Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమంది పని ధ్యాసలో పడిపోయి నిద్రను త్యాగం చేస్తుంటారు.. మరికొందరు ఇతరులతో కలవడం ఇష్టం లేక ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. నిజానికి ఇవన్నీ మన జీవనశైలిలో ఓ భాగమే అనుకుంటాం.. కానీ ఇటువంటి అలవాట్లే అటు శారీరకంగా, ఇటు మానసికంగా మనల్ని అనారోగ్యాల పాలు చేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే వీటిని మార్చుకుంటే తప్ప సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోలేమంటున్నారు.
కొందరికి ఇతరులతో కలవడం ఇష్టం లేక ఒంటరిగా ఉంటే.. మరికొందరు పరిస్థితుల రీత్యా అయిన వారికి దూరంగా, ఒంటరిగా ఉండాల్సి రావచ్చు. ఏదేమైనా దీనివల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు. ఓ అధ్యయనంలో భాగంగా.. ఒంటరిగా ఉండడం వల్ల శారీరకంగా, మానసికంగా పలు అనారోగ్యాలు తలెత్తడం వారు గమనించారు. అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, స్థూలకాయం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, అల్జీమర్స్ వ్యాధి, డిప్రెషన్, యాంగ్జైటీ.. వంటి సమస్యలన్నింటికీ మూల కారణం ఒంటరితనమే అని తేల్చారు. మరి దీన్నిలాగే కొనసాగిస్తే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్టవుతుంది. కాబట్టి ఒంటరితనాన్ని వీడి.. నలుగురితో కలిసిపోవడం, మనసుకు నచ్చిన వారితో ప్రేమగా మాట్లాడడం, మనసులోకి ఎలాంటి ఆలోచనలు రాకుండా ఇష్టమైన పనులు చేయడం.. ఆలోచిస్తే ఇలాంటి పరిష్కార మార్గాలు బోలెడుంటాయి. ఇవేవీ వర్కవుట్ కాకపోతే మానసిక నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకున్నా ఫలితం ఉంటుంది.
కూర్చున్నా, నిల్చున్నా.. ఏదైనా సపోర్ట్ తీసుకొని దానికి చేరగిలబడడం మనలో చాలామందికి అలవాటు. నిజానికి దీనివల్ల వివిధ రకాల నొప్పులతో బాధపడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. మనకు సౌకర్యవంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఓ గంట పాటు లేవకుండా చేరగిలబడి కూర్చోవడం, వంగి కూర్చోవడం వల్ల.. వెన్ను, మెడ, భుజాలు.. వంటి శరీర భాగాల్లో నొప్పి మొదలవుతుంది.. ఇది క్రమేపీ తలనొప్పికి దారితీస్తుంది. ఫలితంగా పనిపై శ్రద్ధ, ఏకాగ్రత తగ్గిపోతాయి. మరి, ఈ సమస్య రాకూడదంటే.. కూర్చున్నా, నిల్చున్నా శరీర భంగిమ నిటారుగా ఉండేలా చూసుకోవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా చేరగిలబడిపోవడం కాకుండా.. నిటారుగా కూర్చొని వెనక్కి ఒరగాలి.. ఈ క్రమంలో వీపుతో పాటు భుజాలు కూడా కుర్చీకి ఆనించాలి. రెండు చేతుల్ని కుర్చీ హ్యాండిల్స్పై పెట్టి కంఫర్టబుల్గా పని చేసుకోవాలి. అలాగని ఎక్కువ సమయం కూర్చుండిపోకుండా గంటకోసారైనా ఓ ఐదు పది నిమిషాల పాటు నిలబడి పనికి కాస్త విరామం ఇవ్వడం, అదీ కుదరకపోతే ఉన్న చోటే నిలబడి అటూ ఇటూ తిరగడం, కుర్చీలో కూర్చొనే చిన్నపాటి వ్యాయామాలు చేయడం.. మంచిది. తద్వారా ఎలాంటి నొప్పులూ రాకుండా జాగ్రత్తపడచ్చు.
పిల్లలు వదిలేసిన ఆహార పదార్థాలు తినడం చాలామంది తల్లులకు అలవాటే! ఈ క్రమంలో మనకు తెలియకుండానే రోజూ అదనంగా కొన్ని క్యాలరీలు మన శరీరంలోకి చేరతాయంటున్నారు నిపుణులు. ఇదిలాగే కొనసాగితే కొన్ని వారాల తర్వాత బరువులో పెరుగుదల కనిపించడం ఖాయమంటున్నారు. అందుకే పిల్లలు వదిలేసింది తినడంలో తప్పు లేకపోయినా.. బరువు అదుపులో ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఈ అలవాటు మానుకోవాలంటున్నారు.