Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటి పిల్లలను నియంత్రించడం కష్టం. ఈమాట ఎన్నిసార్లు వినుంటామో కదా... మూడేండ్లు నిండకుండానే ఫోన్ను వాడుతుండటం.. ఆరిందల్లా బోలెడు విషయాల్ని చెప్పేస్తుండటం.. ఎన్ని చూస్తున్నాం. 'పిల్లలు కాదు పిడుగులు' అంటూ ఆశ్చర్యపోతుంటాం. మరి.. వాళ్లకు తగ్గట్టుగా మన పెంపకమూ ఉండాలి కదా..?
ఒకప్పుడు తరాల మధ్య అంతరం పదేండ్లుగా ఉండేది. ఇప్పుడది అయిదేండ్లకు తగ్గిపోయిం దంటున్నారు నిపుణులు. అంటే మనకు మన పిల్లలకు మధ్య ఆలోచనల్లో వ్యత్యాసం ఎంత ఉండాలి? మనం పెరిగిన వాతావరణం వాళ్లకు సరిపడదు. కాబట్టి.. 'మేం పెరగలేదా, పిల్లల్ని పెంచలేదా' అన్న ధీమా పక్కన పెట్టేయండి. అలవాట్లు, అభిప్రాయాలు ఎటువైపు సాగుతున్నాయో గమనించడం మొదలుపెట్టండి.
ఆలోచనల్లో, నేర్చుకోవడంలో ఎంత వేగం పెరిగినా.. వాళ్లు ముందు గమనించేది మనల్నే. అందరికీ అన్నీ తెలియాలనేం లేదు. ఈ సూత్రం మనకీ, పిల్లలకీ ఇద్దరికీ వర్తిస్తుంది. కాబట్టి మీ పిల్లలు అన్నింటా ముందుండాలని ఆశించకండి. తప్పు చేస్తే.. ఎలా దండిద్దామని కాక.. ఎలా సరిచేయొచ్చో ఆలోచించండి. మార్చుకోవడానికి మీరేం చేయాలో వాళ్లనీ కనుక్కోండి.
చూడటానికి చిన్నగానే కనిపిస్తారు. నోరు తెరిస్తే కానీ అర్థమవదు.. వాళ్ల ఊహాశక్తి స్థాయేంటో. అయితే మురిసిపోవడానికే పరిమితమవొద్దు.. అలా అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు. ప్రోత్సహించండి. ఆసక్తి కొనసాగేలా అవసరమైన పుస్తకాలు, పరికరాలు కొనిపెడితే.. అభిరుచికి మెరుగులు పెట్టుకుంటారు.
'అందరూ మన పిల్లల్ని మెచ్చుకోవాలి'.. ఇలా కోరుకోని తల్లుండదు. ఎవరైనా మెరుగైన ప్రదర్శన చేస్తే.. ఉదాహరణగా చూపిస్తుంటాం కూడా. కానీ అది మీ పిల్లలకు ఒత్తిడిగా మారొచ్చు. 'పిల్లల్లో ఒత్తిడేంట'ని కొట్టిపారేయొద్దు. మనం అయిష్టంగా చేయించేవీ, అన్నింటా తొందర పెట్టడం వంటివి నేర్చుకోవడంపై విరక్తిని, అయిష్టాన్నీ కలిగిస్తాయి. చివరికి అన్నింటిపైనా విముఖత కలగొచ్చు. సరదాగా, ఆసక్తి పెంచే విధానాలేంటో ఆలోచించండి. ప్రతి తల్లి, ప్రతి బిడ్డా ప్రత్యేకమే. కాబట్టి ఎవరినీ అనుసరించొద్దు. మీ అన్యోన్యతే ఆధారంగా.. కలిసి తెలుసుకుంటూ, సర్దుకుపోతూ సాగండి.. బెస్ట్ అమ్మ అవ్వడం ఖాయం.