Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మారుతున్న వాతావరణం కారణంగా ఎలాంటి వ్యక్తులైనా ఇబ్బందులు ఎదుర్కొంటారు. చిన్న పిల్లలపై దీని ప్రభావం ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. మీరు మొదటి సారి తల్లితండ్రులుగా మారినట్లయితే, ఈ వింటర్ సీజన్లో మీరు మీ బేబీ కేర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సీజన్లో అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. చల్లని వాతావరణంలో వైరస్లు, బాక్టీరియాలు వేగంగా వృద్ధి చెందుతాయి. నవజాత శిశువులలో రోగనిరోధక శక్తి పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. దీంతో శిశువులు వెంటనే అనారోగ్యానికి గురవుతారు. అంతే కాకుండా శిశువు చర్మం చాలా మృదువుగా ఉంటుంది. శీతాకాలపు చల్లని గాలి వారి చర్మం నుండి తేమను తీసివేస్తుంది. దాంతో వివిధ చర్మ సమస్యలకు గురవుతారు. అందువల్ల మీ శిశువు ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలను తప్పక తీసుకోండి.
ఎక్కువ దుస్తులు వేయకండి: కొత్తగా తల్లిదండ్రులైన వారు తరచుగా ఈ పొరపాటు చేస్తుంటారు. తమ నవజాత శిశువులను చలి నుంచి కాపాడటానికి ఎక్కువ దుస్తులు వేస్తుంటారు. కానీ అప్పుడే పుట్టిన బిడ్డలను అవసరానికి మించి కవర్ చేయడం సరికాదు. ఇలా చేయడం వల్ల శిశువు శరీరంలో ఎక్కువ వేడి ఏర్పడుతుంది. దీని కారణంగా వారు సరిగా నిద్రపోలేరు, శ్వాసకోశ సమస్యలనూ అనుభవించవచ్చు.
చాలా వేడి నీటితో స్నానం చేయవద్దు: చల్లని వాతావరణంలో వేడి నీరు శరీరానికి మంచిగా అనిపిస్తుంది. అయితే ఇది చర్మం సహజ తేమను కూడా తొలగిస్తుంది. అందుకే శిశువులకు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయించాలి.
గోరువెచ్చని నూనెతో మసాజ్: శిశువుకు స్నానం చేయించిన తర్వాత శరీరాన్ని సున్నితంగా మసాజ్ చేయడం అవసరం. బేబీ మసాజ్ కోసం మీరు బాదం నూనె, ఆలివ్ నూనె, కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనెలన్నీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలను కలిగి ఉంటాయి. ఈ నూనెలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అయితే నూనెను మాత్రమే ఉపయోగించాలి. పిల్లల సున్నితమైన చర్మంపై మార్కెట్లో లభించే రసాయన ఉత్పత్తులను ఉపయోగించకపోవడమే మంచిది.
నాసికా చుక్కలు: ఈ కాలంలో పిల్లల్లో ముక్కు దిబ్బడ సమస్య సర్వసాధారణం. డాక్టర్ సూచించిన నాసికా చుక్కలను మీతో ఉంచుకోండి. తద్వారా అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు.
సాక్స్ వేయడం మర్చిపోవద్దు: చలికాలంలో పిల్లల దుస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ సీజన్లో మీ చిన్నపాటి అజాగ్రత్త కూడా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వెచ్చని దుస్తులతో పాటు సాక్స్, టోపీని ధరింపజేసి ఉంచండి. తేలికపాటి చలిని కూడా నిర్లక్ష్యం చేయవద్దు.
చల్లని పదార్థాలు తినిపించవద్దు: చలికాలంలో పొరపాటున కూడా చల్లని ఆహార పదార్థాలను పిల్లలకు తినిపించకండి. మీ బిడ్డకు ఏడు నెలల కంటే ఎక్కువ వయసు ఉంటే, ఆహారం తింటుంటే తాజాగా వండిన ఆహారాన్ని డాక్టర్ సూచించిన విధంగా తినిపించండి. మిగిలిన దానిని ఎక్కువ సేపు ఉంచి తినిపించవద్దు.
సూర్యరశ్మి అవసరం: విటమిన్-డి ని సప్లిమెంట్ చేయడానికి శిశువును వారానికి 1 నుండి 2 సార్లు 10 నిమిషాలు ఎండలోకి తీసుకెళ్లండి. అయితే ఉదయం పూట తేలికపాటి సూర్యకాంతి మాత్రమే శిశువుకు మేలు చేస్తుంది.