Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలి పెరిగిపోయింది. వాతావరణంలో వచ్చే మార్పులు, కనిష్ఠ ఉష్ణోగ్రతల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా చలికాలంలో కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా కీళ్ల మధ్య ఉండే ద్రవం చిక్కబడుతుంది. దీంతో ఎముకలు, కీళ్లు పట్టేసినట్టు అనిపిస్తాయి. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ వ్యాధుల్లో కీళ్ల నొప్పులు తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఏ వయసు వారినైనా ప్రభావితం చేస్తుంది.
చలిలో కీళ్ల నొప్పులు ఉన్నాయని ఎక్కువ మంది డాక్టర్లను ఆశ్రయిస్తుంటారు. సాధారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల సిరలు కుచించుకుపోతాయి. విటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకల నొప్పి అధికమవుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు తమ ఎముకల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 50 ఏండ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సమస్య యువతలో కూడా కనిపిస్తోంది. చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డీ సరిగా అందడం లేదని వైద్యులు చెబుతున్నారు. రోజంతా కూర్చుని పని చేసే వారికి ఈ సమస్య అధికంగా ఉంటుంది.
కంప్యూటర్ ముందు గంటలకు గంటలు కూర్చుని పనిచేసే వారిలో కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. ఒకే చోట ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల ఎముకలు దృఢత్వం తగ్గి, కీళ్ల నొప్పులు పెరుగుతాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే పనిలో విరామం తీసుకోవడం తప్పనిసరి. రోజూ ఉదయపు నడక వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని వయసుల వారు ఉదయం వాకింగ్‌కు వెళ్లాలి. రోజూ కనీసం రెండు నుంచి మూడు కిలోమీటర్లు నడవడానికి ప్రయత్నించాలి. కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. సూర్యరశ్మిని తీసుకోకపోతే విటమిన్ డి లోపం వచ్చే ప్రమాదం ఉంది. ఆహారం పట్ల శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం. దీని కోసం ఆహారంలో తగినంత మొత్తంలో ప్రొటీన్లు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి.
పాలు, పెరుగును డైట్‌లో భాగం చేసుకోవాలి. పాలలో విటమిన్ డి అధికం. క్యాల్షియం అవసరం ఉన్న వారు పాలను తీసుకోవాలి. వేడి నూనెతో మసాజ్ చేయడం వల్ల ఎముకలకు చాలా మేలు జరుగుతుంది. ఇది ఎముకలకు వేడిని ఇవ్వడంతోపాటు కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి పడుకునే ముందు మసాజ్ చేయడం చాలా మంచిది.