Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తియ్యని మోరంగడ్డను ఇష్టపడని వారెవరుంటారు? ఉడికించినా, అలాగే తిన్నా వాటి రుచే వేరు. కేవలం రుచే కాదు వాటిల్లో ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలెన్నో ఉంటాయి. ఈ దుంపల్లో విటమిన్ డి అధికంగా లభిస్తుంది. అది ఎముకలు, దంతాలను ధృఢంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరు బాగుండేలా చూస్తుంది. అయితే ఈ మోరంగడ్డతో కాస్త వెరైటీ వంటలు ట్రై చేస్తే మరింత రుచిగా ఉంటాయి. అవేంటో ఈ వారం తెలుసుకుందాం...
మోరంగడ్డ కూర
కావలసిన పదార్థాలు: మోరంగడ్డలు- అరకిలో, టమాటా- మూడు, మిర్చి- రెండు, పెరుగు- అరకప్పు, కొత్తిమీర తురుము- 3 టేబుల్స్పూన్లు, నూనె- 3 టేబుల్స్పూన్లు, జీలకర్ర- అరటీస్పూను, ఇంగువ- చిటికెడు, పసుపు- పావు టీస్పూను, దనియాలపొడి- టీస్పూను, కారం- పావుటీస్పూను, గరంమసాలా- పావుటీస్పూను, ఉప్పు- తగినంత, అల్లంవెల్లుల్లి- టీస్పూను.
తయారుచేసే విధానం: టమాటాలు, మిర్చి ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. పెరుగుని బాగా గిలకొట్టాలి. మోరంగడ్డ బాగా కడిగి పొట్టు తీసి ముక్కలుగా కోసి ఉప్పువేసిన నీళ్లలో వేసి ఉంచాలి. ప్రెషర్ పాన్లో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. తరవాత ఇంగువ, పసుపు, దనియాల పొడి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు టమాటా,మిర్చి ముద్ద, కారం వేసి కలిపి నూనె తేలే వరకూ వేయించాలి. తర్వాత ముక్కలు వేసి రెండు నిమిషాలు వేగాక సుమారు ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు బాగా గిలకొట్టిన పెరుగు కూడా వేసి మరిగించాలి. ఇప్పుడు ఉప్పు వేసి మూతపెట్టి ఓ విజిల్ రానివ్వాలి. ఆవిరిపోయాక మూతతీసి సిమ్లో నాలుగు నిమిషాలు ఉడికించాలి. తరవాత గరంమసాలా, కొత్తిమీర తురుము వేసి కలిపి ఓ నిమిషం ఉంచి దించాలి.
గులాబ్ జామున్
కావల్సిన పదార్థాలు: మోరంగడ్డ- ఒకటి పెద్దది, మైదా- రెండు టేబుల్స్పూన్లు, ఉప్పు- చిటికెడు, వంటసోడా- చిటికెడు, నూనె- వేయించేందుకు సరిపడా, చక్కెర- ఒకటింబావు కప్పు, నీళ్లు- ఒకటింబావు కప్పు, యాలకులపొడి- అరచెంచా.
తయారుచేసే విధానం: మోరంగడ్డ చెక్కు తీసి ఉడికించుకోవాలి. తరవాత దీన్ని మెత్తని ముద్దలా చేసి అందులో ఉప్పు, మైదా, వంటసోడా వేసి అన్నింటినీ కలిపి ముద్దలా కలపాలి. ఐదు నిమిషాలు నాననిచ్చి చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని వేడౌతున్న నూనెలో రెండుచొప్పున వేసుకుని ఎర్రగా వేయించి తీసుకోవాలి. అదే సమయంలో మరో గిన్నెలో చక్కెరా, నీళ్లూ తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. చక్కెర కరిగి తీగపాకం అవుతున్నప్పుడు యాలకులపొడి వేసి దింపేయాలి. పాకం కాస్త వేడి తగ్గాక వేయించిన మోరంగడ్డ ఉండల్ని అందులో వేస్తే చాలు. నోరూరించే మోరంగడ్డ గులాబ్జామున్ రెడీ...
హల్వా
కావల్సిన పదార్థాలు: ఉడికించిన మోరంగడ్డ- పావు కేజీ, బెల్లం తురుము- అరకప్పు, డ్రైఫ్రూట్స్-కొద్దిగా, యాలకుల పొడి- టీస్పూను, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు, తురిమిన బాదం - కొద్దిగా, వేయించిన కొబ్బరి ముక్కలు- కొద్దిగా.
తయారుచేసే విధానం: మొదట నెయ్యిలో డ్రైఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి. పాన్లో కొద్దిగా నెయ్యి పోసుకుని అది వేడయ్యాక మోరంగడ్డ పేస్ట్ అందులో వేసుకుని కొద్దిసేపు బాగా కలియబెట్టాలి. తర్వాత అందులో బెల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం బాగా దగ్గరకు వచ్చే వరకు కలియబెట్టాలి. స్టౌ సిమ్లో పెట్టుకుని అందులో యాలకుల పొడి చల్లి వేయించుకున్న డ్రైఫ్రూట్స్, ఎండుకొబ్బరి ముక్కలు కూడా వేసుకుని దించేసుకోవాలి.
పులుసు
కావలసిన పదార్థాలు: మోరంగడ్డలు- పావుకిలో, మునక్కాయలు-1 లేక 2, మిర్చి- నాలుగు, కారం- సరిపడా, నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు, చిక్కగా తీసిన చింత పండు పులుసు- కప్పు, ఉల్లిగడ్డలు- ఆరు, బెల్లం- వంద గ్రాములు, జీలకర్ర- కొద్దిగా, కరివేపాకు- ఒక రెమ్మ, కొత్తిమీర- కొద్దిగా, వెల్లుల్లి పేస్ట్- టేబుల్ స్పూన్.
తయారు చేసే విధానం: ఉల్లిగడ్డలు మ్కులుగా కట్ చేసుకోవాలి. మోరంగడ్డలు చెక్కు తీసి గుండ్రంగా పెద్ద ముక్కలు చేయాలి. మునక్కాయలు చిన్న ముక్కలుగా కట్చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి కాగాక వెల్లుల్లి పేస్ట్ మిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. వేగిన తర్వాత దానిలో ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక చింతపండు పులుసు సరిపడా నీళ్ళు పోసి మరుగుతుండగా ఉప్పు, కారం, బెల్లం వేయాలి. దానిలో తరిగి పెట్టుకున్న మోరంగడ్డ దుంపలు, మునగకాయలు వేసి మిశ్రమం చిక్కగబడ్డాక దించేసి కొత్తిమీర చల్లుకోవాలి. అంతే తియ్యగా రుచిగా ఉండే మోరంగడ్డ పులుసు రెడీ.