Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బరువు తగ్గాలని ఎవరికి ఉండదు. అయితే కొంతమందిలో ఇది ఒకేసారి ఎక్కువగా కనిపిస్తుంటుంది. శారీరక శ్రమ అధికంగా లేకపోయినా, కచ్చితమైన ఆహార నియమాలేవీ పాటించకపోయినా ఇలా ఉన్నట్టుండి ఎక్కువ కిలోలు తగ్గుతుంటారు కొందరు. ఇలా ఒకేసారి ఎక్కువ బరువు తగ్గడమనేది వివిధ రకాల అనారోగ్యాలకు సూచన కావచ్చంటున్నారు నిపుణులు. మరి శరీరంలో ఎలాంటి అనారోగ్యాలుంటే సడెన్‌గా బరువు తగ్గుతారో తెలుసుకుందాం...
నెలల కొద్దీ కఠినమైన వ్యాయామాలు చేయడం, నోరు కట్టేసుకొని కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం.. వంటివి చేస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అలాంటిది ఏ కష్టం లేకుండా బరువు తగ్గడం ఎలా సాధ్యమవుతుంది. కాబట్టి ఇది ఏదో ఒక ఆరోగ్య సమస్యకు సూచన కావచ్చని సందేహించడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆరు నెలల్లో మీ శరీర బరువులో సుమారు ఐదు శాతం తగ్గుదలను గమనిస్తే మాత్రం అది ఏదో ఒక క్యాన్సర్‌కు సంకేతం కావచ్చంటున్నారు. అంతేకాదు.. క్యాన్సర్ ఉన్న వారిలో కనిపించే తొలి సంకేతం కూడా ఉన్నట్టుండి బరువు తగ్గడమేనట. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ కిలోలు తగ్గినట్లు గుర్తిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకోవాలి.
ఉన్నట్టుండి ఎక్కువ మొత్తంలో బరువు తగ్గడానికి మధుమేహం కూడా ఓ కారణమంటున్నారు నిపుణులు. ప్రతి వంద మందిలో 13 మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. అయితే ఈ సమస్య ఉన్న వారిలో ఇన్సులిన్ తగినంత మొత్తంలో ఉత్పత్తి కాదు. తద్వారా రక్తంలోని గ్లూకోజ్‌ను శక్తిగా మార్చి శరీరానికి అందించే వ్యవస్థ దెబ్బతింటుంది. ఇలాంటప్పుడు జీవక్రియల పనితీరు సజావుగా సాగేందుకు శరీరం కొవ్వులు, కండరాలపై ఆధారపడుతుంది. తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో బరువు తగ్గే అవకాశం ఎక్కువ.
తీసుకునే ఆహారంలో ఎలాంటి మార్పులు ఉండవు.. చేసే వ్యాయామాల్లోనూ తేడా ఉండదు.. అయినా ఉన్నట్లుండి బరువు తగ్గామంటూ కొంతమంది డాక్టర్లకు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ఇలా జరగడానికి హైపర్‌థైరాయిడిజం సమస్య కూడా ఓ కారణం అయి ఉండచ్చంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా థైరాయిడ్ గ్రంథి ఎక్కువ మొత్తంలో థైరాక్సిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీనివల్ల జీవక్రియలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
ఎంతసేపు తినకపోయినా ఆకలేయదు.. బలవంతంగా ఆహారం తీసుకున్నా వెంటనే వాంతులవుతుంటాయి. ఎప్పుడు చూసినా పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంటుంది.. ఇలాంటి సందర్భాల్లో కూడా కొంతమంది ఉన్నట్లుండి బరువు తగ్గుతుంటారు. అయితే దీనికంతటికీ కారణం పొట్టలో, జీర్ణాశయంలో, పేగుల్లో అల్సర్లు ఏర్పడడమే అంటున్నారు నిపుణులు. ఇవి తీసుకున్న ఆహారాన్ని జీర్ణమవకుండా అడ్డుకుంటాయి.. ఆకలిని మందగింపజేస్తాయి. అలాగని ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో జీర్ణాశయ క్యాన్సర్ ముప్పూ పొంచి ఉండచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ కిలోలు తగ్గినా, పొట్టలో అసౌకర్యంగా అనిపించినా.. వెంటనే సంబంధిత నిపుణుల్ని సంప్రదించాలి.