Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గర్భం ధరించామని తెలిసినప్పట్నుంచి సున్నితంగా మారిపోతుంటారు కొందరు. చిన్న చిన్న పనులు చేసుకోవడానికీ భయపడిపోతుంటారు. కారణం.. తాము చేసే పనుల వల్ల తమ కడుపులోని బిడ్డకు ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమోనని. అయితే కొంతమంది మాత్రం నెలలు నిండుతున్న కొద్దీ మరింత ఉత్సాహంగా పనిచేస్తుంటారు. రోజువారీ కూలీ పనులు చేసే వారి దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా ఎంతోమంది నిండు గర్భంతోనే తమ తమ పనుల్లో కొనసాగడం మనం చూస్తూనే ఉంటాం. నిజానికి గర్భం ధరించినా ఇలా యాక్టివ్‌గా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు. ఆరోగ్యం సహకరిస్తే డాక్టర్ సలహా మేరకు ప్రసవం సమీపించే దాకా తమ తమ పనుల్లో కొనసాగచ్చంటున్నారు. పైగా ఇలా తల్లి చురుగ్గా పనిచేయడం వల్ల అటు పుట్టబోయే పిల్లలు కూడా చురుగ్గా ఉంటారట. అలాగని పని పైనే పూర్తి ధ్యాస పెడుతూ కాబోయే తల్లులు ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకూడదని, తమ తమ విధుల్లో కొనసాగేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం...
కొన్ని ఉద్యోగాల్లో రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సి రావచ్చు.. మరికొన్ని వృత్తుల్లో ఎక్కువ సమయం నిల్చొనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే గర్భిణిగా ఇలా ఎక్కువసేపు నిల్చున్నా, కూర్చున్నా ఇబ్బందే. కాబట్టి మీ పనిని బట్టి నిర్ణీత వ్యవధుల్లో నిలబడుతూ, కూర్చుంటూ, అటూ ఇటూ తిరుగుతూ, విరామం తీసుకుంటూ ఉండాలి. తద్వారా శరీరంపై పని భారం పడకుండా జాగ్రత్తపడచ్చు. కూర్చున్నా, నిల్చున్నా శరీర భంగిమను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా పొట్టపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడచ్చు.
ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో కాస్త ఎక్కువ సమయం నిల్చోవాల్సి వచ్చినా.. రెండు కాళ్లను మరీ దగ్గరగా కాకుండా కాస్త దూరంగా ఉంచడం, అలాగే ఒక కాలిని ముందు మెట్టుపై లేదంటే ఒక చిన్న స్టూల్‌పై ఉంచేలా చూసుకోండి. తద్వారా మీ శరీర బరువు లోయర్ బ్యాక్‌పై పడకుండా ఉంటుంది.
పనిలో పడిపోయి భోజనం చేయడం మర్చిపోకూడదు. డాక్టర్ సూచన మేరకు సరైన పోషకాహారం తీసుకోవడంతో పాటు తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే మధ్యమధ్యలో తినడానికి పండ్ల ముక్కలు, నట్స్, సలాడ్స్.. వంటివి మంచి ప్రత్యామ్నాయాలు.
మీ బరువును బట్టి తగినన్ని నీళ్లు తాగడం, పండ్ల రసాలు, కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తపడచ్చు.
ఇక కూర్చున్నప్పుడు కూడా పాదాల్ని నేలకు ఆనించడం కాకుండా.. చిన్న స్టూల్ లాంటి దానిపై ఉంచే ఏర్పాటు చేసుకోండి. తద్వారా పాదాల్లో వాపు రాకుండా జాగ్రత్తపడచ్చు.
ఇంటి నుంచి పనిచేసినా, ఆఫీసుకు వెళ్లినా మీపై అధిక పని ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. వేళకు పనులన్నీ పూర్తయ్యేలా ఉదయమే చక్కటి ప్రణాళిక వేసుకుంటే సాయంత్రానికల్లా పనులన్నీ చకచకా పూర్తవుతాయి. తిరిగి త్వరగా ఇంటికి చేరుకోవచ్చు.