Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రుబీనా నఫీస్ ఫాతిమ... చిన్నతనం నుండే సేవా దృక్పథంతో పెరిగారు. ఎంత సేవ చేసినా మనసుకు తృప్తినివ్వలేదు. వ్యాపారం చేశారు. అస్సలు రుచించలేదు. 'మహిళలు ఆర్థికంగా బలపడాలి' అనే తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. తన కమ్యూనిటీలోని మహిళలను, యువతను అభివృద్ధి చేయాలనే ఆలోచనకు వచ్చారు. చదువుకుని, చదువులేక నాలుగ్గోడలకే పరిమితమైన మహిళలపై దృష్టిపెట్టారు. 'సఫా' ఆధ్వర్యంలో వారికి జీవనోపాధికి సంబంధించిన శిక్షణ అందించేందుకు ముందుకు వచ్చారు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. అయినా పట్టువీడకుండా శ్రమించారు. ప్రస్తుతం ముస్లిం మహిళలను, యువతను అభివృద్ధి పథంలో నడుపుతున్నారు. హైదాబాద్‌లోని పాతబస్తీలో ఎంతోమంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దారు. ఆర్థికంగా స్థిరపడేలా చేశారు. ఓ ముస్లిం కుటుంబంలో పుట్టిన మహిళ తన కమ్యూనిటీ కోసం ఇంతటి సేవలు అందించడమంటే మామూలు విషయం కాదు. దాని గురించి ఆమె ఏమంటున్నారో ఆమె మాటల్లోనే...
సఫా ఎందుకు ప్రారంభించారు?
2006లో సఫా ప్రారంభించాను. నా ప్రాధమిక లక్ష్యం ముస్లిం కమ్యూనిటీని అభివృద్ధి చేయడం. ముఖ్యంగమేం చేయాలో తెలియక నాలుగ్గోడలకే పరిమితమైన మహిళలకు జీవనోపాధి, చదువు అందించడం. చదువుకున్న మహిళలైనా, చదువురాని వారికైనా జీవనోపాధికి సంబంధించిన విషయాలపై శిక్షణ ఇప్పించడం. అలాగే యవతకు కూడా. దీని కోసం అనేక స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాము.
అసలు సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
దీని గురించి చెప్పాలంటే ముందు నా చిన్నతనం గురించి కాస్త చెప్పాలి. మేము అమ్మానాన్నకు నలుగురం ఆడపిల్లలం. నాన్న ఆర్మీ ఆఫీసర్‌గా పని చేసేవారు. దాంతో నా చదువు కోసం దేశంలో అనేక ప్రాంతాలకు తిరిగాం. దాంతో అనేక సంస్కృతులను, సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. అలాగే ఆర్మీ కుటుంబాలతో కలిసి పెరిగాను. అక్కడి వాతావరణం చాలా బాగుండేది. మతం, కులం, భాష అనే తేడా అస్సలు వుండేది కాదు. అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మా నాన్న మా నలుగురిని అన్ని విషయాల్లో ప్రోత్సహించేవారు. వేసవి సెలవుల్లో కూడా ఖాళీగా ఉండనిచ్చేవారు కాదు. ఏదైనా నేర్చుకొమ్మని పంపిచేవారు. లేదంటే ఏవైనా సేవా కార్యక్రమాల్లో వాలింటీర్‌గా పంపేవారు. అంతేగానీ ఖాళీగా మాత్రం అస్సలు కూర్చోనిచ్చే వారు కాదు. అలేగే ఆడపిల్లలు తమ కాళ్ళపై తాము నిలబడాలి, డబ్బు సంపాదించి ఆర్థికంగా స్థిరపడాలి, ఒకరిపై ఆధారపడకూడదు అని చెప్పేవారు. దాంతో చిన్నతనం నుండే స్వతంత్ర భావాలు మాకు అలవడాయి. మా అక్క అయితే 17 వయసులోనే ఇంట్లో ఎరోబిక్ క్లాసులు చెప్పి డబ్బు సంపాదించేది. అలాగే నేను కూడా. దాంతో ఇటు సేవ పట్ల, మహిళలు ప్రతి ఒక్కరు ఆర్థికంగా బలంగా ఉండాలి అప్పుడే గౌరవం అనే భావన ఏర్పడింది. అలా ముస్లిం కమ్యూనిటీలోని మహిళలను, యువతను తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే సఫా ప్రారంభించాను.
హైదరాబాద్‌తో మీ పరిచయం?
మా తాతయ్య వాళ్ళది హైదరాబాద్. డిగ్రీ చదివే సమయానికి మేము హైదరాబాద్ వచ్చాం. కోఠి ఉమెన్స్ కాలేజీలో బి.కాం పూర్తి చేశా. తర్వాత పెండ్లి చేసుకుని సౌదీ వెళ్ళాను. నా భర్త వృత్తిరీత్యా లాయర్. అయితే ట్రావెల్ ఇండిస్టీ ఉండేది. సౌదీలో మావారి బిజినెస్‌కు సహకరిస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే దాన్ని. ఇతర దేశాల నుండి అక్కడికి చాలా మంది వచ్చేవారు. వారికి అవసరమైన సాహకారం అందించేవాళ్ళం. కొంత కాలానికి తిరిగి హైదరాబాద్ వచ్చేశాం. నేనూ సొంతంగా బిజినెస్ ప్రారం భించాను. కానీ అది నాకు పెద్దగా తృప్తినివ్వలేదు. తర్వాత కొంతకాలం స్ట్రీట్ చిల్డ్రన్ కోసం పని చేశాను. కానీ అదీ నాకు పెద్దగా నచ్చలేదు. ఇది నా కల కాదు. వేరే వాళ్ళ కలను నేను నిజం చేస్తున్నాననిపించింది. బాగా ఆలోచించిన తర్వాత నా ముస్లిం మహిళల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనకు వచ్చాను. ఇది కదా నేను చేయాల్సింది అనిపించింది. బాగా ఆలోచించి చెన్నై వెళ్ళి సోషల్ వర్క్ పైన ట్రైనింగ్ కోర్సు కూడా చేశాను. అది పూర్తయే నాటికి సొంతంగా ఓ సంస్థ ప్రారంభించాలనే ఆలోచనకు వచ్చాను.
ఇవన్నీ చేసే క్రమంలో కుటుంబం నుండి ఆటంకాలు ఏమీ రాలేదా?
అటంకాలు చెప్పే అవకాశం నేను వాళ్ళకు ఇవ్వలేదు. ఇక్కడా ఇబ్బంది లేకుండా సమన్వయం చేసుకునేదాన్ని. దాంతో నాకు నచ్చింది చేసే స్వేచ్ఛ వచ్చింది. చివరి దశలో బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత సేవ చయొచ్చు కదా. సంపాదించే వయసులో ఇవన్నీ ఏంటీ అంటుంటారు చాలా మంది. కానీ నా ప్రకారం మనకు శక్తి ఉన్నప్పుడే అనుకున్నది చేయాలి. అందుకే సఫా ప్రారంభించాలి అనుకున్న వెంటనే గోలానగర్, రోడ్ నెంబర్ 12లో చిన్న ప్లేస్ చూసుకుని నా పని ప్రారంభించా. రెండు సెకండ్ హ్యాండ్ కుట్టుమిషన్లు తీసుకున్నా. అయితే ప్రారంభంలో చాలా కష్టంగా అనిపించింది. ప్రతి ఇంటికి వెళ్ళి మహిళలతో మాట్లాడేదాన్ని. వారు ఏం చేయాలనకుంటున్నారో, జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో అడిగేదాన్ని.
ప్రారంభంలో ఎవరైనా మీకు సహకరించారా?
మా అమ్మ కొంత సహకారం చేసింది. నేను అంతకు ముందు బిజినెస్ చేశాను కదా ఆ డబ్బు ట్రైనింగ్ కార్యక్రమాలకు ఉపయోగించాను. అలా మూడేండ్లు గడిచింది. నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. సంస్థలో ఎలాంటి అభివృద్ధి లేదు. ఒకానొక దశలో దీన్ని ఆపేయాల్సి వస్తుందేమో అనే భయం కూడా పట్టుకుంది. మా ఇంట్లో కూడా ''చేయాలనుకున్నావు కానీ సక్సెస్ కాలేదు. నీ ప్రయత్నం నువ్వు చేశావు. ఇక చాలు. నీకు అంతగా సేవ చేయాలని ఉంటే వాలెంటీర్‌గా చేసుకో'' అన్నారు. కానీ నాకు మాత్రం ఎంత కష్టపడైనా దీన్ని నడిపించాలి అనుకున్నాను. చివరికి నడిపించాను.
ప్రస్తుతం మీరు చేస్తున్న కార్యక్రమాలు?
ఇప్పుడు సఫా తరపున 14 ప్రాజెక్టులు చేస్తున్నాం. మా దగ్గర 85 మంది ఉద్యోగులు ఉన్నారు. 1.5 లక్షల రూపాయల ప్రయోజనాలు అందించాము. హైదరాబాద్ పాతబస్తీ మొత్తం కలిపి 1100 మంది మహిళలు మేము ఏర్పాటు చేసిన సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల్లో ఉన్నారు. 1400 మంది ముస్లిం మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారు. ఇలా మా కమ్యూనిటీ ప్రజలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ముస్లింలకు చాలా మందికి ప్రభుత్వం తీసుకువస్తున్న పధకాల గురించి అవగాహన లేదు. కింది స్థాయి వరకు వాటి సమాచారం వెళ్ళడం లేదు. అలాంటి వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. 14 స్లమ్ ఏరియాల్లో ఈ డెస్కులు పని చేస్తున్నాయి. చాలా మంది వీటిని ఉపయోగించుకుంటున్నారు. వారి చదువును బట్టి వాళ్ళు ఏ స్కీంకు అర్హులో చెప్పి అప్లయి చేసుకోవడానికి కావల్సిన సహకారం అందిస్తాం. ఇలా గత సంవత్సరం 26 వేల అప్లకేషన్లు చేయించాము. మహిళలకు కూడా చాలా చేయాలని ఉంటుంది. డబ్బు సంపాదించి కుటుంబానికి అండగా నిలబడాలని ఉంటుంది. కానీ ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియదు. అలాంటి వారికి అవగాహన కల్పిస్తున్నాం. డబ్బు సంపాదించడం మొదలైన తర్వాత కుటుంబంలో ఆమె స్థాయి కచ్చితంగా మారిపోతుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. దీన్నే వాళ్ళకు అర్థమయ్యేలా చెప్తాము. అమ్మాయిలకు చదువు, ఆర్థిక భరోసా చాలా అవసరం.
టెక్నాలజీకి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నట్టున్నారు?
అవును, ఎందుకంటే టెక్నాలజీ గురించి ముస్లిం సమాజంలో పెద్దగా అవగాహన లేదు. అలాంటి అవగాహన కల్పించి టెక్నాలజీలో వారిని అభివృద్ధి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అలాగే మురికి వాడల్లో జీవిస్తున్న ముస్లిం ప్రజలకు కావల్సిన అవసరాలు చూడాలి. వారు కూడా బాధ్యత తీసుకునేలా చేయాలి. నాయకత్వ లక్షణాలు పెరగాలి. అలాంటి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. విలువలతో కూడిన నాయకత్వాన్ని తయారు చేయాలి.
జనరేషన్లలో మార్పే సఫా
సఫాలో పని చేయడం చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ముస్లిం మహిళలను ఒక మనిషిగా చూస్తారు. ప్రతి మహిళా మానసికంగా శారీరకంగా తమ లక్ష్యం నిర్ధారించుకునేలా తీర్చిదిద్దుతారు. వారిపై వారికి నమ్మకం పెరిగేలా చేస్తారు. దాంతో వారు తమ కుటుంబానికే కాదు, సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడతారు. నేను మహిళల జీవనోపాధికి సంబంధించిన సెక్షన్ చూస్తాను. మహిళలకు అసలు ఏం కావాలి, ఎవరిలో ఎంత నైపుణ్యం వుందో తెలుసుకుని దాన్ని బయటకు తీస్తారు. నేను ఆఫీస్‌కి వెళుతుంటే చాలామంది ''నువ్వు ఆఫీస్‌కి వెళుతున్నావా? ఆఫీస్‌కి వెళ్ళాల్సింది మగవాళ్ళు కదా'' అంటుంటారు. అంటే ఉద్యోగం కేవలం మగవారు మాత్రమే చేయాలి అనే భావన ఇప్పటికీ మా కుటుంబాల్లో ఉంది. ఈ ఆలోచన నుండి బయట పడేందుకు సఫా ఎంతో కృషి చేస్తుంది. అందుకే నాకు ఈ సంస్థ బాగా నచ్చింది. చిన్న చిన్న విషయాలు కూడా మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. మా అమ్మ ఆలోచనలకు ఇప్పటి నా ఆలోచనలకు కొంత మార్పు వచ్చింది. రేపు నా పిల్లల ఆలోచనల్లో మరింత మార్పు వస్తుంది. అంటే సఫా జనరేషన్లలో మార్పు తీసుకురావడంపై దృష్టి పెడుతుంది.
- నెమతున్నీసా, సఫా సభ్యురాలు
ఎంతైనా అభివృద్ధి చెందవచ్చు
ఇక్కడికి రాక ముందు యునెటెడ్ వే ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి పిల్లల కోసం పని చేశాను. పిల్లలు స్కూల్‌కి వచ్చి పదుకొండు గంటలకల్లా నిద్రపోయేవారు. కానీ ఆ సమయం వారు బాగా నేర్చుకోవడానికి మంచి సమయం అని నిపుణులు చెబుతారు. కానీ ఆ టైంలో వాళ్ళు నిద్రపోతున్నారు. ఎందుకని టీచర్‌ని అడిగితే ''వాళ్లు ఇంటి నుండి ఏమీ తినకుండా వస్తారు. ఇంట్లో తింటానికి ఏమీ ఉండదు. ఆకలితో ఉంటారు. అందుకే నీరసంతో తొందరగా నిద్రపోతారు'' అని చెప్పారు. వాళ్ళంతా మిడ్డే మీల్ కోసమే స్కూల్‌కి వస్తున్నారు. అందుకే పిల్లల ఎడ్యుకేషన్ కోసం వారి తల్లిదండ్రులతో కలిసి పని చేయాలి వారికి జీవనోపాధి కల్పిస్తే బాగుంటుందనిపించింది. మహిళల హక్కుల కోసం పని చేసే సఫా గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ బాగా నచ్చింది. ఎక్కడా దాపరికాలు ఉండవు. మనం ఏమి చేయగలమో ఆ పని అప్పగిస్తారు. మనకు నచ్చిన పని చేసే అవకాశం ఉంటుంది. మనం ఎంత అభివృద్ది చెందగలమో అంత ముందుకు తీసుకుపోతారు.
- రిజ్వానా అంజూమ్, సఫా మేనేజర్.
- సలీమ