Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభం శుభం తెలియని అమాయక అందమైన బాల్యం. అమూల్యమైన అపూర్వమైన వరం అని భావించే వారంతా. ఇంట్లో పసిబిడ్డ పారాడుతుంటే ఇంటిల్లిపాదీతో పాటు వీధి వీధంతా పండగ చేసుకునేది. ఒక ఇంట్లో పసిబిడ్డ జన్మిస్తే అందరి చేతుల్లో ఆ బిడ్డనే ఉండేది. ఇళ్ళలో తాతలు, నాయనమ్మలతో పాటు ఉమ్మడి కుటుంబాలలో ప్రకృతి మధ్య బాల్యం అందంగా గడిచేది. ప్రస్తుతం బాల్యం ఇంట్లో ఒంటరితనాలతోనూ, స్కూళ్ళ వేధింపులతోనూ, ఆడబిడ్డలయితే లైంగిక దాడులకు బలవుతూనో కష్టాల ఊబిలో ఇరుక్కుపోయి ఉంది. ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్న వారిలో బాలలను గనుల్లోనూ, ఇటుక బట్టీల్లోనూ, రసాయన పరిశ్రమల్లోనూ, బావుల తవ్వకాల్లోనూ పని చేయిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఎన్నో కష్టాల మధ్య బాల్యం భారంగా బతుకీడుస్తున్నది. నేడు బాలల దినోత్సవం సంవత్సరం నేటి బాలల పరిస్థితిని ఓ సారి మననం చేసుకుందాం...
ప్రపంచ వ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకోవటానికి ఐక్యరాజ్యసమితి నవంబరు 20వ తేదీని నిర్ణయించింది. 1954 నుంచి ఐక్యరాజ్యసమితి నిర్ణయం ప్రకారం బాలల దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడానికి, పరస్పర అవగాహనను పెంచుకోవడానికి ఐక్యరాజ్యసమితి ఈ బాలల దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది.
కొత్త రకాల సమస్యలు
మన దేశంలో స్వతంత్ర భారత తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబరు 14వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. పిల్లలు ప్రేమతో నెహ్రూను 'చాచాజీ' అని పిలిచేవారు. నెహ్రూకు పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాలల దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటున్నాము. పిల్ల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించిడం కోసం చిల్డ్రన్స్‌డే నిర్వహించాలని తొలుత ప్రారంభించినప్పటికీ ఇప్పుడైతే ఎన్నో కొత్త రకాల సమస్యలను అందులో చేర్చవచ్చు. శారీరకంగా, మానసికంగా బలహీనులైన బాలల మీద అందరూ పెత్తనం చెలాయించేవాళ్ళే. విసుగులో కోపంగా కొట్టే తల్లిదండ్రులు, స్కూళ్ళలో గొడ్డును బాదినట్టు బాదే టీచర్లు, ఊపిరాడకుండా టైం టేబుళ్ళు తయారు చేసి చదువు, చవువు అంటూ హింసించే యాజమాన్యాలు, జ్వరాలు, అనారోగ్యాలు పట్టించుకోకుండా తమ లాభాలు మాత్రమే చూసుకునే హాస్టళ్ళు, నెలలపాపనైనా వదలని వికృత చేష్టలు, కాలుష్యాలు, కల్తీల ఆహారంతో ఏర్పడే అనారోగ్య సమస్యలు, తల్లిదండ్రుల టెన్షన్లతో పుట్టకతోనే వచ్చే లోపాలు, సమస్యలతో బాల్యం ముళ్ళ కిరీటంతో సమతమతమవుతున్నది.
సైన్సు అభివృద్ధి చెందినా
పిల్లలు పుట్టిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల్ని రూపుమాపడానకి బాలల దినోత్సవాలు ఏర్పాటు చేశారు. వాక్సిన్లు లేని కాలంలో బాలారిష్టాలు దాటి పిల్లలు బతికిబట్టకట్టడమే సమస్యగా ఉండేది. రక్తహీనతలు, పౌష్టికాహార లోపాల వంటి సమస్యలు వాక్సిన్లు లేని ప్రాణాంతక వ్యాధులకు తోడుగా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉండేవి. బాల్య వివాహాలు వంటవి బాలికలకు ఉన్న పెద్ద సమస్యలానాడు. నేడు సమాజం మారి రెంతో శాస్త్ర ప్రగతిని సాధించింది. భయానక వ్యాదుల్ని పారద్రోలి సైన్సును మన ముంగిట్లో కట్టేసిన సమయంలోనూ ఎన్నో సమస్యలతో సతమవుతున్నాం.
ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి
అధిక సంతానం వద్దు అన్ని ప్రచారాలు చేసిన కాలం నుంచి వీధివీధికి ఇన్ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పడిన కాలంలోకి వచ్చాం. పాత సమస్యల్ని దాటి కొత్త సమస్యల్లోకి అడుగుపెట్టాం. ప్రస్తుతం చర్చించవలసిన విషయం ఏంటంటే పిల్లలు బయట ప్రపంచంలో అడుగుపెట్టడానికి అనువైన పరిస్థితుల్ని కల్పించాలి. అందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సమాజం వారిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాల్సిన అత్యవర పరిస్థితి గురించి మాట్లాడుకోవాలి. పిల్లలు పుట్టాలంటే ఎలాంటి ఆహ్లాదరక వాతావరణం సృష్టించాలో తప్పని సరిగా తల్లిదండ్రులు తెలుసుకునేలా చేయడం కూడా బాలల దినోత్సవ సమస్యే.
ఆడిపాడాల్సిన వయసులో
మధ్యతరగతి, ధనిక కుటుంబాల్లో శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువ కావడం, ఆహారం కోసం హౌటళ్ళను ఆశ్రయించడం వంటి అనేక సమస్యల కారణంగా ప్రతి ఒక్కరూ 'డయాబెటిస్' పాలబడుతున్నారు. ఈ సమస్య పిల్లలనూ వదలడం లేదు. పుట్టుకతోనే డయాబెటిస్ సమస్య ఉండి, జీవితాంతం ఇబ్బందులు అనుభవిస్తున్న బాల్యం శాతం తక్కువేమీ కాదు. ఆడిపాడాల్సిన వయసులో ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకుంటూ బళ్ళకు, హాస్టళ్ళకు వెళుతున్న బాల్యం భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయమిది. పైకి ఏమాత్రం నొప్పి కలిగించకుండా లోపల్లోపల అవయవాల్ని కొరుక్కుతినేస్తుంది డయాబెటిస్.
ప్రపంచ వ్యాప్తంగా...
1991వ సంవత్సరం నుండి నవంబరు 14వ తేదీని 'ప్రపంచ డయాబెటీస్ డే''గా జరుపుకోవాలని ''వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్'', ''ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్'' సంస్థలు సంయుక్తంగా నిర్ణయం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధిగ్రస్తుల శాతం అధికంగా పెరుగుతున్నందున డబ్ల్యూహెచ్ఓ ఇలా నిర్ణయించింది. ఈ డయాబెటిస్ డే జరుపుకోవడానికి ప్రపంచంలోని 160 దేశాలు, డయాబెటిస్ సంస్థలు 230 కలిసి సంతకం చేశాయి. ఇందులో టైప్ - 1 డయాబెటిస్, టైప్ - 2 డయాబెటిస్ అని రెండు రకాల వ్యాధులున్నాయి. టైప్ - 2 వ్యాధి నివారించగలిగినది. టైప్ - 1 వ్యాధి నివారించలేనిది కేవలం కంట్రోల్లో పెట్టగలం.
అవగాహాన పెంచాలి
డయాబెటిస్ రావడానికి గల కారణాలు, కారకాలు, అందులో ఉండే రిస్క్ ఫాక్టర్స్, ఈ వ్యాధి మిగతా అవయాలపై చేసే దాడి గురించిన విషయాలు అందరూ చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి గాను ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ముందుకు వస్తున్నది డబ్ల్యూహెచ్ఓ. పోయిన సంవత్సరం ఏర్పాటు చేసిన ''యాక్స్‌స్ టు డయాబెటిస్ కేర్'' అనే నినాదం ఈ సంవత్సరమూ, వచ్చే సంవత్సరమరూ ఉపయోగిస్తారు. ''అవర్ ఫ్యూచర్ డయాబెటిస్ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్, ఉమెన్ అండ్ డయాబెటిస్, ఐఎస్ఆన్డయాబెటిస్, గో బ్లూ ఫర్ బ్రేక్ ఫాస్ట్, హెల్దీ ఈటింగ్ వంటి నినాదాలతో డయాబెటిస్ అవగాహనను ప్రజల్లో కల్పిస్తున్నారు.
భవిష్యత్ బాల్యం
పిల్లల్లో ఊబకాయం పెరగడం కారణంగా డయాబెటిస్ సమస్య తలెత్తుతున్నది. ఆటపాటలు, వ్యాయామాలు లేని బాల్యంలో డయాబెటిస్ వంటి ప్రమాద జబ్బులు సైతం వారిని వెంటాడుతున్నాయి. జంక్‌ఫుడ్, అనారోగ్య ఆహారాలను తీసుకోవడం వల్ల వ్యాధిగ్రస్తుల శాతం పెరుగుతున్నది. టీవీ, కంప్యూటర్లు, వీడియోలతో ఉన్న చోటనే కదలిక లేకుండా కూర్చుని ఉండడం వల్ల జువైనల్ డయాబెటిస్ బారిన పడుతున్నారు. టైప్ 1 డయాబెటిస్ వల్ల క్లోమగ్రంధి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల వ్యాధిగ్రస్తులవుతారు. ఇప్పుడు 'పిల్లల్లో డయాబెటిస్' అనే సమస్య అత్యవసరంగా చర్చించుకోవాల్సిన అంశం. సామాజిక, శారీరక కారణాలను కనిపెట్టి నివారించకపోతే భవిష్యత్ బాల్యం డయాబెటిస్ నోట్లో పడి నలిగిపోతుంది. కాబట్టి మన బాల్యాన్ని కాపాడుకోవడానికి మనం సమాయత్తం కావాలి.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్