Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలంలో ఆహారం వేడిగా తినాలనిపిస్తుంది. ఈ కాలంలో సాధారణంగా జలుబు, దగ్గు ఉంటాయి కాబట్టి వేడి వేడి సూప్స్ ఉపశమనాన్ని ఇస్తాయి. సూప్స్‌లో హీలింగ్ పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో వాటిని తాగడం మంచిది. మనం ఇళ్లలో రెగ్యులర్‌గా చేసుకునే రసం, సాంబారు కూడా సూప్స్లాగే పనిచేస్తాయి. మీకోసం ఇక్కడ నాలుగు రకాల సూప్స్ ఇస్తున్నాం. వాటిని తయారుచేయడం చాలా సులువు. పైగా అవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బలాన్నిస్తాయి.
పాలకూర సూప్
కావాల్సిన పదార్థాలు: కప్పు గ్రైండ్ చేసిన పాలకూర, తగినంత ఉప్పు, మిరియాల పొడి, టీ స్పూన్ నెయ్యి లేదా వెన్న.
తయారు చేసే విధానం: స్టవ్ మీద బాండీ పెట్టి నెయ్యి వేసి కరిగిన తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి, ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్టు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత కప్పు నీళ్లు పోసి మరిగిన తర్వాత సర్వ్ చేయాలి.
వేడివేడి చికెన్ సూప్
కావలసిన పదార్థాలు: 350 గ్రాముల కాలీఫ్లవర్ ముక్కలు, 1/4 కప్పు బాదం పాలు లేదా చిక్కటి పాలు, కప్పు క్యారెట్ ముక్కలు, కప్పు సెలెరీ ముక్కలు లేదా ఉల్లికాడ ముక్కలు లేదా ముల్లంగి ముక్కలు, 1/2 కప్పు తెల్ల ఉల్లిగడ్డ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, రెండు కప్పుల ఆలూ ముక్కలు, అరకిలో చికెన్ (బ్రెస్ట్ భాగం), చికెన్‌ను ఉడకబెట్టిన ఉప్పు నీరు నాలుగు కప్పులు, స్పూన్ వాము, అర స్పూన్ వెల్లుల్లి పొడి, రుచి తగినంత ఉప్పు, మిరియాలు.
తయారు చేసే విధానం: ముందుగా అన్ని కూరగాయలను కోసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో కాలీఫ్లవర్‌ను ఉడకబెట్టుకొని ఆ తర్వాత అందులోని నీటిని మొత్తం తీసేసి కాలీఫ్లవర్ ముక్కలను ఒక పక్కన పెట్టుకోవాలి. మరోపాత్రలో కొద్దిగా నీరు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కావాలనుకుంటే చిటికెడు పసుపు కూడా వేసుకొచ్చు. ఈ నీటిలో శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను వేసి ఉడికించుకోవాలి. దీని తర్వాత చికెన్ వేరుచేసి ఈ నీటిని ఒక పక్కన ఉంచుకోవాలి. ఉడికిన చికెన్‌ను చిన్నచిన్న ముక్కలుగా తరుగుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో ఆలివ్ నూనె వేడి చేసి ఉల్లిగడ్డ, ముల్లంగి, క్యారెట్ ముక్కలను వేగించుకోవాలి. మెత్తగా ఉడికే వరకు వాటిని వేడిచేయాలి. ఆపై చికెన్ ఉడికించిన నీరు బాణిలో పోసుకొని, ఇందులోనే ఆలూ ముక్కలు, వాము, వెల్లుల్లి పొడి, మిరియాలు, తగినంత ఉప్పు వేసి మరిగించండి. మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. మరోవైపు పాలను బ్లెండర్‌లోకి తీసుకొని అందులో ఉడికించి ఆరబెట్టిన కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకొని అందులోకి తురిమిన చికెన్ ముక్కలను కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూరగాయలు మరిగిస్తున్న బాణిలో వేసి ఐదు నిమిషాల పాటు కలిపి దించేయాలి. చికెన్ సూప్ రెడీ అయినట్టే. దీనిని వేడివేడిగా ఆస్వాదించండి.
క్యారెట్ సూప్
కావాల్సిన పదార్థాలు: అరకప్పు ఉడకబెట్టి గ్రైండ్ చేసిన క్యారెట్, పావు కప్పు ఉడకబెట్టి మెదిపిన కందిపప్పు, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, నూరిన మిరియాలు, ఉప్పు, నెయ్యి, రెండు కప్పుల నీళ్లు.
తయారు చేసే విధానం: స్టవ్ మీద పాన్‌లో నెయ్యి వేడెక్కిన తర్వాత మిరియాలు, ఉప్పు, క్యారెట్ పేస్ట్ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. వెల్లుల్లి, అల్లం, కందిపప్పు, నీళ్లు వేసి మరిగిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేయాలి.
మష్రూమ్ సూప్..
కావాల్సిన పదార్థాలు: మష్రూమ్‌లు - 200 గ్రాములు, స్ప్రింగ్ ఆనియన్స్ - 2 కప్పులు, నువ్వుల నూనె - 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినవి), అల్లం - 1/2 అంగుళం (సన్నగా తరగాలి), సెలరీ - 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరగాలి), పెప్పర్ - 1/2 టీస్పూన్, సోయా సాస్ - టేబుల్ స్పూన్, నీళ్లు - 3 కప్పులు, ఉప్పు - తగినంత, ఉల్లిగడ్డ - ఐదు టేబుల్ స్పూన్లు, లవంగాలు - రెండు.
తయారు చేసే విధానం: మష్రూమ్లను బాగా కడిగి.. వాటిని తుడవండి. తర్వాత ముక్కలు చేయండి. ముందుగా పాన్‌లో నూనె వేసి వేడి చేయండి. దానిలో వెల్లుల్లి, అల్లం వేసి కొన్ని సెకన్లు వేయించండి. స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిగడ్డ వేసి.. ఒక నిమిషం పాటు వేయించండి. దానిలో పుట్టగొడుగులను, సెలెరీని వేసి బాగా కలపండి. మీడియం మంట మీద రెండు నిమిషాలు వేయించండి. ఇప్పుడు మూడు కప్పుల నీరు వేసి కలిపి మరగనివ్వండి. ఐదు నిముషాల తర్వాత.. దానిలో సోయా సాస్ వేయండి. పెప్పర్, సాల్ట్ కూడా కలపండి. మష్రూమ్స్ ఉడికే వరకు దానిపై మూత వేసి ఉడకనివ్వాలి. తర్వాత స్టౌవ్ ఆపేసి టేస్ట్ చెక్ చేసుకోండి. మీ రుచికి తగ్గట్టు ఏమైనా అవసరమైతే వాటిని కలపండి. వేడిగా సర్వ్ చేసుకుని ఆస్వాదించండి.