Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక వస్త్రంపై వేరొక వస్త్ర ఆకృతుల్ని కుట్టటాన్ని ఆప్లిక్ వర్క్ అంటారు. నేడు వచ్చే జాకెట్లపై కుట్టే డిజైన్లను ఆప్లిక్ వర్క్ అనచ్చనుకుంటాను. ఆప్లిక్ అనేది ఫ్రెంచి పదం. ఒడిషా జిల్లాలోని పిపిలీ గ్రామం ఆప్లిక్ వర్క్‌కు ప్రసిద్ధి చెందింది. దీనిని పిపిలీ వర్క్ అని కూడా అంటారు. నేను 'పిపిలీ' గ్రామాన్ని సందర్శించినపుడు ఊరు మొత్తం రంగుల్లో కనిపించింది. ఇంటి మధ్యలో వేలాడ దీసేందుకు షాండ్లియర్ లాంటి వస్త్రపు గొడుగులు ఏ దుకాణంలో చూసినా కనిపిస్తాయి. మా అమ్మ మిషన్ దగ్గర మిగిలిన బట్టల ముక్కల్ని చిన్న చిన్న పువ్వుల్లా చేసి మొత్తాన్ని ఒక పెద్ద వస్త్రంపై కుట్టేది. దీనిని గోడకు అతికించుకునే వాళ్ళం. రంగురంగుల బట్టల ముక్కల్ని ఒకే బట్టపై కుట్టటమే 'ఆప్లిక్ వర్క్' అంటారు. ఈ కళను మనం ప్రస్తుతం పెండిండ్లలో వాడుతున్న షామియానాలకు చూస్తున్నాం. ఆప్లిక్ వర్క్‌ను 'చందువా' అని కూడా పిలుస్తారు. దీనిని 'పిపిలీ వర్క్' అని కూడా అంటారు.
దివాన్ బెడ్‌షీట్స్
దివాన్ పైన వేసుకునే బెడ్షీట్లు, దిండు కవర్లు ఎక్కువగా ఆప్లిక్ వర్కులో కనిపిస్తాయి. సాధారణంగా పసుపు, తెలుపు వంటి లేత రంగుల మీద నిండు రంగుల వస్త్రపు ముక్కలతో డిజైన్ చేసి ఉంటాయి. అలాంటి దిండు కవర్ ఈరోజు ఇంట్లో తయారు చేసి చూద్దాం. లేత పసుపు రంగు వస్త్రం తీసుకొని దాని మీద ఎరుపు, ఆకుపచ్చ రంగుల వస్త్రాలతో చేద్దాం. హృదయాకారంలో ఎరుపు రంగు బట్టను కత్తిరించుకోవాలి. దీని లోపల పలుచని స్పాంజిని పెడతారు. బజార్లో స్పాంజి షీటు దొరుకుతుంది. లేదంటే కొత్త షర్టులు, చీరలు కొన్నపుడు వాటిలో పలుచని స్పాంజి షీటులు వస్తాయి. వాటిని ఉపయోగించవచ్చు. స్పాంజిని కూడా హృదయాకారంలో కత్తిరించి, దీనిని వస్త్రానికి అడుగున పెట్టి అతికించేయాలి. హృదయాకారపు ముక్కలు పూల రెక్కలు అన్నమాట. అంటే పువ్వు తయారు చేస్తున్నాం. కాబట్టి ఆకులు కూడా అవసరం. ఆకుపచ్చ రంగు ఆకులు తయారు చేసి పెట్టుకుని పక్కనుంచాలి. ఆకులు, పూలు పసుపు రంగు బట్ట మీద పెట్టి సూదితో కుట్టాలి. జాగ్రత్తగా కుట్టుకుంటే ఊడిరావు. ఇలా కుట్టాక చుట్టూ బార్డర్లు కుట్టాలి. రెండు మూడు రంగులతో బార్డర్లు కుట్టాలి. దిండు కవర్ తయారవుతుంది. ఇదే పద్ధతిలో బెడ్‌షీటు కూడా చేయాలి. దివాన్ మీద దిండు కవర్లు బెడ్షీట్లు ఇంట్లో చేసుకుంటే అందంగా వస్తాయి.
వాల్స్టిక్కర్
నేను మూడు ఫీట్ల వెడల్పు, మూడు ఫీట్ల పొడవుతో పెద్ద ఆప్లిక్ వర్క్ డిజైను చేశాను. దీనిని గోడకు అతికించుకోవాలి. డబుల్ వే స్టిక్కర్‌ను గానీ, మేకులు కొట్టి గానీ గోడకు వాల్‌పేపర్‌లా అతికించుకోవచ్చు. మల్లె మొగ్గలు, తామర పువ్వులు, బంతులు, నెమళ్ళు, బాతులు, చిలుకలు, ఏనుగులు, చెట్లు, తీగలు, చంద్రుడు, సూర్యుడు వంటి ఆకారాలను ఆప్లిక్ వర్కులో ఎక్కువగా ఉపయోగిస్తారు. వస్త్రపు ముక్కల్ని పెద్ద బట్టపై అతకడానికి టాకాలు వేస్తారు. ఇంకా శాటిన్ స్టిచ్, బ్లైండ్ స్టిచ్, స్ట్రెయిట్ స్టిచ్‌ను వేస్తారు. కొన్ని సార్లు బటన్ హౌల్ స్టిచ్‌ను కూడా వాడతారు. పిపిలీ గ్రామం ఆప్లిక్ వర్క్‌లో అతి పెద్ద థీమ్‌తో ఆప్లిక్ వర్కును చేసి ప్రపంచంలోనే పేరు గాంచింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు ఎక్కింది. భారతదేశ పోరాట వర్ణనలను 54 మీటర్ల వస్త్రంపై ఆప్లిక్ వర్క్‌ను కుట్టి గిన్నిస్ బుక్‌లో ప్రవేశించింది. బార్డర్లను స్ట్రెయిట్‌గా కాకుండా కోణాలతో కుడితే అందంగా ఉంటుంది. నేను ముదురు ఎరుపు రంగుపై కేవలం తెలుపు వస్త్రంతో ఆప్లిక్ వర్కును పూర్తి చేశాను. నేను చిన్నప్పుడు ఆప్లిక్ వర్క్‌తో ఫ్యాన్‌కు కవర్కుట్టాను. టేబుల్ ఫ్యాన్‌కు దుమ్ము పడుతుందని కవర్ కుట్టి దానిపై ఆప్లిక్ వర్క్ చేశాను.
చీరను కుట్టవచ్చు
ఒకప్పుడు ఆప్లిక్ వర్క్ చీరలు చాలా ఫ్యాషన్‌గా ఉండేవి. ఇప్పుడు కూడా చీరలు కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం బ్లౌజులు ఎక్కువగా ఎంబ్రాయిడరీ తర్వాత ఆప్లిక్ వర్క్ స్టైల్లోనే కనిపిస్తున్నాయి. చీరల్లో ఉన్న రంగుల వస్త్రాల ముక్కల్ని బ్లౌజులపై అందంగా కుడుతున్నారు. ఆప్లిక్ వర్క్ చీరలుల కూడా చాలా ప్రసిద్ధి. కోణాలు ఉండేలా పువ్వుల్ని కుట్టడం సులభం. చీరలు, జాకెట్లకు మాత్రం స్పాజిషీటు పెట్టడం అవసరం లేదు. సింపుల్ డిజైన్‌తో చీరను కుట్టుకోవచ్చు. ఒకటి రెండు ప్రయత్నిస్తే దానిలో టెక్కిక్లు అర్థమవుతాయి. నేను పెండ్లయిన కొత్తలో గులాబీ రంగు చీర మీద హాఫ్వూట్ రంగు వస్త్రాల ముక్కలతో చాలా సింపుల్ డిజైన్ కుట్టుకున్నాను. చీరలు ఎక్కువగా కుట్టలేదు కానీ బ్లౌజులు మాత్రం బోలెడు కుట్టాను. ప్రస్తుతం అవి ఫ్యాషన్ కాబట్టి కుట్టుకుంటున్నాను.
బెడ్షీట్లు కుడదామా!
ఇంతకు ముందు దివాన్ మీద వేసుకునే బెడ్షీట్లకు డిజైన్ చేశాం కదా! ఆ డిజైన్‌లో పువ్వుల రెక్కలు ఏ రెక్కకు ఆ రెక్కను కత్తిరించుకుని కుట్టేస్తాం. ఇంకా స్పాంజి ముక్కను కూడా పెట్టాము. ఈ పెద్ద బెడ్షీటుకు అలా కాదు. దీనికి వేసే డిజైన్ మొత్తం ఒకే వస్త్రంపై కత్తిరించాలి. డిజైన్ వేయాలనుకున్న ఆకారాన్ని బట్టి వస్త్రం ముక్కను తీసుకోవాలి. ఆ వస్త్రాన్ని మడతలు వేసుకుంటూ వెళ్ళాక డిజైనను కత్తిరించాలి. ముందుగా కాగితం మీద కత్తిరించుకుంటే మంచిది. ఎక్కడా వస్త్రం ముక్క తెగిపోకూడదు. డిజైన్ కత్తిరించాక పెద్ద బెడ్‌షీటు మీద కుట్టాలి. బెడ్‌షీటు చుట్టూతా నాలుగు డిజైన్లు ఒకే రకంగా ఉన్నప్పటికీ మధ్యలో వేసే డిజైను పెద్దగా వేరే ఆకారంలో ఉంటే బాగుంటుంది. డిజైను వస్త్రం మొత్తం కుట్టుకునేటపుడు సులభంగా ఉంటుంది. అదే రంగు దారాన్ని సూదికి ఎక్కించుకుని డిజైను వస్త్రం మీదుగా హెమింగ్ లాంటి కుట్టు కూడా కుట్టవచ్చు. ఓవర్‌లాక్ వంటి కుట్టు కూడా కుట్టవచ్చు.
కుర్తీలు కూడా కుట్టుకోవచ్చు
కుర్తీలకు ఆప్లిక్ వర్క్ కుట్టేటపుడు కొంత కట్ వర్క్ కూడా చేసుకోవచ్చు. కట్వర్క్లో ఎక్కడెక్కడ వస్త్రానికి చిల్లులు కావాలో అక్కడక్కడ సాంబ్రాణి కడ్డీతో కాల్చేయాలి. అప్పుడు అక్కడ రంధ్రాలు ఏర్పడతాయి. ఇది కావాలనుకుంటేనే చేసుకోవాలి. లేదంటే మామూలుగా కుర్తీ మీద డిజైన్ కుట్టేయవచ్చు. ఇప్పుడు ఇంకో వెరైటీ చూద్దాం. ఇందులో పూలరెక్కల్ని రెండు పొరలతో కుట్టుకోవాలి. వాటిని తిరగేస్తే కుట్టు లోపలికి పోతుంది. ఇలా పూల రెక్కలు, ఆకులు ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. కుర్తీ మీద డిజైన్‌లో లతల్ని మామూలు గొలుసుకుట్టుతో కుట్టుకోవాలి. ఆ తీగలకు పువ్వులు పూసినట్టుగా ఆప్లిక్ వర్క్ చేసిన పువ్వుల్ని వాడాలి. అంటే ఇందులో ఎంబ్రాయిడరీ కుట్లతో ఆప్లిక్ వర్క్ కలిపి కుట్టాలి. ఇదొక వెరైటీ.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్