Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కెరియర్లో రాణించాలని ప్రతి అమ్మాయీ కలలు కంటుంది. కానీ... నిజంగా ఏదైనా సవాల్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్న భయంతో చాలామంది వెనకడుగు వేస్తుంటారు. దాంతో ఎదుగుదలకు అక్కడే అడ్డు పడుతుంది. ఈ ఇబ్బందిని దాటాలంటే...
ఎవరో ఏదో అంటారని, విమర్శిస్తారని ఏ పనీ చేయొద్దు. మీరు నమ్మితే... అది ఎంత కష్టమైనా, ఎన్ని విమర్శలొచ్చినా ముందడుగు వేయండి. విజయం సాధిస్తే... మిమ్మల్ని వెక్కిరించిన నోటితోనే శభాష్ అంటారు. అలా కాకుండా భయపడితే మిమ్మల్ని మీరు కోల్పోతారు. భయం ఈ విషయంలోనే కాకుండా ప్రతి అడుగులోనూ కనిపించి మిమ్మల్ని వెనక్కి లాగుతుంది.
విమర్శలకి భయపడొద్దు కానీ...వాటిని గమనించండి. కొన్ని పొరపాట్లని మీరు గుర్తించలేకపోయి ఉండొచ్చు కదా! వీలైతే...వాటికి పరిష్కారాలు వెతకండి. కొన్నిసార్లు వాటికి మీరు చూపించిన పరిష్కారాలే విజయానికి దగ్గర చేయొచ్చు.
జయాపజయాల్ని మీ వ్యక్తిత్వం నుంచి వేరుగా చూడండి. మీరు ప్రయాణించే మార్గంలో పాతాళంలోకి పడిపోయినా సరే దాని ప్రభావం మీ వ్యక్తిత్వంపై పడకుండా చూసుకోండి. అప్పుడే పడిన చోట నుంచే మరింత వేగంగా పైకి వచ్చి నిలబడగలరు. కెరియర్లో ఉన్నత స్థానాలకు చేరుకోగలరు.