Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది మెనోపాజ్ దశలో బరువు పెరగడం సహజం. శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయులు తగ్గిపోవడం, వయసు పెరిగే కొద్దీ కండరాల దారుఢ్యం తగ్గి.. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వంటివి దీనికి కారణం. అలాగే వయసు పైబడే కొద్దీ శరీరంలో జీవక్రియల రేటు కూడా మందగించడం వల్ల క్యాలరీలు కరిగించే శక్తి కూడా రోజురోజుకీ క్షీణిస్తుంది. అయినప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహార నియమాలు పాటించడం వంటి వాటి వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మెనోపాజ్ దశలో బరువు తగ్గాలంటే ఎలాంటి విషయాలు దృష్టిలో ఉంచుకోవాలో చూద్దాం...
మెనోపాజ్ దశలోకి చేరిన మహిళలు బరువు పెరగకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడంతో పాటు సమతులాహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. దీనికోసం తాజా పండ్లు, కూరగాయలు.. వంటి పోషకాలు ఎక్కువగా లభించే ఆహార పదార్థాల్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. తక్షణమే ఇంకా మంచి ఫలితం రావాలంటే సంబంధిత నిపుణులను సంప్రదించి వాళ్ల సలహా మేరకు ఆహారంలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది.
వయసు పైబడే కొద్దీ రకరకాల ఆరోగ్య సమస్యలతో పాటు బరువు పెరగడం కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా మెనోపాజ్ దశలోకి చేరిన మహిళల విషయంలో పెరిగే బరువుతో పాటే ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. దీని నుంచి విముక్తి పొందాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఓ మార్గం. ఇంట్లో రోజువారీ పనులతో పాటు ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేయడం, నిపుణుల సలహాతో జిమ్లో చేరడం, వ్యాయామాలు చేయడం అవసరం. దీనివల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు.. ఆరోగ్య సమస్యలకూ చెక్ పెట్టచ్చు.
మెనోపాజ్ దశలో చాలామందికి ఎదురయ్యే రకరకాల ఒత్తిళ్ల వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. ఫలితంగా ఈ సమస్యలు బరువు పెరగడానికి దారితీస్తాయి. మరి దీన్నుంచి విముక్తి పొందాలంటే మెడిటేషన్ వంటి శిక్షణ తరగతుల్లో చేరడం ఉత్తమం. దీనివల్ల అటు ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత సొంతమవుతుంది.. ఇటు రాత్రుళ్లు నిద్ర కూడా బాగా పడుతుంది. ఫలితంగా బరువు తగ్గచ్చు.
కొంతమంది మహిళలు కొన్ని రకాల ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ వద్ద చెప్పడానికి వెనకాడుతుంటారు. మెనోపాజ్ తర్వాత వచ్చే సమస్యల విషయంలోనూ అలాగే చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ సమస్యలన్నిటినీ ఎలాంటి సంకోచం లేకుండా చెప్పగలిగినప్పుడు, ఒకవేళ ఈ దశలో అవసరమైతే.. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, బ్యాలెన్సింగ్ థెరపీ.. లాంటి చికిత్సల గురించి వ్కెద్యులు సూచించే అవకాశం ఉంటుంది. ఆయా చికిత్సల వల్ల కూడా మెనోపాజ్ దశలో బరువు పెరగడాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.