Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాస్త అలసటగా అనిపించినా, తలనొప్పిగా ఉన్నా ఓ కాఫీ తాగేయాలనిపిస్తుంది కదూ! ఆరోగ్యం దృష్ట్యా వ్యాయామాన్ని తప్పనిసరి చేసుకుంటున్న అమ్మాయిలెందరో! ఆ తర్వాతే ఓపికంతా ఆవిరైపోయినట్టు అనిపిస్తుంది. అలా జరగొద్దంటే వ్యాయామానికి ముందు కాఫీ తాగేయాలట! అయితే దానికి కొన్నింటిని జోడించాలి.
కాఫీ షేక్: బాగా పండిన అరటి పండును తీసుకొని దానికి కప్పు పాలు, స్పూను చొప్పున కోకో పౌడర్, ఆల్మండ్ బటర్, కొన్ని చుక్కల వెనీలా ఎసెన్స్ కలిపి మిక్సీ పట్టేయండి. తీపి కావాలనుకుంటే బెల్లం లేదా తేనె కలపొచ్చు. దీన్నో పెద్ద గ్లాసు తీసుకోండి. దీని ద్వారా పొటాషియం, ఫైబర్, ప్రొటీన్‌తోపాటు కావాల్సిన శక్తి అందుతుంది. చక్కెరల స్థాయిలు అదుపులో ఉండటమే కాక గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తుంది.
నెయ్యి, కొబ్బరినూనె: చిక్కని లేదా కొవ్వులేని పాలతో కాఫీ చేసుకోవాలి. దానికి స్పూను చొప్పున కొబ్బరినూనె, నెయ్యి కలిపితే సరి. ఇది శక్తిస్థాయుల్ని పడిపోకుండా చేయడమే కాదు.. ఆకలినీ అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల్నీ అదుపు చేయగలదు. అయితే వ్యాయామం తర్వాత పోషకాలతో కూడిన అల్పాహారాన్ని తీసుకోవడం మర్చిపోవద్దు.
చాక్లెట్‌తో: చల్లని బ్లాక్ కాఫీకి తేనె, డార్క్ చాక్లెట్ కలిపి మిక్సీ పట్టేస్తే సరి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. రక్తపోటును దరిచేరనీయవు. తక్షణ శక్తినీ ఇచ్చి చురుగ్గా ఉండేలానూ చేస్తాయి. డొపమైన్ విడుదలయ్యేలా చేసి, ఆనందంగానూ ఉంచుతాయి.