Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారియర్ మామ్స్... ఇది పది మంది తల్లులు కలిసి స్థాపించిన ఓ నెట్వర్క్. స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే వారి పిల్లల హక్కు కోసం పోరాడాలనే ఉమ్మడి లక్ష్యంతో రెండు సంవత్సరాల కిందట ఈ తల్లులు కలిసి వచ్చారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా స్వరం పెంచడానికి వివిధ కార్యక్రమాలను ప్రారంభించిన ఆ తల్లుల కృషి గురించి నేటి మానవిలో...
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో 98శాతం మంది పిల్లలు సంస్థ సిఫార్సు చేసిన నిబంధనల కంటే ఎక్కువగా విషపూరితమైన గాలిని పీల్చుకుంటున్నారు. ''పిల్లలు పెరిగేకొద్దీ ఊపిరితిత్తులలో కాలుష్య కారకాలు పేరుకుపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతారు. ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా, అలర్జీలు, బ్రోన్కైటిస్, న్యుమోనియాతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. దీనితో పాటుగా చిన్న కణాలు (PM2.5) రక్తప్రవాహంలోకి ప్రవేశించి శరీరంలోని అన్ని ప్రధాన అవయవాలలోకి జొరబడుతున్నాయి. దీర్ఘకాల, కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తాయి'' అని వారియర్ మామ్స్ వ్యవస్థాపకురాలు మిధిలీ రవికుమార్ అంటున్నారు.
జీవితకాల ప్రమాదాలు
''వాతావరణ మార్పులపై భారత్ పోరాడుతోంది. ''ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగే వ్యాధుల జాబితా పెరుగుతోంది. అభిజ్ఞా నష్టం, కుంగిపోయిన పెరుగుదల నుండి ఊబకాయం, గుండె జబ్బులు, స్ట్రోక్, COPD, డయాబెటిస్, అల్జీమర్స్, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యల జీవితకాల ప్రమాదాలుగా ఉన్నాయి. తల్లి శ్వాసించే కాలుష్యం వల్ల కడుపులోని పిల్లలు ప్రభావితమవుతారు. ఇది ముందస్తు జననాలు, తక్కువ బరువుతో పుట్టడం, పుట్టుకతో వచ్చే లోపాలకు దారి తీస్తుంది'' అని మిధిలీ జతచేస్తున్నారు. వివిధ నెట్‌వర్క్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కనెక్ట్ అయిన తల్లుల సమూహం ఈ సమస్య గురించి ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. 2020లో వారియర్ మామ్స్ను ఏర్పరుకుంది.
అట్టడుగు స్థాయిలో మార్పు
ప్రస్తుతం వారియర్ మామ్స్‌కు 10 మంది కోర్ మదర్లు ఉన్నారు. 2,000 మందికి పైగా తల్లుల నెట్‌వర్క్‌తో సంబంధం కలిగి ఉన్నారు. వీరు భారతదేశం అంతటా తొమ్మిది రాష్ట్రాల్లో ఉద్యమంలో చేస్తున్నారు. వారియర్ తల్లులు ఏర్పడిన తర్వాత వారు తమ తమ నెట్‌వర్క్‌లు, కమ్యూనిటీలకు సందేశం, స్వచ్ఛమైన గాలి కోసం డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లడం ప్రారంభించారు. వారియర్ తల్లులు వాయుకాలుష్య ఆరోగ్య ప్రభావాలు, స్థిరమైన చలనశీలత మొదలైన అంశాలపై ఆన్లైన్, ఆఫ్‌లైన్ అవగాహన, ఎంగేజ్మెంట్ సెషన్లను నిర్వహించడానికి డాక్టర్స్ ఫర్ క్లీన్ ఎయిర్, రాహ్‌గిరి ఫౌండేషన్‌తో పాటు వివిధ సంస్థలతో కలిసి పనిచేశారు.
చుల్హా ఫ్రీ ఇండియా
భారతదేశంలో డెబ్బై ఐదు మంది ప్రజలు తమ ఆహారాన్ని వండడానికి, ప్రతిరోజూ వేడి చేయడానికి చుల్హాస్ (కట్టెల పొయ్యి) బర్నింగ్ బయోమాస్‌పై ఆధారపడతారు. చాలా చుల్హాలు చిన్న, తక్కువ గాలితో కూడిన ఇళ్లలో ఏర్పాటు చేయబడ్డాయి. దాంతో మహిళలు, పిల్లలు దాని నుండి వెలువడే పొగకు ఇబ్బంది పడుతున్నారు. ముందస్తు ప్రసవాలు, గర్భస్రావాలు, అంధత్వం, ఊపిరితిత్తుల వ్యాధుల వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఎల్పీజీ సిలిండర్ల పెరుగుతున్న ధరలతో ఆరోగ్యం, ఇంటి అవసరాలు, కుటుంబ బడ్జెట్‌ను సమతుల్యం చేయడంలో వారి సవాళ్లను అర్థం చేసుకోవడానికి వారియర్ మామ్స్ దేశంలోని అనేక ప్రదేశాల నుండి మహిళలతో సంభాషించారు. ఇది #ChulhaFreeIndia ప్రచారం ద్వారా భారతదేశంలోని అన్ని కుటుంబాలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కోసం ఒత్తిడి చేస్తోంది.
మీ హక్కులను తెలుసుకోండి
మీ హక్కులను తెలుసుకోండి అనేది గాలి కాలుష్యంకు కారణమవుతున్న నాలుగు ప్రధాన వనరులపై ఫిర్యాదులను నమోదు చేయడానికి సమాచారం సేకరిస్తుంది. చెట్ల నరికివేత, దుమ్ము, చెత్తను కాల్చడం, వాహన కాలుష్యం ఇందులో ముఖ్యమైనవి. ''హిందీ, మరాఠీ, తమిళం వంటి స్థానిక భాషలలో అందుబాటులో ఉన్న డౌన్లోడ్ చేయదగిన, భాగస్వామ్యం చేయదగిన పోస్టర్లలో కాల్ చేయడానికి ఫోన్ నంబర్లు, ట్యాగ్ చేయడానికి ట్విట్టర్ హ్యాండిల్స్, పర్యావరణ ఉల్లంఘనను చూసినప్పుడు పౌరుల ఫిర్యాదులను నమోదు చేయడానికి వెబ్సైట్ల సమాచారం ఉంటాయి'' అని నీనా సుబ్రమణి పంచుకున్నారు. వీరు చేసిన మరొక చొరవ దద్దుమజ్రాను క్లీన్ అప్ చేయడం. చండీగడ్‌లోని 45 ఎకరాల భూమి దద్దుమజ్రా ల్యాండ్‌ఫిల్ ద్వారా ఆక్రమించబడింది. ఇక్కడ ప్రతిరోజూ టన్నుల కొద్దీ వేరుచేయని వ్యర్థాలను డంప్ చేయడం వల్ల గాలి నాణ్యత, నీటి వనరులను ప్రభావితం చేసింది. ఇది వేసవిలో అగ్ని ప్రమాదాల ప్రమాదాన్ని పెంచుతుంది. ''వారియర్ తల్లులు ఈ సమస్యపై చురుకుగా అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, చండీగఢ్ మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడటం ద్వారా ల్యాండ్‌ఫిల్‌ను క్లియర్ చేయడానికి కృషి చేస్తున్నారు. అక్టోబర్ 2022లో పంజాబ్‌లోని వారియర్ మామ్స్ చెత్త డంప్ దగ్గర నివసించే ప్రజల కష్టాలను హైలైట్ చేయడానికి పంజాబ్ కళా కేంద్రంలో ఫోటోగ్రఫీ కాంటెస్ట్, ఎగ్జిబిషన్ నిర్వహించింది'' అని నీనా చెప్పింది.
కమ్యూనిటీ నెట్‌వర్క్‌లతో కలిసి
వారియర్ మామ్స్ ఈ విపత్తుకు పరిష్కారం కనుగొనడంలో తమ మద్దతును అందిస్తుంది. సమిష్టి ASHAలు మరియు SHGల వంటి కమ్యూనిటీ నెట్‌వర్క్‌లతో కూడా పని చేస్తుంది. రమ ఉత్తర ఢిల్లీలోని భరోలా పరిసర ప్రాంతాల మురికివాడల్లో ఆశా కార్యకర్త. ఆశాగా తన పనిలో భాగంగా ఆమె అనేక గృహాలను సందర్శించినప్పుడు బయోమాస్ (చుల్హాస్) మండడం వల్ల గృహ వాయు కాలుష్యం అనే సమస్య ఢిల్లీలోని పట్టణ పేదలలో ప్రధాన సమస్యగా ఉందని గుర్తించింది. ఈ సమస్య గురించి ఏదైనా చేయాలని భావించింది. ఎల్పీజీ వంటి క్లీనర్ ప్రత్యామ్నాయాలకు మారలేకపోవడానికి గల కారణాలను అర్థం చేసుకోవడానికి మహిళలతో మాట్లాడాలని నిర్ణయించుకుంది. ''పట్టణ పేదలకు, రోజుకు రెండు భోజనాలు నిర్వహించడం ఒక సవాలుగా ఉంది. కాబట్టి వారు ఆకాశాన్నంటుతున్న ధరల కారణంగా ఎల్పీజీ సిలిండర్‌ను కొనుగోలు చేయలేరు. చాలా కుటుంబాలు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చి అనధికారిక నివాసాలలో నివసిస్తున్నందున సిలిండర్‌ను కొనుగోలు చేయడానికి పత్రాలు కూడా లేవు. ముఖ్యంగా మహిళలు, పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సుపై బయోమాస్ బర్నింగ్ హానికరమైన ప్రభావం గురించి వారికి కనీసం అవగాహన కల్పించడం నా లక్ష్యం. తద్వారా మనం స్వచ్ఛమైన గాలి కోసం సమిష్టి పోరాటం చేయవచ్చు. స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించడానికి మన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలనం'' అని ఆమె అంటుంది.
అధికధరల వల్లనే
వారియర్ మామ్స్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ (CFSD) సహకారంతో వివిధ వంట ఇంధనాల యాక్సెస్, నమూనా, సంబంధిత ఆరోగ్య ప్రభావాలను అర్థం చేసుకోవడానికి అర్బన్ నాగ్‌పూర్‌లో ఒక సర్వే నిర్వహించారు. 12 స్లమ్ పాకెట్స్ నుండి మొత్తం 1,500 కుటుంబాలు ఈ సర్వేలో కవర్ చేయబడ్డాయి. అందరూ ఎల్పీజీ సిలిండర్లు భరించలేనివిగా కనుగొన్నారు. బయోమాస్‌ను ఉపయోగించడం వల్ల మహిళలపై అదనపు భారం పడుతుందని కూడా అర్థమయింది. ఎందుకంటే కట్టెలు సేకరించడం వారి పని. దీనికి ప్రతి వారం నాలుగైదు గంటలు పడుతుంది. ప్రభుత్వ పథకం అయిన ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) నిరుపేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లను అందించడం ద్వారా ఈ సమస్యను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ జనాభాలో ఎక్కువ భాగానికి ఈ పథకం ప్రయోజనాల గురించి ఇంకా తెలియదని సర్వే ఫలితాలు చూపించాయి. ఉచిత సిలిండర్లు ఒకసారి ఉపయోగించిన తర్వాత సిలిండర్లను రీఫిల్ చేయడం సాధ్యం కానందున తిరిగి కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సి వస్తుంది.
దీర్ఘకాలిక లక్ష్యం
సర్వే ఫలితాల ఆధారంగా జూన్ 2022లో పాలసీ నివేదిక విడుదల చేయబడింది. నాగ్‌పూర్‌లో చుల్హాస్ ఉపయోగించే మహిళల దుస్థితిని హైలైట్ చేస్తూ పద్మశ్రీ అందుకున్న ఫోటోగ్రాఫర్ సుధారక్ ఓల్వేని ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించబడింది. ''డబ్ల్యూటీఓ ప్రమాణాల ప్రకారం స్వచ్ఛమైన గాలిని నిర్ధారించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ అధికారుల నుండి జవాబుదారీతనం కోసం సంబంధిత వాటాదారులతో, డిమాండ్‌తో గ్రామీణ, పట్టణ భారతీయ తల్లులను ప్రారంభించడం, సాధికారత కల్పించడం వారియర్ తల్లుల దీర్ఘకాలిక లక్ష్యం. మా వారియర్ మామ్ అయిన భవ్రీన్ కంధారి రాబోయే COP27లో ఇతర గ్లోబల్ పేరెంట్ డెలిగేట్లను కలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా గాలి నాణ్యతను మెరుగుపరచడానికి, తద్వారా మన పిల్లలకు ఆరోగ్యకరమైన జీవితం కోసం పోరాడే అవకాశం కల్పించాలని ప్రపంచ నాయకులకు విజ్ఞప్తి చేస్తారు'' అని మిధిలీ చెప్పారు.
మామ్స్ నెట్ వర్క్
నీనా: ఈమె ఒక డాక్యుమెంటరీ చిత్రనిర్మాత, ఉపాధ్యాయురాలు. తాను చదువుకునే రోజుల నుండే వాయు కాలుష్యంపై పోరాడుతుంది. వాహన కాలుష్యం వల్ల ఆమెకు ఆస్తమా వచ్చింది. అలాగే ఆమె కూతురు కూడా చిన్నతనం నుండి శ్వాస సమస్యలతో బాధపడుతుంది.
షెరెబాను(షెర్రీ): గురుగ్రామ్‌కు చెందిన ఈ తల్లి ఆసక్తిగల సైక్లిస్ట్. కమ్యూనిటీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేది. పర్యావరణ మార్పును తీసుకురావడానికి ఆమె ఇద్దరు పిల్లలు ఆజ్యం పోశారు.
మిధిలి: ఆమె సన్నిహిత కుటుంబ సభ్యులు క్యాన్సర్‌కు గురైనపుడు పర్యావరణ కారకాలతో పాటు వాయు కాలుష్యంపై పరిశోధన చేయడం ప్రారంభించింది. వ్యర్థాలను తగ్గించడం, స్థిరమైన జీవన మార్గాలను కనుగొనడంలో ఆమె మక్కువ చూపుతుంది.
అనూజ: గాలి నాణ్యత కారణంగా ఆమె చిన్న కొడుకు గురకతో ఇబ్బందిపడేవాడు. దాని నుండి కొడుకును రక్షించుకోవడానికి ఎంతో తప్పింది.
భవ్రీన్: పర్యావరణ న్యాయ సమస్యలపై దృష్టి సారించే అనేక ప్రజా ఉద్యమాలకు పాన్-ఇండియాలో ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఆమె #MyRightToBreathe, #FridaysForFutureIndia #DelhiTreesSOS వంటి ప్రచారాలను సులభతరం చేసి నిర్వహించింది.
లీనా బుద్ధే: ఈమె నాగ్‌పూర్‌లో పనిచేసే సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్.
రమ: ఇద్దరు పిల్లల తల్లైన రమ కూడా ఒక ASHA (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) వర్కర్. అణగారిన వర్గాలలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి కృషి చేస్తుంది.
సమిత: పంజాబ్ గ్రామీణ ప్రాంతంలో పెరిగిన ఈమె తన రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తిస్తుంది. వారు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించడానికి వివిధ రైతు సమూహాలను ఒకచోటకు తీసుకువస్తుంది. వారియర్ మామ్స్ పంజాబ్ ప్రచారాలకు నాయకత్వం వహిస్తుంది. వ్యర్థాలు, ఆరోగ్యం, కాలుష్యం చుట్టూ ఉన్న సమస్యలను హైలైట్ చేస్తుంది.
మనోరమ: జార్ఖండ్‌లో గిరిజన సంఘం ఒరాన్‌కు చెందిన ఈమె 1990ల చివరి నుండి మహిళల అభ్యున్నతి కోసం కృషి చేస్తోంది. అట్టడుగు వర్గాలను ముఖ్యంగా గిరిజనులు, దళితులు, అణగారిన ప్రజానీకానికి సుస్థిర, స్వావలంబన, స్వయంప్రతిపత్తి, జవాబుదారీ, ప్రజాస్వామిక సామాజిక-ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థను ఏర్పాటు చేయడం ఆమె లక్ష్యం.
గార్గి: ఈమె బెంగాల్ క్లీన్ ఎయిర్ నెట్‌వర్క్‌కు అవుట్‌రీచ్ లీడ్ మేనేజర్.