Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమలపాకులు కొన్ని రకాల అనారోగ్యాన్ని దూరం చేయడానికి ఉపయోగపడతాయని చెబుతుంటారు పెద్దలు. ఇందుకు వీటిలోని ఔషధ గుణాలే కారణం. మరి వీటిలో ఉండే ఔషధ గుణాలేంటి? అవి ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయో తెలుసుకుందాం...
కొంతమంది తమలపాకులను ప్రతిరోజూ నములుతుంటారు. దీనివల్ల శరీరంలో ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే తొలగిపోతాయి. పెద్ద కప్పు నీటిలో కొన్ని తమలపాకులు వేసి నీళ్లు సగమయ్యేంత వరకు మరిగించాలి. ఈ నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
ఇవి నోటి, శరీర దుర్వాసనను దూరం చేస్తాయి. అలాగే దంతాల నుంచి వచ్చే బ్లీడింగ్‌ని ఆపి.. దంతాలను దృఢపరిచే గుణం తమలపాకులకు ఉంది. శరీరంపై ఏర్పడే దురద, నోటి నుంచి రక్తం కారడం.. మొదలైన సమస్యలను కూడా దూరం చేస్తాయి. క్రిములను నాశనం చేసే యాంటీసెప్టిక్ గుణాలు ఈ ఆకులో పుష్కలంగా ఉన్నాయి.
ఏదైనా అనారోగ్యం వల్ల తల్లులు పసి పిల్లలకు పాలివ్వకపోతే అవి రొమ్ముల్లో గడ్డకట్టుకుపోతాయి. దీనివల్ల భరించలేని నొప్పి వస్తుంది. ఈ సమయంలో తమలపాకులను కొద్దిగా వేడి చేసి వక్షోజాల పైన ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.
గాయాలు మానడానికి తమలపాకుల్ని ఉపయోగిస్తారు. అదెలాగంటే.. కొన్ని తమలపాకుల నుంచి తీసిన రసాన్ని గాయంపై రాసి.. దానిపై మరో తమలపాకును ఉంచి కట్టు కట్టాలి. రెండుమూడు రోజుల్లోగా గాయం మానే అవకాశం ఉంది.
జీర్ణశక్తిని మెరుగుపరచడానికి పూర్వ కాలం నుంచే తమలపాకుల్ని వాడుతున్నారు. తమలపాకుల్ని నమిలితే వచ్చే లాలాజలం మింగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అందుకే భోజనం అవగానే తాంబూలం వేసుకోవడం మంచిదంటారు.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తమలపాకులు ఎంతగానో మేలు చేస్తాయి. ఛాతీలో నొప్పి, గుండెలో మంట.. మొదలైన సమస్యలు ఏర్పడితే ఒక టీస్పూను తమలపాకు రసాన్ని తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
వెన్నునొప్పితో బాధపడే వారు.. తమలపాకులకు కొద్దిగా నూనె రాసి వెన్నునొప్పి ఉన్నచోట మర్దన చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.