్యాచురేటెడ్ కొవ్వులే కారణం. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలపై దాడి చేసి దాన్ని క్రమంగా తగ్గించేస్తాయి. కాబట్టి పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వులు కూడా కరిగి నాజూకైన నడుమును సొంతం చేసుకోవచ్చు.
- బాదం పప్పు మామూలుగా తింటేనే బరువు పెరుగుతామనుకుంటారు చాలామంది. అలాంటిది వేయించుకుని తింటే.. అంటారా? వేయించుకొని తిన్నా బరువు తగ్గుతారంటున్నారు నిపుణులు. అయితే అది కూడా నూనె లేకుండానే... నూనె లేకుండా వేయించిన బాదం పప్పైనా, నానబెట్టినవైనా, నేరుగా తిన్నా.. ఇలా ఎలా తీసుకున్నా.. వాటిలోని క్యాలరీల్లో ఎక్కువ, తక్కువలేమీ ఉండవు. కాబట్టి ఎలాంటి సంకోచాలూ లేకుండా బాదం పప్పుని ఈ మూడు పద్ధతుల్లో మీకు నచ్చినట్టుగా తినొచ్చు అంటున్నారు నిపుణులు. తద్వారా అందులోని పోషకాలతో ఆరోగ్యాన్ని పొందచ్చు. అంతేకాదు.. ఈ తక్కువ క్యాలరీలున్న పదార్థంతో బరువూ తగ్గచ్చు.