Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ సీమా రావు, తరతరాలుగా మహిళలు పితృస్వామ్య సమాజాలంలో పురుషులకు మాత్రమే ప్రత్యేక హక్కుగా ఉన్న స్వేచ్ఛ కోసం పోరాడుతూనే ఉన్నారు. కొందరు ఆ పోరాటంలో విజయం సాధించలేక ఆగిపోతున్నారు. మరికొందరు ముందుకు సాగారు. అలాంటివారు పట్టుదలతో ఉన్నారు. అలాంటి వారిలో డాక్టర్ సీమా రావు ఒకరు. దేశంలోనే మొట్టమొదటి, ఏకైక మహిళ కమాండో ట్రైనర్‌గా చరిత్ర సృష్టించిన ఆమెపరిచయం నేటి మానవిలో...
డాక్టర్ సీమా రావు తన జీవితంలోని 25 సంవత్సరాలుగా 20,000 మంది సైనికులు, భారత సాయుధ దళాలు, పారామిలిటరీ, పోలీసులతో గడిపారు. ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్, ఎన్ఎస్జి బ్లాక్ క్యాట్స్, IAF గారూడ్ కమాండో ఫోర్స్, నేవీ మెరైన్ కమాండోస్ వంటి అనేక ఎలైట్ ఫోర్స్ నుండి ప్రతి ఉన్నత దళంలోని కమాండోలకు ఆమె శిక్షణ ఇచ్చారు.
తండ్రి నుండి ప్రేరణ
ఆమె తన భర్త డాక్టర్ దీపక్ రావు కలిసి క్లోజ్-క్వార్టర్స్ బాటిల్ (సిక్యూబి)లో చేసిన కృషికి మూడు ఆర్మీ చీఫ్ అనులేఖనాలను అందుకున్నారు. సీమా తండ్రి ప్రొఫెసర్ రామకంత్ సినారీ నుండి ప్రేరణ పొందవారు. ఆయన పోర్చుగీస్ వారితో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు. ''నాన్న భూగర్భ తిరుగుబాటుదారుడు. కాబట్టి నేను కచ్చితంగా తిరుగుబాటు, బలం ఉన్న నాన్న జీవితం నుండి ప్రేరణ పొందాను'' అంటారు ఆమె. తండ్రి జైలుకు ఎలా వెళ్ళాడు, పోర్చుగీస్ జైలు నుండి తోటి ఖైదీతో తప్పించుకోవడం, మాండోవి నదిలో ఈత కొట్టుకుంటూ రావడం ఇవన్నీ ఆమె ఎంతో గొప్పగా చెబుతున్నారు. ఈ విధంగా ఆమె తన తండ్రి నుండి ధైర్యాన్ని వారసత్వంగా పొందారు.
ప్రపంచంలోనే మొదటిది
''నా కమాండోస్ జీవితం గురించి ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యపోతాను. మొదట్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. మిలిటరీ మార్షల్ ఆర్ట్స్, ఇజ్రాయెల్ క్రావ్ మాగా, సైనిక యుద్ధ కళలలో శిక్షణ పొందాను'' అని చెబుతున్నారు సీమ. డాక్టర్ సీమా ఎన్సైక్లోపీడియా ఆఫ్ క్లోజ్ కంబాట్ ఆప్స్‌ను రచించారు. ఇది ప్రపంచంలో మొట్టమొదటిది. అంతేకాదు ఇది ఎఫ్బిఐ, ఇంటర్‌పోల్, బకింగ్‌హామ్ ప్యాలెస్ లైబ్రరీలలో చోటు దక్కించుకుంది.
సవాళ్ళను అర్థం చేసుకోవడానికి
సీమా కమాండోలకు శిక్షణ ఇస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. వాస్తవానికి ఆమె డాక్టర్ కావాల్సి ఉంది. వివిధ భూభాగాలు, పర్యావరణం, వాతావరణ పరిస్థితుల సవాళ్లను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండరు. కాబట్టి ఆమె తనను తాను నైపుణ్యాలతో సన్నద్ధం చేయడానికి చాలా శక్తియుక్తులను ప్రయోగించారు. ''లోతైన జలాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడానికి నేను సెయిలింగ్, యాచింగ్లో, స్కూబా డైవింగ్‌లో ఒక ప్రొఫెషనల్ కోర్సు చేసాను. అధిక ఎత్తులో, విపరీతమైన చలిలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి పర్వతారోహణలో ఒక కోర్సు. అడవిలో మనుగడ సాగించడానికి మాకు ఒక కోర్సు ఉంటుంది. ఆ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి నేను కూడా స్కైడైవింగ్ కోర్సు చేసాను'' అంటున్నారు ఆమె.
మహిళను ఎవరూ ఆపలేరు
మరణానికి సమీపంలో ఉన్న రెండు అనుభవాలను ఎదుర్కొన్న తర్వాత కూడా డాక్టర్ సీమా సవాళ్ళకు అస్సలు భయపడలేదు. కెరీర్ ఎంపికలలో ఆడామగా అనే తేడా లేదని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. ''మహిళలు వివిధ రంగాలలో అధికార స్థానాల్లో ఉన్నప్పటికి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఒక మహిళ తన రంగంలో రాణించకుండా, అనుకున్న ఎత్తులకు చేరుకోకుండా ఆమెను ఎవరూ ఆపలేరు. ఎక్కువ మంది యువతులు, మహిళలు దళాలలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. చాలామంది పోరాట చేసి విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తారు'' అంటున్నారు ఆమె. ప్రస్తుతం 52 ఏండ్ల వయసులో ఉన్న సీమా నారీ శక్తి పురాస్కర్ అవార్డు గ్రహీతగా నిలిచేరు. క్షేత్ర శిక్షణలో లేకపోయినా మహిళా సాధికారతకు తన సమయాన్ని కేటాయిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.