Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి తర్వాత చాలా సంస్థలు ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ జాబితాలో మీరుండొద్దంటే..
తక్కువతో ఎక్కువ లాభం.. సంస్థ అనుసరించే ప్రధాన సూత్రమిది. ఇచ్చిన పని చేసుకొని పోతా.. అన్న తీరు ఎప్పుడూ పనికిరాదు. ఎలాంటి స్థితిలోనైనా బాధ్యత తీసుకునే తత్వం ఉంటేనే స్థానాన్ని పదిలపరచుకోగలరు. ఆ తత్వం ఉందేమో చెక్ చేసుకోండి.
ఫలానా వ్యక్తి పనిచేస్తే పక్కాగా ఉంటుంది. కొందరి విషయంలో ఈ ప్రస్తావన చాలా సార్లు వింటుంటాం. నిజానికి వంట పూర్తవగానే స్టవ్ తుడి చేయడం, గట్టు ఖాళీ చేయడం ఇలా ఇంట్లో ఈ పద్ధతిని చక్కగా అనుసరిస్తాం. మరి ఆఫీసులోనూ ఈ విధానాన్ని పాటిస్తున్నారా? మీ పనిని ఇంకొకరు సరిచేయాల్సి వస్తోందంటే ఇద్దరి సమయం వృథా అవుతోందని అర్థం. సంస్థ ఆచితూచి ఖర్చు చేస్తుందీ సమయంలో.. అలాంటప్పుడు వనరులు వృథా అనుకుంటుంది కదా.. అందుకే మీ తీరును సరిచూసుకోండి.
ఏడాదంతా ఆఫీసుకే పరిమితమవ్వాలని ఏ సంస్థా కోరుకోదు. వ్యక్తిగత అవసరాలు, ఆరోగ్య సమస్యలతో సెలవులు తప్పవు. ఎన్ని బాధ్యతలున్నా.. మరీ ఎక్కువ సెలవులు పెడుతున్నారేమో గమనించుకోండి. కొన్ని సార్లు సెలవు రోజుల్లోనూ పని చేయాల్సి ఉంటుంది. తరచూ దాన్ని వదులుకోవడం ఇబ్బందే. కానీ ఎప్పుడో ఒకసారైనా రావడానికీ ఇష్టపడకపోతే. సంస్థ అవసరాల కంటే స్వవిషయాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారన్న మెసేజ్ వెళ్లొచ్చు. అందుకే అత్యవసరాలకు ముందుండేలా సిద్ధమవ్వండి.
సమయం బాలేనప్పుడు అరటిపండు తిన్నా పళ్లూడాయని సామెత ఉంది. అంతా బాగున్నప్పుడు కాస్త సేదతీరినా చూసీ చూడనట్టు ఉంటారు. పరిస్థితి మారినప్పుడే సమస్య. టీ, భోజన విరామాలను నిర్దేశిత సమయాన్ని మించనీయకండి. కావాలంటే మధ్య మధ్యలో అలా వెళ్లి రావొచ్చు. కానీ అప్పుడూ ఎక్కువ సేపు వద్దు. అవసరమైతే అదనపు సమయమూ చేయాల్సి రావొచ్చు. మిగతావారు ఉన్నారులే అని తప్పించుకుంటున్నారో మీకే సమస్య కావొచ్చు.
ఇలాంటి సమయాల్లో చిన్న పొరపాటుకీ భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను ఆదమరపొద్దు. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాకే సబ్‌మిట్ చేయడం అలవాటు చేసుకుంటే ఆ పరిస్థితి దరిచేరదు.