Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం ఎంతో అవసరం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు సాధ్యమైనంత మేర చక్కటి ఆహారాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తుంటారు. వారికి అందించే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సరైన పోషకాలు లభించక పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. పోషకాహార లోపం ఉన్నా కొంతమంది పిల్లలు పైకి మామూలుగానే ఉంటారు. ఇలాంటివారిని గుర్తించడం కష్టం. అయితే కొన్ని లక్షణాల ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాన్ని గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. తద్వారా సమస్యను ముందే పరిష్కరించుకోవచ్చని సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా...
ఈ రోజుల్లో చాలామందిని ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వీరిలో పిల్లలూ ఉంటున్నారు. అయితే ఈ సమస్యలకు పోషకాహార లోపం కూడా కారణమంటున్నారు. ప్రొటీన్లలో అమైనో అమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి పిల్లలకిచ్చే ఆహారంలో ప్రొటీన్లు తగినంతగా ఉండేలా జాగ్రత్తపడాలి.
కొంతమంది పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. ఎంతసేపైనా అలుపు లేకుండా ఆడుకుంటారు. కానీ ఆహారం దగ్గరకు వచ్చేసరికి తక్కువగా తింటుంటారు. అయితే యాక్టివ్గా ఉన్నారని తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఇలాంటి వారిలో అరుగుదల సమస్యలు ఉండే అవకాశం ఉంది. దీనికి కారణం వారి శరీరం పోషకాలను గ్రహించలేకపోవడమే. కాబట్టి వీరికి పెరుగు, మజ్జిగ, బొప్పాయి వంటి ఆహార పదార్థాలను అందించాలంటున్నారు నిపుణులు.
కొంతమంది పిల్లలు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల తరచూ ఫ్లూ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తుండాలి. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలను సమపాళ్లలో తీసుకోవాలి.
ఈ రోజుల్లో పిల్లలు కూడా ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి పోషకాహార లోపం కూడా కారణమంటున్నారు నిపుణులు. తీసుకునే ఆహారంలో సరిపడ పోషకాలు లభించకపోతే ఎప్పుడూ ఆకలిగానే ఉంటుంది. తద్వారా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటారు. ఫలితంగా ఊబకాయం వచ్చే అవకాశం వుంది. కాబట్టి పిల్లలకు అందించే ఆహారంలో సరిపడ పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
పోషకాల్లో క్యాల్షియం, విటమిన్ డి.. ఎంతో ముఖ్యమైనవి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఇవి సరిపడ మోతాదులో శరీరానికి అందకపోతే కండరాల నొప్పి, ఎముకలు బలహీనంగా మారడం వంటివి జరుగుతుంటాయి. అలాగే చిన్న పనికే నీరసపడిపోతుంటారు. విటమిన్ డి ఆహార పదార్థాల్లో కంటే సూర్యరశ్మి ద్వారానే శరీరానికి ఎక్కువగా లభిస్తుందన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఎదిగే పిల్లలకు ఇది ఎంతో అవసరం. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలంటున్నారు నిపుణులు.