Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయం సాధించాలనే తపన... ప్రోత్సహించే తల్లిదండ్రులు... ఆదరించే మనషులు ఉంటే ప్రతి ఒక్కరూ ఓ విజేతగా మారతారు. దానికి చక్కటి ఉదాహరణ ఈ ఆటో డ్రైవర్ కూతురు. ఆమె థానియా సరాయ్. ప్రస్తుతం ఆమె భారత అండర్ -14 టెన్నిస్ జట్టులో భాగమయింది. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్.1 స్థానంలో నిలిచింది. దాతలు సహకరిస్తే దేశం గర్వపడేలా చేస్తానని నమ్మకంతో చెబుతున్న ఆమె పరిచయం మానవి పాఠకులకు ప్రత్యేకం...
అనంతపురంలో వెనుకబడిన కుటుంబాల నుండి వచ్చిన పిల్లలకు టెన్నిస్ పాఠాలు నేర్పే రఫా నాదల్ టెన్నిస్ అకాడమీ వుంది. అందులోనే థానియా సరారు తన కోచింగ్‌ను ప్రారంభించింది. అక్కడి నుండి మొదలైన ఆమె ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు 1709 ITF జూనియర్ ర్యాంకింగ్ సాధించింది. అలాగే మన రాష్ట్రంలో అండర్-14 విభాగంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. థానియా తనకు రోల్ మోడల్‌గా భావించే సెరెనా మాటలు ''మీకు ఎవరూ సాయం చేయడానికి ముందుకు రానప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించాలి'' అనేవి ఆమెను ఈ స్థానంలో నిలిపాయి.
టాప్ వందలో ఉండాలి
''నేను నా ఆటను, వ్యూహాన్ని మెరుగుపరుచుకుంటాను. సంవత్సరంలో కనీసం 16 ITF టోర్నమెంట్లు ఆడతాను. 2023 చివరి నాటికి టాప్ 100లో ఉండాలనుకుంటున్నాను'' అని థానియా ఇమెయిల్ ద్వారా ఓ వెబ్ పత్రికతో చాట్‌లో చెప్పారు. ఆమె ప్రస్తుతం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉంది. అక్కడ ఆమె ఇటీవల ITF పాకిస్తాన్ జూనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ ×, 2022, జీ5 అమ్మాయిల తరపున ఆడింది. శ్రీలంకకు చెందిన సాజిదా రజిక్తో క్వార్టర్-ఫైనల్ రౌండ్లో ఓడిపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అండర్-14 విభాగంలో నంబర్ 1 ర్యాంక్‌లో ఉన్న థానియా ఎప్పటిలాగే స్థిరంగా ఉంది.
వరల్డ్ టెన్నిస్ టూర్
జూనియర్స్ 18 ఏండ్ల వయసులో ఉన్న ఆటగాళ్లకు ప్రపంచాన్ని పర్యటించడానికి, వారి ప్రతిభను పెంపొందించే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రొఫెషనల్ గేమ్‌లో కొనసాగడానికి, విజయాన్ని సాధించడానికి ఇది అత్యుత్తమ ఆటగాళ్లకు లాంచ్ ప్యాడ్‌ను అందించినప్పటికీ థానియా తన పుట్టిపెరిగిన నేపథ్యాన్ని బట్టి ఆమె ఉన్న చోటికి చేరుకోవడం అంత సులభం కాలేదు. తన ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం ప్రారంభంలో అండర్-14 విభాగంలో భారతదేశంలో నంబర్ 3 స్థానానికి చేరుకోగలిగింది. ఐశ్వర్య దయానంద్ జాదవ్, సోహిని సంజరు మొహంతితో పాటు భారత జట్టులోకి కూడా ప్రవేశించింది. దీనికి గాను థానియా తనకు మద్ధతుగా నిలిచిన తన కుటుంబానికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతుంది.
ప్రతిభను పెంపొందించడం
థానియా తండ్రి శాంసన్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందినవారు. తల్లి రెబెక్కా. ఆమెకు హేమంత్ అనే అన్న కూడా ఉన్నాడు. చాలా చిన్నవయసులోనే కూతురిలో టెన్నిస్‌లో ప్రతిభ ఉందని తండ్రి గమనించాడు. థానియా తాత వరంగల్ జిల్లాలోని నర్సాపూర్ లయన్స్ క్లబ్లో ఆడిన టెన్నిస్ క్రీడాకారుడు. కాబట్టి తండ్రి కూతురులోని ప్రతిభను గమనించాడు. చిన్ని థానియా మొదట ఆరేండ్ల వయసులో అనంతపురంలోని రాఫెల్ నాదల్ టెన్నిస్ అకాడమీలో టెన్నిస్ ఆడటం ప్రారంభించింది. ఇది వెనుకబడిన నేపథ్యాల పిల్లలకు టెన్నిస్ పాఠాలు చెప్పే రాఫెల్ నాదల్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కేంద్రం. ''ఈ కేంద్రం మా ఊరికి అత్యంత సమీపంలో ఉండేది. అందుకే మా అమ్మాయి నాదల్ అకాడమీలో చేరింది'' అని శాంసన్ చెప్పాడు.
సానియా మీర్జా అకాడమీలో
తన కూతురి బలాన్ని మరింత పెంపొందించాలనే ఉద్దేశంతో ఆమె కుటుంబం మొత్తం హైరదాబాద్ వచ్చేసింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత శాంసన్ జీవనోపాధి కోసం ఆటో నడపడం ప్రారంభించాడు. థానియాను అడ్వాంటేజ్ టెన్నిస్ అకాడమీలో చేర్పించాడు. ఏడాదిన్నర తర్వాత సానియా మీర్జా టెన్నిస్ అకాడమీకి మార్చాడు. అక్కడ థానియాకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. శిక్షణా సంస్థ నగర శివార్లలో ఉండడంతో అక్కడ ఆటో నడుపుతూ జీవనం సాగించలేక శాంసన్ కుటుంబాన్ని హైదరాబాద్‌లోని మణికొండకు మార్చాడు. ప్రస్తుతం థానియా ఏ ప్రత్యేక అకాడమీతో అనుసంధానంగా లేదు. అయితే వివిధ కోచ్‌లలో శిక్షణ పొందుతోంది.
ఎంతో ఖర్చుతో కూడుకున్నది
''ఫిజియోథెరపీ, న్యూట్రిషనిస్ట్ సలహా, జిమ్ మొదలైన వాటితో పాటు టాప్ అకాడమీలలో కోచింగ్‌కు నెలకు ఆమెకు దాదాపు రూ. లక్ష ఖర్చవుతుంది. నేను ఆటో నడపడం ద్వారా వచ్చే ఆదాయంతో థానియాను వీలైనంత వరకు అండగా నిలవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఇలా ఎక్కువ కాలం కొనసాగించలేను. ఇక ఎంత కాలం నేను తనకు సాయం చేయగలనో తెలియదు'' అంటున్నారు శాంసన్. అతను ప్రతి టోర్నమెంట్‌కు థానియాతో కలిసి ప్రయాణిస్తాడు. ''థానియాకు దేశంతో పాటు, ఇతర దేశాల్లో కూడా వివిధ టోర్నమెంట్లలో పాల్గొనడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ టోర్నమెంట్లు ఆమె ర్యాంకింగ్‌లను మెరుగుపరచడంలో గణనీయంగా సహాయపడతాయి. కానీ అంతర్జాతీయ ప్రయాణం, వసతి మొదలైనవి ఖరీదైనవి. వాటిని భరించడం మా వల్ల అయ్యే పని కాదు'' అని శాంసన్ చెప్పారు.
సమతుల్యం చేసింది
రాష్ట్ర స్థాయి (తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్), జాతీయ AITA (ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్) స్థాయిలలో 128 టోర్నమెంట్లు ఆడిన థానియా 117 టోర్నమెంట్లు (సింగిల్స్, డబుల్స్ రెండూ) గెలుచుకుంది. 2021లో బహ్రెయిన్, నేపాల్, ఇప్పుడు పాకిస్థాన్ ఆడుకోవడానికి విదేశాలకు వెళ్లడం ప్రారంభించానని ఆమె చెప్పింది. గత సంవత్సరం వరకు ఆమె బెంగళూరులోని పాఠశాల నుండి ఆన్లైన్ తరగతులు తీసుకోవడం ద్వారా విద్యను, క్రీడలను సమతుల్యం చేసింది. థానియా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇలాంటి పాఠశాలల కోసం వెతుకుతోంది. ఇది ఆమెకు టెన్నిస్‌పై అభిరుచిని కొనసాగించడానికి అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో ఆమెకు విద్యాపరమైన దృక్పథాన్ని కూడా ఇస్తుంది. తన టెన్నిస్ ప్రయాణంలో స్పాన్సర్‌షిప్‌లు లేదా ఇతర విరాళాల ద్వారా తనకు ఇంతవరకు సాధ్యమయ్యేలా చేసిన దాతలకు, దయగల సహకారుల మద్దతు తనకు లభించినందుకు వారికి రుణపడి ఉంటానని థానియా చెప్పింది. ఇప్పుడు ఆటలో పాల్గొనడం ద్వారా వారిని, తన దేశాన్ని గర్వపడేలా చేయాలని కోరుకుంటుంది.