Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహౌద్యోగులందరికీ టీం లీడర్ స్ఫూర్తిగా నిలవాలి. సమయపాలన నుంచి ప్రణాళికా బద్ధంగా పనులు పూర్తిచేసే పద్ధతి వరకు బృందనేతను చూసి నేర్చుకొనేలా ఉండాలి. అనుకోకుండా ఎదురయ్యే సమస్యలను కూడా ధైర్యంగా పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాలి. బృందంలో ఉత్సాహాన్ని నింపుతూ, వారికి మార్గదర్శకురాలిగా మారాలి. అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ, కొత్త పాఠాలను చెప్పగలిగే నైపుణ్యాలను టీం లీడర్ నిత్యం పెంచుకోవాలి.హొ
మహిళలు బృందాన్ని నడిపించడంలో సామర్థ్యాలెన్ని ప్రదర్శించినా.. కొన్ని సందర్భాల్లో కింది ఉద్యోగుల చిన్నచూపు తప్పదు. మరికొన్నిచోట్ల లింగవివక్ష ఎదురవుతుంది. ఎంత కష్టపడ్డా మహిళలకు పేరు దక్కకుండా ఆటంకాలెదురవుతుంటాయి. ఇటువంటి సమస్యలను ప్రపంచవ్యాప్తంగా ఉన్నతస్థానాల్లో ఉన్న మహిళలందరూ ఎదుర్కొంటున్నట్టు పలు అధ్యయనాలూ.. చెబుతున్నాయి. అలాగని నిరుత్సాహ పడక్కర్లేదు. వీటిని దాటి, తమని తాము నిరూపించుకునేందుకు మనం నిరంతరం కృషి చేయాలి. బృందాన్ని నడిపించడంలో మన సత్తాను చాటడానికి కృషి చేస్తూ ఉంటేనే విజయం సొంతమవుతుంది.హొ
బృందంలో ప్రతి ఒక్కరితోనూ అనుబంధం కలిగి ఉండే టీం లీడర్ మాత్రమే ఉద్యోగ బాధ్యతల్లోనూ వారిని భాగస్వాములను చేయగలరు. ఉన్నతస్థానంలో ఉన్నాననే భావంతో కాకుండా అందరితోనూ కలిసిపోయే తత్వం ఉండాలి. అప్పుడే సహౌద్యోగులు సమావేశాల్లో తమ ఆలోచనలను స్వేచ్ఛగా వివరించగలుగుతారు. ఉద్యోగ బాధ్యతల్లో తామెదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా చెబుతారు. కిందిస్థాయి ఉద్యోగుల గురించి ఆలోచిస్తూనే, వారందరినీ ఒకతాటిపై నడిపించగలిగే సామర్థ్యం ఉన్న నేతలే అందరి గౌరవాన్నీ అందుకోగలుగుతారు.హొ
సాధించిన విజయ ఫలాల్ని అందరికీ అందించాలి. బృందంలో ప్రతి ఒక్కరినీ అభినందించాలి. ఈ ప్రోత్సాహం మరిన్ని విజయాలకు మార్గమవుతుంది. ఐకమత్యంగా కృషి చేస్తేనే సాధించగలమని అందరిలో అవగాహన కలిగించాలి. బృందం కన్నా ఓ అడుగు ముందు నడవగలిగితేనే మిగతా వారు మనల్ని అనుసరించి స్ఫూర్తి పొందుతారు. వీటన్నింటినీ పాటించే టీం లీడర్ మాత్రమే బృంద సభ్యుల మనసులో స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు.