Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరూ చదువులు పూర్తి చేసి కెరియర్లో అడుగు పెడుతుంటారు. అప్పటి నుంచి అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఈ విషయంలో వెనకబడుతుంటారు. అలాంటప్పుడు కెరియర్లో నైపుణ్యాలను పొందాలంటే కొన్ని అలవాట్లను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం త్వరగా నిద్రలేవడం అలవరుచుకోవాలి. అలా లేవాలంటే రోజూ రాత్రి ఒకే సమయానికి నిద్ర పోవాలి. ధ్యానం, యోగా వంటి వాటికి ప్రాధాన్యతనిస్తే, భావోద్వేగాలను అదుపులో ఉంచే నైపుణ్యం అలవడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చల్లని లేదా గోరు వెచ్చని నీటిలో 20 నిమిషాల ఈత మెదడును రోజంతా చురుకుగా ఉంచుతుంది. సమయపాలనతో చేసే ఈ వ్యాయామాలన్నీ ఆరోగ్యాన్నిస్తాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మెదడును చురుకుగా మారుస్తాయి.
రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు చేసిన పనులన్నింటినీ ఓసారి పరిశీలించుకోవాలి. మరుసటి రోజు పూర్తిచేయాల్సిన వాటిని డైరీలో పొందుపరుచుకోవాలి. పనుల ప్రాముఖ్యతను బట్టి వరుసక్రమంలో రాసి, వాటిని పూర్తిచేసేలా ప్రణాళిక వేసుకోవాలి. ఆ రోజు జరిగిన సంతోషకరమైన క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటే మనసంతా సానుకూలంగా మారుతుంది. అనుకున్నట్లుగా రోజును పూర్తిచేసినందుకు హాయిగా నిద్ర పడుతుంది. కంటినిండా నిద్రతో శరీరం, మెదడు ఆరోగ్యవంతమవుతాయి. ఉదయానికి మనసంతా ఉల్లాసంగా ఉంటుంది.;;
కెరియర్ గురించి మాత్రమే కాకుండా స్వీయ సంరక్షణకూ ప్రాముఖ్యతనివ్వాలి. శారీరక, మానసికారోగ్యం ఉంటేనే కుటుంబ ఆరోగ్యాన్నీ పరిరక్షించగలం. పోషకాహారానికి ప్రాధాన్యతనివ్వడం, ఆరేడు గ్లాసుల నీటిని తీసుకోవడం అలవరుచుకోవాలి. లక్ష్యాలను సాధించగలననే ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా ఉంటే, అది ముఖంలోనూ ప్రతిఫలించి మరింత అందంగా కనిపించొచ్చు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటేనే, నిత్యం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అనుసరించొచ్చు. మల్టీ టాస్కింగ్తోనే కెరియర్, కుటుంబ సమన్వయం సాధ్యం. కుటుంబంతో కలిసి గడిపే సమయం బంధాలను బలపరుస్తుంది. వ్యక్తిగత సంతోషం బయటి ప్రపంచాన్ని గెలవడానికి కావాల్సినంత శక్తినిస్తుంది.