Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగులకు ఒత్తిడి తగ్గించడానికి ఇలాంటి కళలు నేర్పిస్తున్నారు. వారికి అప్పుడప్పుడు ఒక రోజంతా క్విల్లింగ్, మండలా ఆర్ట్, వర్లి ఆర్ట్ వంటివి నేర్పిస్తూ వారి చేత చేయిస్తూ ఉద్యోగలును సంతోషపెడుతున్నారు. ప్రతిరోజూ ఉండే ఉద్యోగ ఒత్తిడులను ఎదుర్కోవడానికి ఈ మధ్య ఇలాంటి ఆర్ట్‌లు నేర్పిస్తూ కళలను పరిచయం చేస్తున్నారు. క్విల్లింగ్కు చాలా పురాతన చరిత్ర ఉంది. దీనికి స్వస్థలం చైనా అంటారు. అయితే దీన్ని మొదట కనుగొన్నది ఈజిప్టులో అని మరికొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 300-400 ఏడీ లలో ప్రజలు వెండి, బంగారు దారాలను చుట్టుడానికి క్విల్లింగ్ పద్ధతులు వాడేవారు. బంగారు, వెండి వంటి లోహాలు అధిక ధరకు వెళ్ళే వరకు ఈ కళ బాగా ప్రాచుర్యంలోనే ఉన్నది. రాజుల సింహాసనాలు, గోడల వంటి వాటిపై లతలు వాటిలో తర్నాలను కలపడానికి సన్నని బంగారు దారాలను చుట్టడానికి స్వర్ణకారులు ఈ క్విల్లింగ్ను కనిపెట్టారు. క్రీ.శ.1700ల్లో టేబుళ్ళు, అలమారాలు, కాబినెట్లను అలంకరించేందుకు క్విల్లింగ్ పద్ధతిని ఉపయోగించేవారు.
క్విల్లింగ్ ఆర్ట్‌లో ఎన్నో రకాల బొమ్మలు చేయవచ్చు. జంతువులు, మనుష్యులు, పూలు, లతలు, చెట్లు, సీనరీలు, వాహనాలు ఒకటేమిటి మదిలో ఆలోచన ఉండాలేగానీ ఎన్నైనా సృష్టించవచ్చు. క్విల్లింగ్ను పేపర్ రోలింగ్, పేపర్ ఫిలిగ్రీ, పేపర్ స్క్రోలింగ్ అనే పేర్లతో పిలవబడుతున్నది. పూర్వం బంగారు, వెండి లోహాల తీగలను ఉపయోగించే స్థానంలో ప్రస్తుతం కాగితం వచ్చి చేరింది. గూస్ ఈకను బట్టి దీనికి 'క్విల్లింగ్ అనే పేరు వచ్చింది. ఈ ఆర్ట్ అత్యంత ఆకర్షణీయంగా ఉండటం వల్ల అందరి మన్నన పొందుతున్నది. మొదటగా క్విల్లింగ్ పేపర్‌ను తెచ్చుకోవాలి. సన్నగా పొడవుగా ఉండే రంగుల కాగితాల కట్టలు షాపుల్లో దొరుకుతాయి. ఈ కాగితాలను చుట్టి ఒక డ్రాయింగ్ షీటుగా అతికించడమే క్విల్లింగ్. మనం ఒక డిజైను ప్రకారంగా డ్రాయింగ్ షీటుపై గీసుకొని దానికి అనుగుణంగా రంగుల కాగితపు చుట్టల్ని అతికించుకుంటూ పొడవడమే క్విల్లింగ్ ఆర్ట్. కాగితాన్ని చుట్టుకోవడానికి ఒక నీడిల్ వంటి సాధనం కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఈ కాగితపు చుట్టుల్ని రకరకాల ఆకారాలుగా ఎలా చుట్టాలో తెలుసుకుందాం. ఒక చుక్కలా, ఆకులా, మామిడికాయలా వంపుగా, దోసగింజలాగా, కోడిగుడ్డు ఆకారంలా, రకరకాల ఆకారాలను ప్రాక్టీస్ చేస్తే బొమ్మలు అందంగా వస్తాయి. ఒకరోజు కాగితాలు చుట్టడం ప్రాక్టీస్ చేస్తే తర్వాత బొమ్మలు చేయవచ్చు.
పూల కొమ్మ
ఇది ఎంతో సులభంగా చేసుకోవచ్చు. ఒక కొమ్మ, దానికి ఐదారు పువ్వులు, రెండు మొగ్గలు పెడితే బాగుంటుంది. దీనికి గాను ఒక కార్డ్‌బోర్డు కానీ అట్టను కానీ తీసుకోవాలి. దానికి నలుపురంగు వేసుకుంటే బాగుంటుంది. ఆకులు కొమ్మలు అంటూ డెకరేషన్ చేస్తే నలుపు మీద కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇప్పుడు సన్నని చీలికలుగా ఉండే క్విల్లింగ్ పేపర్స్ తీసుకొని క్విల్లింగ్ నీడిల్ సాయంతో చుట్టాలి. గుండ్రంగా చుట్టాక కొద్దిగా పట్టు వదిలితే లూజ్ అవుతుంది. పొడుగ్గా ఉంచి నొక్కితే ఆకులాగా పనికొస్తుంది. ఆకుల కోసం ఆకుపచ్చ రంగు పేపర్‌ను వాడాలి. అదే విధంగా పూల రెక్కల కోసం వాన చుక్క ఆకారంలో చుడితే బాగుంటుంది. పూల రెక్కల కోసం రెండు రంగులు వాడితే వెరైటీగా ఉంటుంది. పూల కొమ్మల కోసం క్విల్లింగ్ పేపర్‌ను నిలువుగా అతికించాలి. అప్పుడు తీగలాగా కనిపిస్తుంది. ఫొటోలో చూస్తే మీకు అర్థం అవుతుంది. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎక్కువ కలర్‌ఫుల్‌గానూ ఉంటుంది.
కుందేలు
మొదటగా తెలుపు రంగు డ్రాయింగ్ షీటు మీద కుందేలు బొమ్మను వేసుకోవాలి. పెన్సిల్‌తో సన్నగా గీసి పెట్టుకుంటే బాగుంటుంద. తెలుపు కాకుండా నలుపు రంగు డ్రాయింగ్ షీటు తీసుకుంటే క్విల్లింగ్ పేపర్ తెలుపువి వాడవచ్చు. అయితే ఇపుడు తెలుపు డ్రాయింగ్ షీటు తీసుకున్నాం కాబట్టి క్విల్లింగ్ పేపర్ రంగుల్లో తీసుకుంటే బాగుంటుంది. నేను లేత ఆకుపచ్చ, మెరూన్, బ్లాక్ రంగుల పేపర్స్ వాడాను. నేను ఎక్కువ ఆకారాలు తయారు చేయకుండా వానచుక్క, దోసగింజ, గుండ్రం ఆకారాలు మాత్రమే చేశాను. కొమ్మల్లాంటి ఆకారాలతో కుందేలు శరీరాన్ని సృష్టించాను. మూతి దగ్గర మీసాలు, కన్నులకు క్విల్లింగ్ పేపర్స్ నిలువుగా అతికించాలి. కుందేలును చాలా సింపుల్‌గా చేశాను.
కొమ్మల్లో నెమలి
మొదట కొమ్మలు, పూలు చేసుకోవాలి. తర్వాత నెమలిని తయారు చేస్తే సులభంగా ఉంటుంది. దీనికి పువ్వుల్ని కొంచెం వెరైటీగా చేశాను. అంటే 3డి చిత్రం అనిపించేలా. గుండ్రంగా చుట్టిన క్విల్లింగ్ పేపర్ రౌండును నిలువుగా నిలబడినట్టు అతికించాను. మామూలుగా క్విల్లింగ్ రౌండ్స్‌ను ఉడుకోబెట్టినట్టుగా అతికిస్తాము. ఇది కొంచెం విభిన్నంగా చేద్దామని అనుకున్నాను. ఇందులో ఆకుల్ని బాగా పొడువుగా తీసుకున్నాను. పొడవు పెరగాలంటే బాగా లూజ్‌గా చుట్టాలి. నెమలి శరీరాన్ని, ఫించాన్ని బాగా రంగులతో అలంకరించవచ్చు. లేత ఆకుపచ్చ రంగుతో నెమలిని తయారు చేశాను నేను. నిండు బులుగు రంగు పేపర్లు అయిపోవటం వల్ల. ఇంట్లో ఉన్న రంగులతో నెమలిని చేశాను. నిండు రంగులు వాడితే నెమలి వర్ణమయంగా ఉంటుంది. క్విల్లింగ్ నెమలి అందంగా ఉంటుంది.
సీతాకోక చిలుక
సీతాకోకచిలుక తయారీలో కూడా బాగా రంగుల్ని ఉపయోగించవచ్చు. అనేక ముదురు రంగులతో సీతాకోక చిలుకను తయారు చేద్దాం. దీనికి కూడా నలుపు రంగు షీటును తీసుకొని దానిపై సీతాకోకచిలుక చిత్రాన్ని గీయాలి. తర్వాత రంగుల క్విల్లింగ్ పేపర్లను చుట్టుకుంటూ మామిడికాయ ఆకారంలో వచ్చేలా చూడాలి. మామిడి కాయ వంకను రెండు వైపులా వంపుతే ఇదొక ఆకారం వస్తుంది. మనం ఆకారాలు చేసుకుంటూ ఉన్నపుడు రకరకాల కొత్త ఐడియాలు కూడా వస్తుంటాయి.
కొమ్మ మీద పిట్ట
మన జీవితాల్లో నుంచి మాయమైపోతున్న పిచ్చుకను బొమమ్ల రూపంలో అయినా దాచుకుందామని ఈ బొమ్మను చేశాను. దీనికి బాగా నిండు రంగులు వాడాను. క్విల్లింగ్ చుట్లు ఇందులో కొత్తగా రూపొందించాను. ఇందులో ఆకుల్ని గమనించండి. పొడవుగా వరస పేపర్లు చుట్టి, మధ్యలో మాత్రమే రింగులు వచ్చేలా తయారు చేశాను. తర్వాత మొగ్గల్ని కూడా తమాషాగా చేశాం. బాగా గట్టిగా చుట్టిన క్విల్లింగ్ చుట్టును మధ్యలో కిందకు నొక్కితే ఒక గుంటలా, గిన్నెలా ఏర్పడుతుంది. దీనిని పూ మొగ్గలుగా చూపించడానికి వాడాను. ఇలా కొద్ది భిన్నంగా చేయాలని ప్రయత్నించాను. పిచ్చుక శరీరానికి నేను క్విల్లింగ్ పేపర్లను బాగా పొడవుగా చేశాను. రంగురంగులతో తయారైన పిచ్చుక అందంగా ఉంది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్