Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆఫీస్ మీటింగ్.. ఆలోచనలేమో ఎక్కడికో వెళ్లిపోతుంటాయి. కూరమాడిందన్న సంగతి వాసన వచ్చేవరకూ తెలియలేదు. ఏమీ ఆలోచించట్లేదు.. అయినా ఎందుకిలా? అంటే.. పెరిగిన ఒత్తిడే కారణమంటున్నారు నిపుణులు. తరచూ ఇలా జరుగుతోంటే తగిన జాగ్రత్తలూ తీసుకోవాలంటున్నారు.
పనిపై శ్రద్ధపెట్టలేకపోవడం, పరధ్యానంగా ఆలోచనలు చుట్టుముట్టడం.. దీనికి బాధలే కారణం కాకపోవచ్చు. ఒత్తిడి, మానసిక అలసటా ఈ స్థితికి దారితీస్తాయి. కాబట్టి మీ మెదడు సరిగా రీఛార్జ్ అవుతోందో లేదో చెక్ చేసుకోండి. నిద్ర శరీరాన్ని మరమ్మతు చేసే గొప్ప సాధనం. అది ఏమాత్రం తగ్గినా మానసిక అలసటకు దారితీస్తుంది. కాబట్టి ఒకే సమయానికి నిద్ర, కనీసం 7 గంటలుండేలా జాగ్రత్తపడండి.
ఆకలి ఇబ్బంది పెడుతోంటే మనసు మాత్రం ఏం పనిచేస్తుంది? పనుల్లో పడి మనమేమో దాన్ని అశ్రద్ధ చేస్తుంటాం. అప్పటికప్పుడు దాన్నుంచి తప్పించుకోవడానికి చిరుతిళ్లను ఆశ్రయిస్తుంటాం. పిల్లలకే కాదు.. మనకీ పోషకాలు అవసరమే. నట్స్, పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వండి. వేళలకి తినడం అలవాటు చేసుకోండి.
వ్యాయామం శరీరానికే కాదు మనసుకీ ఆరోగ్యాన్నిస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తికీ సాయపడుతుంది. యోగా, నడక, డ్యాన్స్, మెట్లు ఎక్కి, దిగడం.. నచ్చిందేదైనా 20 నిమిషాలు రోజూ తప్పనిసరిగా చేయండి.
మీ ఉదయాల్ని ధ్యానంతో మొదలుపెట్టండి. ప్రశాంతంగా కండ్లు మూసుకొని శ్వాసపై దృష్టిపెడితే సరి.. ఆరోజుకు ఉల్లాసంగా సిద్ధమైపోతారు. కుదరలేదనుకోండి.. కోపం, చిరాకుగా అనిపించినా, కాస్త సమయం దొరికినట్లు అనిపించినా చేసేయండి. మార్పు మీరే గమనిస్తారు.
చిరాకుగా అనిపించినా, ఆలోచనలు వేధిస్తున్నా పుస్తకం పట్టేసుకోండి. మామూలు సమయంలో కంటే చదివేప్పుడు ఎక్కువ శ్రద్ధ పెడుతుంటామట. కాబట్టి రోజూ వార్తాపత్రిక, పుస్తకం ఏదో ఒకటి చదివేయండి. రోజూ దీనికి సమయాన్ని కేటాయించుకోండి. ఈ విషయంలోనూ ఫోన్ మీద ఆధారపడొద్దు. పుస్తకాలకే ప్రాధాన్యమివ్వండి.