Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పై చదువులూ, ఉద్యోగంలో స్థిరత్వం అంటూ కొందరమ్మాయిలు పెండ్లిని వాయిదా వేస్తున్నారు. కుటుంబ జీవితం చాలని ఉద్యోగాన్ని పక్కన పెట్టేయడం ఎలా సరి కాదో, కెరియరే ముఖ్యమనుకుని పెండ్లిని నిర్లక్ష్యం చేయడమూ అంతే పొరపాటని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెంటికీ ప్రాధాన్యం ఇవ్వాలి. తగిన వయసులోనే పెండ్లి చేసుకోవాలి, లేదంటే అనర్థాలు తప్పవు అంటున్నారు. ఎందుకో కారణాలు కూడా చెబుతున్నారు.
డిగ్రీ కాకుండానే సంబంధాలు వచ్చాయి కదాని తొందరపడి ఏదో ఒకటి ఎంచుకోవద్దు. భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఏం చేయాలని కలలు కంటున్నారో, ఎలాంటి వ్యక్తి అయితే జీవితం సజావుగా, సంతోషంగా సాగుతుందో నిశితంగా ఆలోచించండి. అలాంటి వ్యక్తి మీకు తారసపడితే సరే. లేదంటే మీ భావాలను అమ్మా నాన్నలకు చెప్పండి.
పెండ్లి ముందే ఇల్లూ, కెరియర్ గురించి చర్చించి, తగిన నిర్ణయం తీసుకోండి.
పెండ్లి పరిపక్వత అవసరమే. కానీ వయసు పెరిగేకొద్దీ అభిప్రాయాలు స్థిర పడతాయి. సర్దుబాటు గుణం సన్నగిల్లుతుంది. 'నేనింతే, నాకు తగ్గట్టుగా అవతలి వారు ఉండాలే కానీ నేను రాజీపడేది లేదు' అనిపిస్తుంది. అప్పుడిక పెండ్లి ఆనందానికి బదులు ఆందోళన మిగులుస్తుంది.
స్వేచ్ఛ, స్వతంత్రభావాలూ అలవాటయ్యాక భాగస్వామి కంటే కెరియరు, సొంత వ్యాపకాలు ముఖ్యమనిపిస్తాయి. దాంతో విభేదాలు తలెత్తే అవకాశముంది. సర్దుబాట్లు బానిసత్వంలా అనిపించి, తనకు నచ్చినట్టు యథేచ్ఛగా జీవించడం మేలనిపిస్తుంది. కానీ తాత్కాలికంగా ఆహా అనిపించే ఆ ఏకాంతం కొన్నాళ్లకి చీకటిలా మారి ఒంటరితనంతో తల్లడిల్లేట్టు చేస్తుంది.
సాధారణంగా స్త్రీలకు 40 తర్వాత శారీరక వాంఛలు తగ్గుముఖం పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు లేట్ మ్యారేజెస్లో ఆలుమగల మధ్య సత్సంబంధాలు కొరవడి, అనురాగం బలపడదు.
వయసుతోబాటు బాధ్యతలు, ప్రాధాన్యతలు మారి ఆలుమగల మధ్య ఆంతరాలు చోటుచేసుకుంటాయి. అప్పుడిక ప్రేమకి చోటెక్కడిది? ద్వేషం బయల్దేరుతుంది.
మూడు పదులు దాటాక సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గి పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువవుతాయి. గర్భం ధరించినా ప్రసవం కష్టమవుతుంది.
అన్నిటినీ మించి తగిన వయసులో పిల్లలు పుడితే వాళ్ల అల్లరిచేష్టలను భరించే ఓర్పూ సహనం ఉంటాయి. ఆలస్యమైనప్పుడు చిన్నారుల్ని గారాబం చేయడానికి బదులు చీటికి మాటికి అసహనం, ఆందోళన తప్పవు.