Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు అన్నాడు'' ఓ కవి. నిజమే ప్రపంచీకరణ ప్రభావంలో మనిషిలో స్వార్థం పెరిగిపోయింది. అయిన వారినే దూరం పెట్టేస్తున్నారు. పిల్లలు ఎవరైనా తల్లిదండ్రుల నుండి ఆస్తులు, అంతస్తులు వారసత్వంగా తీసుకుంటారు. కానీ కమల మాత్రం వారిలోని మానవత్వాన్ని, అభ్యుదయ భావాలను అందిపుచ్చుకున్నారు. మన అనుకున్న వారందరినీ అక్కున చేర్చుకునేవారు. అందునా వామపక్ష భావాలు కలిగిన వారు ఎవరైనా కనబడితే చాలు ఆప్యాయంగా ఆదరించేవారు. కడవరకు అవే భావాలతో జీవించిన ఆమె ఈ నెల 12వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఆమె సంతాప సభ సందర్భంగా ఆమె సన్నిహితులు వారి అనుబంధాన్ని మానవితో ఇలా పంచుకున్నారు.
అప్యాయంగా పలకరించేవారు
పశ్చిమగోదావరి జిల్లాలో వాలమర్రు. 1938, ఆగస్టు 11న జన్మించారు. తెలంగాణ ప్రజాపోరాటానికి వెన్నుదన్నుగా నిలచి, రహస్యంగా సంచార జీవితం గడిపిన ఉద్దంరాజు రామం, మాణిక్యాంబలు ఆమె తల్లిదండ్రులు. వారితో కలిసి బాల్యాన్నే మరచి కఠోర జీవితాన్ని గడిపారు కమల. తల్లిదండ్రులు స్వాతంత్రోద్యమంలో పని చేశారు. గాంధీజీ ఆశయాలతో ఉన్నత శిక్షణ పొంది, స్వాతంత్రోద్యమంలో అద్భుతమైన పాత్ర పోషించారు రామం దంపతులు. కాంగ్రెస్‌లో ఉంటూనే కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులయ్యారు. అవే భావాలు కమలగారు పుణిచిపుచ్చుకున్నారు. అందరిని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. కమ్యూనిస్టులంటే అమితమైన గౌరవం. చివరి వరకు అవే భావాలతో ఉండి కన్నుమూశారు. ఆమెను చివరి చూపు చూడలేకపోయినందుకు ఎంతో బాధపడుతున్నాను.
మాటల్లో చెప్పలేము
కమల, నేను చల్లపల్లి బంగళాకు ఎదురుగా ఉన్న మా ఆఫీసు నుంచి, సూర్యాపేటలో వున్న ఇళ్ళకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. దారిలో కాసేపు కూర్చునేదాన్ని. అప్పుడే మాణిక్యాంబ గారి గురించి, వారి రాజకీయ జీవితం గురించి కమల ద్వారా తెలుసుకున్నాను. తర్వాత కాలంలో కమలతో నా పరిచయం పెరిగింది. మా అమ్మాయికి ఆరు నెలల వయసు ఉన్నప్పుడు జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. అప్పుడు మధు అరెస్ట్ అయ్యాడు. పసిపాపతో నేను ఒంటరిగా వున్నానని కమల వచ్చి నన్నూ, పాపాయిని వాళ్లింటికి తీసుకువెళ్ళింది. అక్కడున్న మూడు రోజులు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది. ఇంట్లో వాళ్ళందరూ పాపను ఒక్క క్షణం కూడా కింద దించకుండా చేతులపైనే మోశారు. అప్పుడే కాదు ఏ సందర్భంగా వారింటికి వెళ్ళినా కమల ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆమె చూపే ఆదరణ మాటల్లో చెప్పలేము. కమల తమ్ముడు బాపిరాజు రామం గారి గురించి రాయల్సిందిగా అడిగినప్పుడు కమలకు ఫోన్ చేసి అమ్మా నాన్న గురించి వివరాలు చెప్పమని అడిగాను. ఆ సమయంలో నాతో చాలా సేపు మాట్లాడింది. నన్ను ఒకసారి చూడాలని వుందని కూడా అంది. తర్వాత బాపిరాజు కూడా నన్ను తన దగ్గరకు తీసుకువెళతానని చెప్పాడు. కానీ అనుకోకుండా కమల అనారోగ్యంతో హాస్పిటల్లో చేరి విగతజీవిగా ఇల్లు చేరింది. కమలను చూడలేకపోయానే అనే బాధ నాలో ఎప్పటికీ ఇలా మిగిలిపోయేవుంటుంది.
పార్టీ వాళ్ళు వస్తే సంబరపడేది
మా తాతయ్య జాతియోద్యమంలో పని చేయడం, కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితుడయ్యాడు. ఇదంత అమ్మా, మామయ్యలపై బాగా ప్రభావం చూపింది. సత్యాగ్రహంలో పాల్గొని మా అమ్మ కూడా తాతయ్యతో పాటు అరెస్టు అయ్యింది. తాతయ్య సాధాసీదాగా జీవించేవారు. బంగారం, బట్టలపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. పిల్లల్ని కూడా అలాగే పెంచారు. చదువు, సంస్కారానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. అమ్మ కూడా అవే భావాలతో పెరిగింది. మమ్మల్ని కూడా అలాగే పెంచింది. మా నాన్న కూడా అవే భావాలతో ఉండేవాడు. పార్టీ కుటుంబాలంటే అమ్మకు ఎంతో ప్రేమ. అమ్మమ్మ, తాతయ్యను చివరి వరకు అమ్మనే చూసుకునేది. మమ్మల్ని కూడా వారి దగ్గరకు పంపేవారు. తను ఉన్నన్ని రోజులు ఇంటికి ఎవరైనా పార్టీ వాళ్ళు వస్తే ఎంత సంతోషపడేది. ప్రతి రోజు పేపర్ చదివి రాజకీయ విషయాలు చర్చించేది. చివరి వరకు అలాగే గడిపేది. మేము చదువుకునేటపుడు అనవసరంగా టైం వేస్ట్ చేస్తే అస్సలు ఒప్పుకునేది కాదు. అదే ఎస్.ఎఫ్.ఐ కార్యక్రమాలకు వెళ్ళినపుడు మాత్రం ప్రోత్సహించేది. మా కుటుంబంలో మొదటి కులాంతర వివాహం మాదే. మొదట్లో కాస్త భయపడింది. కానీ పుతుంబాక వెంకటపతిగారు, భారతి గారు ధైర్యం చెప్పారు. కోటోశ్వరావు చాలా మంచి వ్యక్తి, కమ్యూనిస్టు కుటుంబమే భయపడాల్సింది ఏమీ లేదు అని సర్ది చెప్పారు. ఏది ఏమైనా అమ్మకు పార్టీ అన్నా, పార్టీ కుటుంబాలన్నా చాలా అభిమానం. ఇప్పటి వాళ్ళు ఆ ప్రేమా ఆప్యాయతలకు దూరం అవుతున్నారని అప్పుడప్పుడు బాధపడుతూ ఉండేది. పార్టీ కుటుంబాలు ఒకరికొకరు తోడుగా, అండగా వుండాలని భావించేది.