Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శైలజా టీచర్... కరోన వైరస్ బీభత్సం సృష్టించిన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిన పేరు. అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన మంత్రిగా, కరోనా సంహారిణిగా, రాక్ స్టార్ హెల్త్ మినిస్టర్‌గా గార్డియన్ మ్యాగజైన్, బీబీసీ కీర్తించాయి. యుకే ప్రాస్పెక్ట్ మ్యాగజైన్ 'ది వరల్డ్స్ టాప్ థింకర్ అవార్డు' ప్రకటించినా, నోబెల్ ప్రైజ్ తర్వాత అంతటి ప్రతిష్టాత్మకమైన జరామన్ మెగాసెస్ అవార్డు తనను వెతుక్కుంటూ వచ్చినా ఆమెలో ఇసుమంతైనా గర్వం చోటు చేసుకోలేదు. అదే వినయం, అంకితభావంతో ముందుకు సాగుతూనే ఉన్నారు. ఎదిగిన కొద్దీ ఒదగడం అనే భావానికి ఒక రూపం ఇస్తే అది ఆమే అవుతుంది.
మీ కుటుంబ నేపధ్యం?
నేను 1956 నవంబర్ 20న కేరళలోని కన్నూర్ జిల్లాలో కూతుపరంబులో పుట్టాను. మా కుటుంబం స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నది. ఇప్పుడూ ప్రజాతంత్ర ఉద్యమాలతో మమేకమై పని చేస్తున్నది. విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో పని చేశాను. 1981లో ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ టీచర్‌గా ఉద్యోగంలో చేరాను. పిల్లలతో చనువుగా ఉంటూ వారి సామాజిక, ఆర్ధిక పరిస్థితులు అర్ధం చేసుకొనేదాన్ని. వాళ్ళు సమాజానికి దర్పణాలు. శాస్త్రీయ దృక్పథంతో బోధన చేస్తూనే గ్రామాల్లో మూఢ నమ్మకాలను తొలగించడం కోసం కృషి చేశాను. వెనుకబాటుతనం నుండి బయట పడటం కోసం ఉద్యమాల్లో పాల్గొనాలని చెప్పేదాన్ని. ఎస్ఎఫ్ఐలో పని చేసిన అనుభవం విద్యార్థులను సంఘటితంచేయడానికి ఉపయోగపడింది. పిల్లలు వారి తల్లిదండ్రులు నన్నెంతో అభిమానించేవారు. నా జీవితంలో అనేక మెట్లు ఎక్కి వచ్చినా ''శైలజా టీచర్'' అనే పిలుపే నాకు ఎక్కువ ఇష్టం. 1994 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నాను.1996లో తొలిసారి ఎమ్మెల్యే నయ్యాను. మూడవసారి 2016లో తిరిగి గెలిచాక వామపక్ష ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను.
ప్రపంచాన్నే గడగడ లాడించిన నిఫా వైరస్‌ను, కరోనాను అద్భుతంగా కట్టడి చేశారు. ఇందులో మీ పాత్ర, మీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు గురించి వివరించండి?
1957లో బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన రాష్ట్రం కేరళ. అదొక రివల్యూషనరీ గవర్నమెంట్. ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసినట్టుగా అప్పటి సీఎం కామ్రేడ్ ఇఎంఎస్ నంబూద్రీ పాద్ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం అందరికీ భూమి, విద్య, ఆరోగ్యం అనే నినాదంతో ముందుకు సాగింది. లక్షలాది ఎకరాల భూమి పంచారు. విద్యా శాఖ మంత్రి జోసెఫ్ ఆధ్వర్యంలో ప్రతీ గ్రామంలో స్కూల్ పెట్టారు. ప్రతీ పంచాయతీలో హైస్కూల్ స్థాపించారు. పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను వికేంద్రీకరించారు. అది మంచి ఫలితాలను తెచ్చింది. అక్షరాస్యత పెరగడంతో సాంఘిక సంస్కరణలు అమలు చేస్తూ, శాస్త్రీయ దృక్పథంను ప్రజల్లో బలంగా పాదుకొల్పాము. తరచుగా అధికారంలో ఉండే అవకాశం ప్రజలు మాకు ఇస్తున్నందున పబ్లిక్ హెల్త్ సిస్టం మీద దృష్టి సారించాం. అట్టడుగు స్థాయి వరకు ఆరోగ్య సేవలు విస్తరించబడ్డాయి.
2016లో కామ్రేడ్ పినరయి విజయన్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో నేను వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. మారిన పరిస్థితులకు అనుగుణంగా వైద్య రంగాన్ని ఆధునికరించాలని నిర్ణయించాం. రకరకాల కొత్త జబ్బులు వస్తున్నాయి. వాటిమీద అధ్యయనం చేశాను. మా సీపీఎం పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందిస్తామని వాగ్దానం చేసింది. నేను మా ఆరోగ్య కార్యదర్శి, ఉన్నత వైద్యాధికారులతో చర్చలు జరిపాను. మీరేం కోరుతున్నారు అని వాళ్ళు నన్ను అడిగారు. WHO(world Health Organization) slogan "Prevention is better than cure".ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌ను బలోపేతం చేయాలని ఆ సంస్థ గైడ్ చేస్తుంది. మేము దాన్నే అనుసరించాలనుకున్నాం. మా ప్రభుత్వం నాలుగు ప్రాధాన్యతా రంగాలను గుర్తించింది. 1.గృహ కల్పన, 2.విద్య, 3.ఆరోగ్యం, 4.నవ కేరళ-వ్యవసాయం, పారిశుద్ధ్యం. ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌ను ఫ్యామిలీ హెల్త్ సెంటర్స్‌గా మార్చాము. అవి పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉండేలా అభివృద్ధి పరచాం. ప్రభుత్వ ఆసుపత్రిలోకి ప్రవేశించినప్పుడు అది పూదోటలా కనువిందు చేసే విధంగా ఆవరణను మార్చాము. రిసెప్షనిస్టు వచ్చిన వారి వివరాలను, రోగ లక్షణాలను డిజిటలైజ్ చేస్తారు. అన్ని ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాం.
అధునాతన పరికరాలను, లాబరేటరీలను సమకూర్చాం. యోగా కేంద్రాలు, మానసిక స్వస్థత కేంద్రాలు ఏర్పాటు చేశాం. డివిజనల్, జిల్లా కేంద్రాల్లో 400 హాస్పిటల్స్ ఏర్పాటు చేశాము. ఈ స్థాయి ఆసుపత్రుల నిర్మాణం, టెక్నాలజీ కోసం ఒక్కో హాస్పిటల్ కోసం 20-100 కోట్ల వరకు వెచ్చించాం. రాష్ట్ర స్థాయి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఒక్కో మెడికల్ కాలేజీ కోసం 200-900 కోట్లు ఖర్చు చేశాం. రెవల్యూషనరీ మెడికల్ సిస్టం కేరళ అంతటా ఆవిర్భవించింది. హెల్త్ కంట్రోలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి సమన్వయం చేసుకున్నాము. శిశు మరణాలు 2016లో 1000కి 12 ఉంటే 2020 నాటికి నీటి ఆయోగ్ గణాంకాల ప్రకారమే 5.4 కు తగ్గించగలిగాము.
మా హెల్త్ సిస్టమ్ ఇంత బలంగా ఉన్నందునే నిఫా వైరస్, కరోనా వైరస్ లను test-trace-isolate and support పథకంతో కంట్రోల్ చేయగలిగాం. చైనాలోని ఊహాన్‌లో కరోనా బయట పడిన వెంటనే భారత కేంద్ర ప్రభుత్వం స్పందించడానికి చాలా ముందే విదేశాల నుండి వచ్చిన వారికి కౌన్సిలింగ్ చేసి 14 రోజుల పాటు ఐసోలేషన్ సెంటర్లలో అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పించి ఉంచాం. లక్షణాలు కనపడిన ప్రతీ చోట ఆయా గ్రామాలు, పట్టణాలకు రాకపోకలు నిలిపివేసి ఆ కుటుంబాలకు ఆహారం, వైద్యం అందించాం. దానివల్ల వైరస్ వ్యాప్తిని కట్టడి చేశాము.
''వైరస్'' పేరుతో సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ మలయాళం(ప్రస్తుతం ప్రైమ్ వీడియో ఓటీటీ లో తెలుగులో కూడా చూడవచ్చు)లో వచ్చింది. నటి రేవతి మీ పాత్రను చాలా బాగా పోషించారు. నెఫా వైరస్ కంట్రోల్ చేయడానికి మీ ప్రభుత్వం, మీరు తీసుకున్న చర్యలు ఏమిటి?
వైరస్ సినిమా నేను కూడా చూశాను. చాలా బాగుంది. అందులో ప్రజల బాధలు కొన్నే చూపించగలిగారు. అయితే మా కృషిని కేరళకు ఆవల ఉన్న ప్రజలు కూడా తెలుసుకొనే విధంగా చేయగలిగింది. ఆ విధంగా విస్తృత మద్దతు పొందగలిగాము. తొలుత నిఫా వైరస్‌ను ఒక కుటుంబంలో కనుగొనగానే ఆ గ్రామానికి నేను వెళ్ళాను. ఆ గ్రామానికి కావాల్సిన సమస్తం ప్రభుత్వం సరఫరా చేసింది. బాగా శిక్షణ పొందిన ఆశ వర్కర్లు, అంగన్వాడి వర్కర్లు తగిన జాగ్రత్తలు తీసుకొని వైద్య సేవలు అందించారు. తొలి దశలో 18 నెఫా వైరస్ కేసుల్లో 16 మంది చనిపోయారు. అది కిల్లర్ వైరస్. దానికి ట్రీట్మెంట్ ఎలా చేయాలో, మందులు ఏవి ఇవ్వాలో కూడా తెలియదు. అయినా అంతర్జాతీయ సహకారంతో వాటిని కనుక్కున్నాం. తక్కువ సమయంలో తక్కువ ప్రాణ నష్టంతో ఆ వైరస్‌ను కంట్రోల్ చేయగలిగాం. అమెరికా హెల్త్ మిషన్ సీఎం గారిని, నన్ను ప్రత్యేకంగా కాన్ఫరెన్స్‌కు ఆహ్వానించారు. తరచి తరచి మేము తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మేం పడిన కష్టాన్ని గుర్తించారు. మమ్మల్ని అభినందించారు.
రామన్ మెగాసేస్ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్. దానికి మీరు ఎన్నికయ్యారు. ఏ కారణం చేత స్వీకరించనని మీరు రిజెక్ట్ చేశారు?
రామన్ మెగాసిస్ అవార్డు నోబెల్ ప్రైజ్ తర్వాత అంతటి ప్రతిష్టాత్మక మైనది. వ్యక్తులు వివిధ రంగాల్లో అందించిన విశిష్ట సేవలు గాను ఈ అవార్డును ప్రధానం చేస్తారు. ప్రతి ఒక్కరూ దానిని పొందాలని కోరుకుంటారు. మన దేశం నుండి అత్యంత గౌరవనీయులైన మదర్ థెరిస్సా నుండి పాలగుమ్మి సాయినాథ్ వరకు దాన్ని తీసుకున్నారు. కానీ మొట్టమొదట ఒక రాజకీయ నేతకు ఈ బహుమతి ఇవ్వడానికి వాళ్లు నిర్ణయించారు. కోవిడ్-19, నిఫా వైరస్‌ని సమర్ధవంతంగా కంట్రోల్ చేసినందుకుగాను వ్యక్తిగత హోదాలో, కేరళ వైద్య శాఖ మంత్రిగా నాకివ్వదలుచుకున్నారు. రామన్ మెగాసెస్ పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి. ఫిలిప్పీన్స్ దేశ నియంతగా ఉండి వేలాది మంది కమ్యూనిస్టులను ఊచకోత కోసాడు. అలాగే ఆ అవార్డుకు అమెరికా సిఐఏ లాంటి సంస్థలు విరాళాలు అందిస్తాయి. నేను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలను. మేము మా పార్టీలో చర్చించాం. అవార్డు వద్దనుకున్నాం. అంతే కాదు వైరస్‌లను కంట్రోల్ చేయడంలో నా పాత్ర ప్రముఖంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న చర్యలు ప్రజల సహకారంతోనే సాధ్యమైంది. సమిష్టితత్వం వల్ల ఒనగూడిన ఆ విజయాన్ని వ్యక్తికి అపాదించడం సరి కాదు. ఆ రెండు కారణాల వల్ల అవార్డు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను.
ఓ టీచర్‌గా దేశ భవితను తీర్చిదిద్దే ఉధ్యాయులకు మీరిచ్చే సందేశం?
జీవితంలో నేను ఎన్ని ఉన్నత స్థానాలకు చేరినా టీచరుగా పిలిపించుకోవడం అంటేనే నాకు చాలా ఇష్టం. నావృత్తిని అంతగా ప్రేమిస్తాను, గౌరవిస్తాను. ఆ వృత్తి ద్వారా ఎంతో మందిని చైతన్య పరచవచ్చు. సమాజంలో తగు మార్పుల్ని తీసుకుని రావడానికి అవకాశం ఉంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సోషలిజం భావాలను ప్రతిభావంతంగా విద్యార్థులకు నేర్పాలి. తరగతి గదులే రేపటి భవిష్యత్తుకు పునాది కానున్నాయి. ఆ బాధ్యతను ఉపాధ్యాయులు అర్థం చేసుకొని అంకిత భావంతో ప్రజలతో కలసి పనిచేయాలని కోరుచున్నాను.
ఇంటర్వ్యూ:జంగయ్య, శ్రీబి.నరసింహారావు