Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో చాలామంది కూర్చున్న చోటు నుంచి లేవకుండానే పనులన్నీ చకచకా ముగించుకోవాలనుకుంటున్నారు. ఇందుకు తగినట్టుగానే వివిధ రకాల గ్యాడ్జెట్లు సైతం పుట్టుకు రావడంతో చాలామందిలో ఒక రకమైన బద్ధకం ఆవహిస్తుంటుంది. ఇదే వారు క్రమంగా బరువు పెరిగేలా చేస్తుంది. మరి ఇదిలాగే కొనసాగితే క్రమంగా బరువు పెరిగే వారంతా కొన్నాళ్లకు స్థూలకాయులుగా మారే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే వ్యాయామాన్ని రోజువారీ ప్రణాళికలో భాగం చేసుకోమంటున్నారు. అయితే అందుకు పెద్దగా కష్టపడాల్సిన పని లేదని, ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఆఫీస్ పని చేసుకుంటూ, ఉన్న చోటు నుంచి కదలకుండానే సులభంగా బరువు తగ్గేయచ్చని సలహా ఇస్తున్నారు.
మంచినీళ్లు తాగండి: అధిక బరువును తగ్గించే శక్తి నీళ్లకు ఉంది. అందుకే బరువును బట్టి సరైన మోతాదులో నీళ్లు తాగడం ఇటు ఆరోగ్యానికి, అటు ఫిట్‌నెస్‌కూ మంచిదని చెబుతుంటారు నిపుణులు. అలాగని గ్లాసులకు గ్లాసులు ఒకేసారి గటగటా తాగేయడం కాకుండా కూర్చొని నెమ్మదిగా సిప్ చేయాలంటున్నారు. ఇలా రోజంతా ఇదే పద్ధతిని పాటించడం వల్ల ఎలాంటి శ్రమ లేకుండా ఎంచక్కా బరువు తగ్గేయచ్చట.
కాస్త కదిలిస్తే చాలు: రోజంతా కూర్చున్న చోటు నుంచి లేవకుండా పనితోనే గడిచిపోతుంది. అలాంటప్పుడు వ్యాయామం చేసే సమయం చాలామందికి ఉండడం లేదు. ఫిట్నెస్ విషయంలో ఇది చాలామందిని వేధించే ప్రశ్నే! కానీ అలా కూర్చున్న చోటు నుంచి లేవకుండా శరీరంలో చేరిన అదనపు క్యాలరీలను కరిగించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగంటే పనిచేసే మధ్యలో ఓ ఐదు-పది నిమిషాల పాటు విరామం తప్పకుండా దొరుకుతుంది. అలాంటప్పుడు బద్ధకంగా ఓ కునుకు తీయడమో, మొబైల్ చూడడమో కాకుండా.. చేతులు, కాళ్లతో చిన్నపాటి వ్యాయామాలు చేయండి.. దీనివల్ల ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కండరాలు బిగుసుకుపోకుండా జాగ్రత్తపడచ్చు.. అలాగే శరీరానికి చక్కటి వ్యాయామమూ అందుతుంది. బరువు తగ్గించుకోవడానికి ఇదీ ఓ మంచి మార్గమే అంటున్నారు నిపుణులు.
మనస్ఫూర్తిగా నవ్వండి: కూర్చున్న చోటే హ్యాపీగా నవ్వుతూ బరువు తగ్గేయచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల మన శరీరంలో బేసల్ మెటబాలిక్ రేటు (విశ్రాంతిలో ఉన్నప్పుడు జీవక్రియల పనితీరుకు అవసరమైన క్యాలరీల సంఖ్య) సుమారు 10-20 శాతం పెరుగుతుందని ఓ అధ్యయనం చెబుతోంది. అంటే రోజు మొత్తం మీద కనీసం ఒక పదిహేను నిమిషాల పాటు నవ్వితే దాదాపు 40-170 క్యాలరీల దాకా కరుగుతాయట. అంతేకాదు.. ఇలా మనం నవ్వే నవ్వు మనలోని ఒత్తిడి, ఆందోళనల్ని కూడా దూరం చేస్తుంది. బరువు తగ్గడానికి ఇదీ ఓ మార్గమే!
స్టెబిలిటీ బాల్‌పై: అలాగే ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నప్పుడు వీలైతే మధ్య మధ్యలో కొద్దిసేపు - స్టెబిలిటీ బాల్ పైన కూడా కూర్చోవచ్చు. దీనిపై నిటారుగా కూర్చోవడం వల్ల కాళ్లు, వెన్నెముక, పొట్ట.. వంటి భాగాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. అంతేకాదు.. బరువూ తగ్గచ్చు.