Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలం వచ్చేసింది. సాధారణంగా ఈ కాలంలో నోటికి రుచిగా, కారంగా ఏదైనా తినాలని అనిపిస్తుంది. పకోడీలు, బజ్జీలు లాంటివి ఎప్పుడూ తినేవే. వీటిలో ప్రత్యేకత ఏముంది. ఇక రోజూ తినే అన్నం తినాలంటే బోరు కొడుతుంది. అందుకే రుచితో పాటు ఆరోగ్యాన్ని సైతం అందించే కొన్ని రకాల కిచిడీలు ఉన్నాయి. చిరుధాన్యాలతో వేడివేడిగా చేసుకుని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇకెందుకు ఆలస్యం మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి...
కొర్రబియ్యం వెజ్ కిచిడి
కావల్సిన పదార్థాలు: కొర్రబియ్యం - కప్పు, పెసరపప్పు - పావుకప్పు, పసుపు - చిటికెడు, నెయ్యి - టీస్పూను, ఉప్పు - తగినంత, అల్లం - అంగుళం ముక్క, క్యారెట్ - ఒకటి, బీన్స్ - నాలుగు, ఆలూ - ఒకటి, టమాటా - ఒకటి(చిన్నది), మునగాకు - కప్పు.
తయారు చేసే విధానం: కూరగాయలన్నీ చిన్నముక్కలుగా కోయాలి. కొర్రబియ్యం, పెసరపప్పు కడిగి ఒకటిన్నర కప్పుల వేడినీళ్లు పోసి సుమారు రెండు నుంచి రెండున్నర గంటలు నానబెట్టాలి. ప్రెషర్‌పాన్‌లో నూనె పోసి కాగాక ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, మిరియాలు, కరివేపాకుతో తాలింపు పెట్టాలి. తర్వాత తరిగిన ఉల్లిగడ్డ, అల్లం, పచ్చిమిర్చి కూడా వేసి వేగాక మిగిలిన కూరగాయల ముక్కలు, మునగాకు, ఉప్పు, పసుపు వేసి మూడు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన కొర్రబియ్యం, పెసరపప్పు నీళ్లతో సహా పోయాలి. ఉప్పు సరిచూసి మూతపెట్టి మీడియం మంటమీద ఉంచి రెండు విజిల్స్ రానివ్వాలి. సిమ్‌లో మరో ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. ఆవిరిపోయాక మూత తీసి నెయ్యి కలిపి వడ్డించాలి.
క్వినోవా కిచిడి
కావల్సిన పదార్థాలు: క్వినోవా - రెండు కప్పులు, ఆలూ - రెండు (మీడియం సైజువి), వేయించిన పల్లీలు - గుప్పెడు, పసుపు - చిటికెడు, జీలకర్ర - టీస్పూను, పచ్చిమిర్చి - నాలుగు, కొబ్బరితురుము - రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర - అరకప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - టేబుల్‌స్పూను.
(చిరుధాన్యాలతోపాటు ఇటీవల మార్కెట్లో లభిస్తోన్న మరోరకం ధాన్యమే క్వినోవా. ఇతర ధాన్యాలతో పోలిస్తే ఇందులో ప్రోటీన్లూ, గుండెకు మేలు చేసే ఏమోనోఆన్శాచ్యురేటెడ్ కొవ్వుల శాతం ఎక్కువ. అయితే దొరకని వాళ్లు క్వినోవాకి బదులుగా బార్లీ, గోధుమ రవ్వనూ వాడుకోవచ్చు)
తయారు చేసే విధానం: ఆలూ ఉడికించి మెదిపి పక్న ఉంచాలి. వేయించిన పల్లీల్ని మిక్సీలో వేసి చిన్న ముక్కలుగా చేసి తీయాలి. ముందుగా బాణిలో క్వినోవాను కొద్దిగా వేయించి పక్కన ఉంచాలి. విడిగా మందపాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. తర్వాత వేయించిన క్వినోవా వేసి పది నిమిషాలు మీడియం మంటమీద ఉడికించాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు కూడా పోయాలి. పూర్తిగా ఉడికిన తర్వాత గరిటెతో ఓసారి కదిపి పక్కన ఉంచాలి. మందపాటి బాణిలో నూనే పోసి జీలకర్ర వేయాలి. అవి చిటపటమన్నాక సన్నగా చీల్చిన పచ్చిమిర్చి వేసి ఓ నిమిషం వేయించాలి. తర్వాత మెదిపిన ఆలూ, ఉప్పు, పసుపు, పల్లీలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించిన క్వినోవా, కొబ్బరి తురుము వేసి కలపాలి. ఉప్పు సరిచూసి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లి మూత పెట్టాలి.
సోయా రాజ్మా కిచిడి
కావల్సిన పదార్థాలు: రాజ్మా - కప్పు (కడిగి నానబెట్టాలి), సాబుదానా - రెండు కప్పులు, ఆలూ - రెండు (ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కోయాలి), వేయించిన పల్లీలు - రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు - అరటీస్పూను, జీలకర్ర - అర టీస్పూను, కరివేపాకు - నాలుగు రెబ్బలు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - అంగుళం ముక్క(సన్నగా తరగాలి), పసుపు - పావు టీస్పూను, నిమ్మకాయ - ఒకటి, కొబ్బరి తురుము - టేబుల్‌స్పూను, కొత్తిమీర - కట్ట, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: రాజ్మాల్లో ఒకటింపావు కప్పుల నీళ్లు పోసి సుమారు ఆరు గంటలసేపు నానబెట్టాలి. తర్వాత ఉడికించాలి. సాబుదానా కూడా నానబెట్టి ఉడికించి ఉంచాలి. ఆలూ ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. పల్లీలను మిక్సీలో వేసి ఓసారి తిప్పి చిన్న ముక్కలుగా చేయాలి. వెడల్పాటి పాన్‌లో నూనె పోసి కాగాక ఆవాలు, జీలకర్ర వేయాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, పసుపు వేసి వేగాక ఆలూ ముక్కలు వేసి కలపాలి. ఉప్పు, ఉడికించన రాజ్మా వేసి కలపాలి. తర్వాత ఉడికించిన సగ్గుబియ్యం కూడా వేసి కలపాలి. ఇప్పుడు సుమారు పావుకప్పు నీళ్లు చిలకరించి మూత పెట్టి సిమ్‌లో ఐదు నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి పల్లీలు, నిమ్మరసం, కొబ్బరి తురుము, కొత్తిమీర కలిపి మూతపెట్టి అలాగే మరో ఐదు నిమిషాలు వేడిమీద ఉంచాలి.
ఓట్స్ కిచిడి
కావల్సిన పదార్థాలు: ఓట్స్ - కప్పు, పెసరపప్పు - అరకప్పు, కూరగాయల ముక్కలు - (క్యారెట్, బీన్స్, పచ్చిబఠాణీలు): కప్పు, మెంతి ఆకులు - అరకప్పు, పచ్చిమిర్చి - నాలుగు, ఉప్పు - తగినంత, అల్లంతురుము - టీస్పూను, కరివేపాకు - కొద్దిగా, పసుపు - పావు టీస్పూను, ఆలివ్ ఆయిల్ : రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డ ముక్కలు - అరకప్పు, నీళ్లు - నాలుగు కప్పులు.
తయారు చేసే విధానం: పెసరపప్పులో రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. సగం ఉడికాక దించి పక్కన ఉంచాలి. పాన్‌లో నూనె పోసి కాగాక పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత అల్లం తురుము, మెంతి ఆకులు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. మిగిలిన కూరగాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. రెండు కప్పుల నీళ్లు పోసి, ఉప్పు వేసి ఉడికించాలి. నీళ్లు మరిగాక ఓట్స్, సగం ఉడికించి పక్కన ఉంచిన పెసరపప్పు నీళ్లతోసహా వేసి కలపాలి. మిశ్రమాన్ని సిమ్‌లో ఉడికించి దించాలి.