Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లల అభ్యాసం, అభిజ్ఞా నైపుణ్యాలు, అభివృద్ధిని పెంచడంలో జ్ఞాపకశక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్న పిల్లలు పాఠశాలలో వివిధ సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మీ పిల్లలకు ఎలాంటి సమస్యలు లేకపోయినా ఈ చిట్కాలను ప్రయత్నించడం వల్ల వారి జ్ఞాపకశక్తి, మెదడు శక్తిని పదును పెట్టడంలో సహాయపడతాయి.
ఆటలు: ఎవరికైనా జ్ఞాపకశక్తి, జ్ఞానాన్ని మెరుగుపరచడానికి ఆహ్లాదకరమైన, సవాలు చేసే మెదడు గేమ్‌లు అవసరం. ఇవి ఎక్కడైనా ఆడగలిగే ఆటలు లేదా కుటుంబ సభ్యులతో ఇంట్లో ఆడుకునే బోర్డు గేమ్‌లు కూడా కావచ్చు. ఇవి వారి జ్ఞాపకశక్తి కండరాలకు శిక్షణనిస్తాయి. అన్ని రకాల విషయాలు, సమాచారాన్ని సరిగ్గా గుర్తుంచుకోవడానికి సహాయపడతాయి. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి.
ఒత్తిడి: ప్రతి బిడ్డకు ప్రత్యేకమైన అభ్యాస శైలి ఉంటుంది. పాఠాలను అర్థం చేసుకోవడానికి అవసరమైన సమయాన్ని వారికి ఇవ్వాలి. కొత్తది నేర్చుకునేటప్పుడు వారు ఎలాంటి ఒత్తిడి లేదా న్యూనతా భావాలను ఎదుర్కోకూడదు. కాబట్టి మీ పిల్లల ఉత్సుకతను ప్రోత్సహించండి. కొత్త విషయాలను నేర్చుకోవడంలో వారిని ఉత్సాహపరచండి. వారికి ఇష్టమైన పాఠశాల సబ్జెక్టును వారు ఎప్పటికీ మరచిపోకుండా ఉండటానికి ఈ పద్ధతి చాలా అవసరం.
నిద్ర: పిల్లల జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడానికి, మెరుగుపరచడానికి ప్రతిరోజూ 8-10 గంటల పాటు గాఢమైన నిద్ర చాలా అవసరం. కాబట్టి పిల్లల కోసం నిద్ర షెడ్యూల్ తయారు చేయడం, వారు ఆ సమయానికి నిద్రపోయేలా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ విధంగా చేస్తే వారు మరుసటి రోజు పాఠశాలకు మేల్కొనే ముందు తగినంత విశ్రాంతి పొందుతారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఉదయం చూసిన కార్టూన్లను గుర్తుకు తెచ్చుకునే పిల్లల సామర్థ్యం మధ్యాహ్నం నిద్ర తర్వాత 10 శాతం పెరిగింది.
పచ్చని కూరలు: వీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సి, డి ,కె కూడా ఉన్నాయి. ఇవి పిల్లల మెదడు అభివృద్ధి చెందడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పాలకూర, కొత్తిమీర, పుదీనా, ఆవాలు, బచ్చలికూర, బీట్రూట్ ఆకులు మంచి కూరగాయలు. మీ పిల్లలు రోజూ వీటిని వినియోగించేలా చూసుకోండి. అలాగే పుదీనా ఆకులను రిఫ్రెష్ పానీయాలలో చేర్చవచ్చు. కొత్తిమీర ఆకులను అన్ని రకాల పులుసులలో ఉపయోగించవచ్చు.
నట్స్: పిల్లలు రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే పౌష్టికాహారం అవసరం. కాబట్టి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే బాదం, పల్లీలు, పిస్తా, జీడిపప్పు వంటి గింజలను ఆహారంలో చేర్చుకోవచ్చు. అలాగే గుమ్మడి, చియా, నువ్వులు, పొద్దుతిరుగుడు, అవిసె గింజలు వంటి విత్తనాలు పిల్లల అభిజ్ఞా సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. వీటిని నేరుగా తినవచ్చు లేదా కేక్‌లు, మిల్క్‌షేక్‌లు, ఖీర్ మొదలైన వాటికి జోడించవచ్చు.
గుడ్లు: మన మెదడు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి కొవ్వులతో రూపొందించబడింది. ఇవి ఎక్కువగా గుడ్లు, సాల్మన్ వంటి చేపలలో కనిపిస్తాయి. ఈ ఆహారాలు మెదడు, నరాల కణాలను మెరుగుపరుస్తాయి. అభ్యాస శక్తిని, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కాబట్టి మీ పిల్లల ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు ఉండేలా చూసుకోండి.